ఐక్య ప్రతిఘటన

ఢిల్లీ పాలనా వ్యవహారాల్లో అంతిమ నిర్ణయాధికారాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జి)కు దఖలు పరుస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నిరంకుశ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతు అంతకంతకూ విస్తరిస్తుండటం మంచి పరిణామం. ఆర్డినెన్స్‌కు చట్ట రూపం ఇచ్చేందుకు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని మంగళవారంనాడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మధ్య జరిగిన భేటీ అనంతరం ఏచూరి ప్రకటించారు. మిగతా అన్ని విపక్ష పార్టీలూ ఏకతాటిపైకొచ్చి ఆర్డినెన్స్‌ను తిప్పికొట్టాలని పిలుపునిచ్చాయి. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ఓటు వేసి రోల్‌బ్యాక్‌ చేయాలంటూ కేజ్రీవాల్‌ కొన్ని రోజులుగా ప్రతిపక్ష నాయకులను స్వయంగా కలుసుకొని మద్దతు సమీకరణ చేపట్టగా, పలు పార్టీల నుంచి సానుకూల స్పందన వ్యక్తం కావడం విశేషం. ప్రస్తుతం బీజేపీకి రాజ్యసభలో తగినంత బలం లేదు. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలన్నీ సమన్వయంతో వ్యవహరించి రాజ్యాంగ విరుద్ధ ఆర్డినెన్స్‌ను వెనక్కికొట్టగలిగితే, రాజ్యాంగాన్ని, సమాఖ్య వ్యవస్థను, తుదకు ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్న మోడీ ప్రభుత్వ దూకుడుకు కొంతైనా కళ్లెం పడుతుంది.
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కబ్జా చేసేందుకు మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చింది. అధికారుల నియామకాలు, బదిలీలపై అధికారం ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విస్పష్టంగా తీర్పు చెప్పినప్పటికీ, అధికారాలను ఎల్‌జికి అప్పగిస్తూ ఆర్డినెన్స్‌ తేవడం దౌర్జన్యపూరితం. కోర్టు ధిక్కారంతో పాటు న్యాయవ్యవస్థకు సవాల్‌ విసరడమే. పార్లమెంట్‌నూ పక్కనపెట్టింది మోడీ సర్కారు. ఏదైనా ప్రధాన అంశం ముందుకొచ్చినప్పుడు పార్లమెంట్‌లో కూలం కషంగా చర్చించి, అన్ని పక్షాల అభిప్రాయం తీసుకొని, బిల్లు ఆమోదింపజేసుకోవడం ప్రజాస్వామ్య పద్ధతి. ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం తీర్పు వచ్చిన వెనువెంటనే, అదేదో కొంపలు మునిగి పోయినట్లు అత్యయిక ఉత్తర్వు తెచ్చింది మోడీ ప్రభుత్వం. అందుకు జాతి ప్రయోజనాలంటూ వక్ర భాష్యం లంకించుకుంది. జాతి ప్రయోజనాలు సుప్రీం రాజ్యాంగ ధర్మాసనానికి తెలీదని న్యాయ స్థానంపైనే అభాండాలు మోపింది. ఆప్‌ ప్రభుత్వంపై కక్ష సాధింపు, తనకు సుప్రీంలో బెడిసికొట్టిందన్న బాధ తప్ప ఆర్డినెన్స్‌ తేవడానికి మరే కారణం కనిపించదు. మోడీ ప్రభుత్వ తొలినాళ్లల్లో ఆర్డినెన్స్‌ల వెల్లువపై నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బహిరంగంగానే అసహనం తెలిపారు. కాబట్టి తాను అనుకున్నది రాజ్యాంగ విరుద్ధమైనా, కోర్టుధిక్కరణ అయినా ఏకపక్షంగా అమలు చేయడమే బీజేపీ ఎంచుకున్న బాట.
రాజ్యాంగం మన వ్యవస్థను ఫెడరల్‌ వ్యవస్థగా నిర్దేశించింది. కేంద్రం, రాష్ట్రాల అధికారాలను నిర్వచించింది. విభిన్న జాతుల, సంస్కృతుల, ప్రాంతాల సమాహారంగా ఉన్న దేశం మనుగడ సాగించాలంటే లౌకిక, సమాఖ్య స్ఫూర్తే అత్యుత్తమ పరిష్కారంగా భావించింది. కాగా ఆర్‌ఎస్‌ఎస్‌ మార్గదర్శకత్వంలో నడుస్తున్న మోడీ ప్రభుత్వం కేంద్రం వద్ద అధికారాలు కేంద్రీకరించేందుకు, రాష్ట్రాల హక్కుల్లోకి బలవంతంగా చొరబడేందుకు అన్ని విధాలా బరి తెగిస్తోంది. జిఎస్‌టి, మూడు వ్యవసాయ చట్టాలు, సహకార మంత్రిత్వశాఖ ఏర్పాటు, వంటి విషయాల్లో రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోవట్లేదు. విద్యుత్‌ సంస్కరణలపైనా అదే ధోరణి. ఈ పూర్వరంగంలో ఢిల్లీ అధికారాల్లో కేంద్ర పెత్తనం కోసం మోడీ సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాదు. రేపొద్దున ఏ రాష్ట్రానికైనా రావొచ్చు. ‘మనదాకా రాలేదు కదా అనుకుంటే మనదాకా వచ్చాక మనల్ని రక్షించడానికి ఎవరూ ఉండరన్న’ హిట్లర్‌ కాలంనాటి జర్మనీ నానుడిని ప్రతిపక్షాలు మననం చేసుకోవాలి. బీజేపీ పట్ల అవకాశవాదంతో వ్యవహరించే వైసిపి, టిడిపి, జనసేన వంటి పార్టీలు ఆలోచించుకోవాల్సిన సమయం. ‘ఢిల్లీ’ ఆర్డినెన్స్‌ను పార్లమెంట్‌లో తిప్పికొట్టి రాజ్యాంగ, సమాఖ్య వ్యవస్థలను కాపాడుకోవాలి.

Spread the love