స్వరాష్ట్రంలో… సగర్వంగా.. సాగు

– 26 కు పైగా సంక్షేమ పథకాలు
– పచ్చబడ్డ పల్లెలు
– పెరిగిన పంట విస్తీర్ణం
– వినూత్న కార్యక్రమాలతో దేశానికే ఆదర్శం
– నేడు రైతు దినోత్సవం…
నవతెలంగాణ -నల్గొండ కలెక్టరేట్‌

నాడు సాగునీరు లేక.. విద్యుత్‌ కోతలతో బీడు పడ్డ భూములు స్వరాష్ట్ర%శీ% ఏర్పాటు జరిగాక పచ్చగా మారాయి. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్న సామెతను గట్టిగా నమ్మే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్‌. అందుకే రాష్ట్రం ఏర్పాటు కాగానే ఆయన దష్టి ప్రధానంగా రైతు సంక్షేమం పైనే పడింది. రైతు దుక్కి దున్నింది మొదలు పంట కొనుగోలు దాకా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమం కోసం అనేక రకాల పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే. రైతు బందు, రైతు బీమా, ఉచిత విద్యుత్‌, కాలేశ్వరం ప్రాజెక్ట్‌, మిషన్‌ కాకతీయ, ఇలా పలు రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తు తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఒకటి కాదు రెండు కాదు రైతు సంక్షేమం కోసం 26 పథకాలను అమలు చేస్తోంది. రుణమాఫీ, ఇన్పుట్‌ సబ్సిడీ, డ్రిప్‌ పథకం రైతు కు మేలు చేస్తున్నాయి. సకాలంలో విత్తనాలు, ఎరువుల పంపిణీ. నకిలి విత్తనాల సరఫరా పై పీడి యాక్ట్‌, సమీకత మార్కెట్లు, రైతుబంధు సమితులు, రైతు వేదిక లను ఏర్పాటు చేశారు. ధాన్యం నిల్వల కోసం గోదాముల సామర్థ్యం పెంపు, రైతులకు మార్కెట్‌ కమిటీల్లో రిజర్వేషన్లు, భూ రికార్డుల సమగ్ర సర్వే, అంతేకాకుండా వ్యవసాయ అనుబంధ రంగాల కోసం గొర్రెలు, చేపల పంపిణీ, పాలకు ప్రోత్సాహం, గొర్రెలకు నట్టల నివారణ, సంచార పశు వైద్యశాలల ను ఏర్పాటు చేసింది. ఇలా రైతు సంక్షేమ పథకాలతో నాడు మోడువారిన పల్లెలు నేడు పచ్చబడ్డాయి. దీంతో సమైక్య పాలనలో రైతు ఆత్మహత్యల నుండి స్వరాష్ట్రంలో వ్యవసాయం పండగల మారింది. జిల్లాలో కూడా పంట సాగు పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికే ఇతర రాష్ట్రాలలో అమలు జరుగుతుండగా అవి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతు సంక్షేమ పథకాలతో స్వరాష్ట్రంలో సగర్వంగా సాగు చేసుకునేలా రైతు అడుగులు వేస్తున్నాడు.
తిరోగమనం నుండి పురోగమనం…
నాడు తెలంగాణలో వ్యవసాయ రంగం దండగ అంటే నేడు పండగల మారింది. రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. నాడు వానకాలం పంట విస్తీర్ణం 740655 ఎకరాలు ఉంటే నేడు11,55,020 ఎకరాలకు విస్తరించగా యాసంగిలో నాడు 2,06737 ఎకరాలు ఉంటే నేడు 5,81,620 ఎకరాలకు పెరిగింది. అదేవిధంగా విత్తనాలు, ఎరువుల విషయంలో నాడు పచ్చి రొట్టె విత్తనాల పంపిణీ 3000 కింటాలు, ఎరువు బఫర్‌ నిలువలు 6000 మెట్రిక్‌ టన్నులు గా ఉంది. అది నేడు పచ్చి రొట్టె విత్తనాల పంపిణీ 6,800 క్వింటాలు కాగా ఎరువుల బఫర్‌ నిల్వలు 15 వేల మెట్రిక్‌ టన్నులకు పెరిగింది. వ్యవసాయ విస్తరణ సేవలో గతంలో మండలానికి ఒకరు లేదా ఇద్దరు వ్యవసాయ విస్తరణ అధికారులు ఉండేవారు. నేడు ప్రతి 5 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి చొప్పున 140 మంది విస్తరణ అధికారులను నియమించారు. నాడు రైతులకు శిక్షణ ను ఇచ్చేందుకు సదుపాయాలు లేకపొగా