యూజీసీ నెట్‌ ఫలితాలపై ఎన్‌టీఏ కీలక అప్‌డేట్‌

Resultsనవతెలంగాణ-ఢిల్లీ: లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తోన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2023 ఫలితాలపై ఎన్‌టీఏ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ పరీక్ష ఫలితాలను జనవరి 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్ష ఫలితాలు జనవరి 10 (బుధవారం)న ప్రకటించాల్సి ఉండగా.. ఇటీవల చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లో మిగ్‌జాం తుపాను ప్రభావంతో అక్కడి అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా వారికి మరోసారి పరీక్ష నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించింది. అందువల్ల UGC NET December 2023 Resultsను జనవరి 17న విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఎన్‌టీఏ మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ పరీక్షను ఎన్‌టీఏ ఏటా రెండు సార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గతేడాది డిసెంబర్‌ 6 నుంచి 19వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షను నిర్వహించింది. మొత్తం 83 సబ్జెక్టులకు దేశవ్యాప్తంగా 292 నగరాల్లోని పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 9,45,918 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Spread the love