న్యూస్‌క్లిక్‌కు ఐపీటీఏ, ఎన్‌ఏపీఎం మద్దతు

– స్వతంత్ర మీడియా పోర్టల్స్‌పై దాడులకు ఖండన
– భావప్రకటనా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణన
న్యూఢిల్లీ: స్వతంత్ర ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌పై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మేధావులు, సామాజికవ్తేతలు, పౌర సంఘాల నాయకుల నుంచి మద్దతు లభిస్తున్నది. న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకులు, ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ ప్రబీర్‌ పుర్కాయస్థకు మద్దతుగా కళాకారులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు సంఘీభావ ప్రదర్శనలో నిరసన వ్యక్తం చేశారు. న్యూస్‌క్లిక్‌ విషయంలో చేస్తున్న ఆరోపణల విషయంలో మోడీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
పశ్చిమ బెంగాల్‌లోని ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్‌(ఐపీటీఏ) తన సంఘీభావాన్ని ప్రకటించింది. రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛపై దాడిగా న్యూస్‌క్లిక్‌పై దాడిని అభివర్ణించింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ”న్యూస్‌క్లిక్‌ అణగారిన, ముఖ్యంగా దోపిడీకి గురవుతున్న కార్మికులు, రైతుల గొంతుల కోసం నిర్భయ న్యాయవాది. సామాజిక న్యాయం కోసం వారి పోరాటాలపై వెలుగునిస్తుంది” అని 100 మంది కళాకారులు, థియేటర్‌ ప్రాక్టీషనర్లు సంతకం చేసిన ఒక ప్రకటనలో ఐపీటీఏ పేర్కొన్నది. ”ఇది ప్రజాస్వామ్యంలో స్వతంత్ర జర్నలిజం యొక్క మనస్సాక్షి పాత్రపై దాడి. ఇది ఈ దేశ ప్రజల సమాచార హక్కుపై దాడి” అని ఆరోపించింది. ” వార్తల్లో కార్పొరేట్‌ ప్రయోజనాలు ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తున్నందున, నిష్పాక్షికమైన రిపోర్టింగ్‌కు స్థలం తగ్గిపోయింది. ప్రస్తుతం న్యాయ విచారణలో ఉన్న న్యూస్‌క్లిక్‌పై ఆరోపణలు, పక్షపాతంతో కూడిన మీడియా విచారణతో పాటు, ప్రక్రియ నిష్పాక్షికత గురించి ఆందోళనలను పెంచుతున్నాయి” అని బెంగాల్‌ యొక్క సాంస్కృతిక, కళాత్మక సంఘం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది.
న్యూస్‌క్లిక్‌పై దాడి కేవలం అవుట్‌లెట్‌కే ముప్పు కలిగించడమే కాకుండా పౌరులందరి భావప్రకటనా స్వేచ్ఛకు విస్తత ముప్పును కలిగిస్తుందని ఐపీటీఏ ఆరోపించింది. న్యూస్‌క్లిక్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న రాజ్యాంగ విరుద్ధ కార్యకలాపాలకు ముగింపు పలకాలని” పిలుపునిచ్చింది.
నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్స్‌ (ఎన్‌ఏపీఎం) కూడా ప్రగతిశీల మీడియా సంస్థలపై దాడులను ఖండించింది. న్యూస్‌క్లిక్‌ ఈ దాడులకు ప్రముఖ బాధిత సంస్థ అని ఆరోపించింది. ఈ దాడులను భారత రాజ్యాంగంలో పొందుపరిచిన వాక్‌, భావప్రకటనా స్వేచ్ఛ యొక్క ప్రాథమిక హక్కుపై ప్రత్యక్ష ఉల్లంఘనగా భావిస్తున్నట్టు పేర్కొన్నది. భారత్‌లో, వెలుపల ఉన్న విభిన్న, ప్రగతిశీల, శ్రామిక-తరగతి ఉద్యమాలపై న్యూస్‌క్లిక్‌ వెలుగునిస్తుందని ఎన్‌ఏపీఎం వివరించింది. ఈ దాడులు కార్పొరేటు ప్రయోజనాలకు లాభం చేకూర్చటం కోసమేనని ఆరోపించింది.

Spread the love