ప్రస్తుతం జిల్లాలో ప్రతి క్లస్టర్‌ కు ఒకటి చొప్పున 140 రైతు వేదికలను ఏర్పాటు చేశారు. గతంలో భూగర్భ జలాలు అడుగంటి కొద్ది పార్టీ నీళ్లతో సాగు గణనీయంగా పడిపోయింది. వ్యవసాయ భూములు బీటలు వారాయి 1,40, 652 ఎకరాలలో సాగులో ఉండేది. మిషన్‌ కాకతీయ, ప్రాజెక్టుల పునరుద్ధరణ వంటి అంశాలతో భూగర్భ జలాలు పెరిగి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. నేడు 504200ఎకరాలకు సాగు పెరిగింది. అప్పట్లో ఫేజ్‌ ల వారిగా విద్యుత్‌ సరఫరా జరిగేది. రాత్రివేళ సరఫరా.. రైతు మరణాలతో పాటు వేసిన నాట్లు బీటలు పారేది. ప్రస్తుతం నిరంతరయంగా ఉచిత విద్యుత్‌ తో పచ్చని పంటలు చేతికి వస్తున్నాయి. గతంలో పంటలను దళారులు కొనుగోలు చేస్తే నేడు రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి, సహకార కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలను చేస్తుంది.
ఆదుకున్న రైతుబంధు…
పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీల బారినపడి ప్రాణాలు తీసుకున్నారు. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధును 2018లో ప్రవేశపెట్టింది. తీసుకువచ్చిన రైతుబంధు ద్వారా ప్రతి ఏటా రైతుకు ఎకరానికి పదివేల చొప్పున రైతు ఖాతాలో జమ అవుతుంది. నల్లగొండ జిల్లాలో నేటికీ పది విడతల్లో 4,83,179 మంది రైతులకు 5251.96 కోట్లను పంపిణీ చేశారు.
బీమా తెచ్చిన ధీమా…
రైతు అకారణంగా మరణిస్తే కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండేందుకు రైతు బీమా ను కూడా 2018 వ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రైతు మరణించిన వారంలోనే రైతు కుటుంబానికి 5 లక్షల ఎక్స్‌ గ్రేషియా అందిస్తారు. ఇన్సూరెన్స్‌ బీమా మొత్తాన్ని ప్రభుత్వమే రైతు పేరున చెల్లిస్తుంది. నేటికీ నల్లగొండ జిల్లాలో 6161 రైతు కుటుంబాలకు 308.05 కోట్లు పంపిణీ చేశారు.
అనుబంధ రంగాలకు ప్రోత్సాహకం…
గొర్రెల పంపిణీ తో బాసటగా..
వ్యవసాయానికి ప్రధమ ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే గొర్రెల పంపిణీ తో బాసటగా నిలుస్తుంది. ప్రభుత్వం మొదటి విడత గొర్రెల పంపిణీలో జిల్లాలో 28236 యూనిట్లు మంజూరయ్యాయి. ఇందులో ఒక్కొక్క యూనిట్‌ కు 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందించారు. వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం 265 కోట్ల రూపాయల సబ్సిడీని అందించింది. రెండో విడతలో 37078 యూనిట్లను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 466 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం కేటాయించింది.
నేడు రైతు దినోత్సవం…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. జిల్లాలో ఉన్న 140 క్లస్టర్ల లో కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ ఎమ్మెల్యే తో కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధికారులు రైతులు ఎడ్లబండ్లపై తరలిరావాలని పిలుపునిచ్చారు. రైతు వేదికల వద్ద రైతులకు భోజనాలను ఏర్పాటు చేసి వారితో కలిసి సహపంక్తి భోజనాలను చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం రంగ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకాలను వివరించనున్నారు.

Spread the love