28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం…!

– తుది దశకు నిర్మాణ పనులు
న్యూఢిల్లీ : కొత్త పార్లమెంటు భవనాన్ని ఈ నెల 28న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించే అవకాశం ఉంది. తన ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేండ్లు పూర్తయిన సందర్భంగా చివరి దశలో ఉన్న పార్లమెంటు కొత్త భవనాన్ని మే చివరి వారంలో ప్రధాని ప్రారంభిస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. నిర్మాణ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేండ్ల క్రితం 2014 మే 26న ప్రమాణ స్వీకారం చేశారు.
రూ.970 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన నాలుగు అంతస్తుల భవనంలో 1,224 మంది ఎంపీలు ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఇది దేశ ప్రజాస్వామ్య వారసత్వం ప్రదర్శిస్తూ గొప్ప రాజ్యాంగ మందిరాన్ని కూడా కలిగి ఉంది. ఉభయ సభల్లోని సిబ్బంది కొత్త యూనిఫామ్‌ను ధరిస్తారు. దీనిని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఎఫ్టీ) రూపొం దించింది.కొత్త నిర్మాణంలో మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. జ్ఞాన్‌ ద్వార్‌, శక్తి ద్వార్‌, కర్మ ద్వార్‌, ఎంపీలు, వీఐపీలు, సందర్శకుల కోసం ప్రత్యేక ప్రవేశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
నూతన పార్లమెంట్‌ భవనం విశేషాలు
టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ పార్లమెంటు నూతన భవనాన్ని నాలుగు అంతస్థులతో నిర్మిస్తున్నారు. దీనికి హెచ్‌సీపీ డిజైన్‌, ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూపకల్పన చేసింది. నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణం కోసం రూ.971 కోట్లు ఖర్చుగా అంచనా వేశారు. ఈ భవనానికి ఆరు ప్రవేశ మార్గాలు ఉంటాయి. 1. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, 2. లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మెన్‌ ఎంపీలు, 3. సాధారణ ప్రవేశ మార్గం, 4. ఎంపిల కోసం మరొక ప్రవేశ మార్గం, 5, 6 ప్రజల ప్రవేశ మార్గాలుగా నిర్ణయించారు. దీని మొత్తం వైశాల్యం 3,015 చదరపు మీటర్లు. రాజ్యసభ చాంబర్లో 384 సీట్లు ఉంటాయి. దీని వైశాల్యం 3,220 చదరపు మీటర్లు. భూకంపాలను తట్టుకునే విధంగా ఈ నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు.
9,500 కిలోల జాతీయ చిహ్నం
9,500 కిలోల బరువు, 6.5 మీటర్ల ఎత్తు గల జాతీయ చిహ్నాన్ని కాంస్యంతో తయారు చేశారు. ఇది న్యూ పార్లమెంట్‌ భవనం సెంట్రల్‌ ఫోయర్‌ పైభాగంలో ఏర్పాటుచేశారు.

Spread the love