పొత్తులపై చర్చలు

– అమిత్‌ షా, నడ్డాతో చంద్రబాబు భేటీ
– ఏపి, తెలంగాణ రాజకీయ పరిస్థితి చర్చ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీజేపీ, టిడిపి మధ్య పొత్తుల చర్చలు ప్రారంభం అయ్యాయి. కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జెపి నడ్డాతో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాత్రి 9 గంటల నుంచి 9:45 గంటల వరకు భేటీ జరిగింది. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీ ఏకాంతంగానే జరిగింది. వీరి మధ్య రాజకీయ చర్చలు జరిగాయి. మరికొన్ని నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాదిలో రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికల పొత్తులపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఇటీవలి తెలంగాణ బీజేపీ నేతలు అమిత్‌ షా, జెపి నడ్డాతో సమావేశం కావడం, అంతకుముందు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, జెపి నడ్డాతో సమావేశం అయ్యారు. ఆయా భేటీల్లో పొత్తులపై చర్చకు వచ్చింది. దీంతో చంద్రబాబుకు బిజెపి అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.
పవన్‌ రాయబారం పనికొచ్చిందా?
ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బిజెపి జాతీయ నాయకత్వంతో రెండు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బిజెపి, టిడిపి, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తే మంచిదని జనసేనాని బిజెపి నేతలకు చెప్పినట్లు సమాచారం. అయితే బిజెపి నేతలు మాత్రం అందుకు సిద్ధంగా లేకపోవడంతో, బిజెపి కలిసి రాకపోయినా, టిడిపి, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తామని పవన్‌ కళ్యాణ్‌ తెగేసి చెప్పినట్లు సమాచారం.
బిజెపి, టిడిపి మధ్య రాయబారిగా పవన్‌ వ్యవహరించారు. ఇప్పుడు చంద్రబాబును కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా పిలుపించుకోవడం పవన్‌ రాయబారంలో భాగమే అని చర్చ జరుగుతుంది. మరోవైపు తెలంగాణలో బిజెపికి టిడిపి అవసరం ఉంది. కనుక బిజెపి అధి నాయకత్వం చంద్రబాబుతో సయోద్యకు సిద్ధమైంది. ఎప్పటి నుంచో బిజెపి నేతల పిలుపు కోసం ఎదురు చూస్తున్న చంద్రబాబు, అమిత్‌ షా పిలుపుతో హుటాహుటిన ఢిల్లీ పర్యటనకు వచ్చారు. చంద్రబాబును ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో టిడిపి ఎంపిలు రామ్మోహన్‌ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్‌, వైసిపి ఎంపి రఘురామ కృష్ణరాజు తదితరులు ఆహ్వానం పలికారు.

 

 

Spread the love