కృష్ణాలో వాటా తేల్చాల్సిందే

– 66:34 నిష్పత్తి ఇక చెల్లదు
– మా అవసరాలు పెరిగాయి

– కేఆర్‌ఎంబీ భేటీలో తెలంగాణ పట్టు
– 50:50 నిష్పత్తిలో వాడుకుంటాం

– కేంద్రానికి నివేదిస్తా:చైర్మెన్‌ శివనందన్‌కుమార్‌
– వాడీవేడీగా కృష్ణా నదీ బోర్డు సమావేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాలకు నీటి వాటా తేల్చే విషయాన్ని కేంద్ర జలశక్తిశాఖకు నివేదించాలని కేఆర్‌ ఎంబీ నిర్ణయించింది. జల విత్యుత్‌ ఉత్పత్తి, రూల్‌ కర్వ్‌, వరద సమయంలో నీటి లెక్కలకు సంబం ధించి జలాశయాల నిర్వహణ కమిటీని సమావేశపరచాలని మరో నిర్ణయం చేసింది. కృష్ణా జలాల పంపిణీ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పట్టుదలగా వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ తగ్గేది లేదంటున్నాయి. తమ వాటా తమకే కావాలంటూ గట్టిగా వాదనలకు దిగాయి. బుధవారం హైదరా బాద్‌లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)17వ సమావేశం చైర్మెన్‌ శివనందన్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించారు. దీనికి రెండు రాష్ట్రాల నుంచి తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి రజత్‌కుమార్‌, ఈఎన్సీ సి.మురళీధర్‌, ప్రత్యేక అధికారులు శ్రీధర్‌రావు దేశ్‌పాండే, విజరుకుమార్‌, ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశి భూషణ్‌ కుమార్‌, ఈఎన్సీ నారాయణరెడ్డి ఇతర ముఖ్య ఇంజినీర్లు పాల్గొ న్నారు. బోర్డుకు సంబంధించి బడ్జెట్‌, ఉద్యోగులు, సిబ్బందికి జీతభత్యాలు, ఆడిటింగ్‌ సంబంధిత అంశాలపై సమావేశంలో చర్చించారు. తాగునీటి వినియోగాన్ని 20 శాతంగానే పరిగణనలోకి తీసుకోవాలన్న తెలంగాణ వాదనపై సాంకేతికంగా అధ్యయనం చేయించాలని బోర్డు నిర్ణయించింది. ఆర్డీఎస్‌ ఆధునికీకరణపై సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ ద్వారా అధ్యయనాన్ని మూడు నెలల్లోపు పూర్తిచేసి, వచ్చే సీజన్‌లో మరమ్మతులు చేయాలని తీర్మానించారు. అత్యవసర మరమ్మతులు ఏవైనా ఉంటే తక్షణమే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాలకు వాటా అంశంపై భేటిలో ఎక్కువగా చర్చ చోటుచేసుకుంది. గత తొమ్మిదేండ్లుగా ఉన్న 66:34 నిష్పత్తి ని కొనసాగించాలని ఏపీ కోరింది. ఆ నిష్పత్తి ప్రాతిపాదికన ఉందని వాదిం చింది. ట్రిబ్యునల్‌ తప్ప కేటాయింపులు మార్చే అధికారం ఎవరికీ లేదని పేర్కొంది. తమకు పాత నిష్పత్తి ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని తెలంగాణ, ఎస్‌ఎల్‌బీసీ కలిపితే 105 టీఎంసీలు వస్తుందనీ, మొత్తంగా తమకు 811 టీఎంసీల్లో సగం వాటా కావాల్సిందేనని డిమాండ్‌ చేసింది. 50:50 నిష్పత్తి ప్రాతిపదికనే నీళ్లు వాడుకుంటామని తేగేసి చెప్పింది. తెలంగాణ నీటి అవసరాలు పెరిగాయని వ్యాఖ్యానించారు. అయితే ఎప్పటి కప్పుడు అవసరాల ఆధారంగా త్రిసభ్య కమిటీ ద్వారా నీటి విడుదల ఉత్తర్వు లు చేస్తూ వాటా తేల్చే విషయాన్ని కూడా కేంద్ర జలశక్తిశాఖకు నివేధించా లని బోర్డు నిర్ణయించింది. పలు సాంకేతిక అంశాలపైనా చర్చలు చోటు చేసుకుంది. 2023-24 సంవత్సరం నదీ జలాలా వాటా వినియోగంపై వాదనలు జరిగాయి. సుమారు రెండు గంటలపాటు తెలంగాణ, ఏపీ మధ్య ఇదే అంశంపై చర్చ కొనసాగడం గమనార్హం. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారులు చేసిన చర్చల వివరాలు వారి మాటల్లోనే..
తెలంగాణకు అనుమతులు ఎవరివ్వాలి..? రజత్‌ కుమార్‌
తెలంగాణ నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీ వాటా తేల్చే అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలని కృష్ణా బోర్డులో నిర్ణయించాం. త్రిసభ్య కమిటీ ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదలకు ఆదేశాలు ఇస్తుంది. శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీలు మాత్రమే తీసుకునేలా నిరో ధిస్తే జలవిద్యుత్‌ ఉత్పత్తి అంశంపై మాట్లాడతాం.సుంకిశాల ఇన్‌టెక్‌ వెల్‌ పై ఏపీ అభ్యంతరాలు తగవు. తెలంగాణకు ఉన్న కేటాయింపుల నుంచే సుంకి శాల ద్వారా హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం నీటిని తీసుకుంటాం. సుంకిశాలకు అనుమతులు అవసరమా లేదా అన్న అంశాన్ని బోర్డు పరిశీలి స్తుంది. ఆర్డీఎస్‌ ఆధునీకరణపై సీడబ్ల్యూపీఆర్‌ సీ ద్వారా మూడు నెలల్లో అధ్యయనం, వచ్చే సీజన్‌ లో మరమ్మతులు చేస్తారు. ఆర్డీఎస్‌కు అత్యవసర మరమ్మతులు ఉంటే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్‌ కుడి కాల్వ పనులు చేపట్టడం లేదని ఏపీ తెలిపింది. పాలమూరు – రంగారెడ్డి కేటాయింపులపై అభ్యంతరాలు తగవు. కర్నాటక, ఏపీకి అనుమతి ఇచ్చి తెలంగాణకు ఎందుకు అనుమతులు ఇవ్వరు ? అని ప్రశ్నించారు. తాత్కాలిక ఒప్పందం ప్రాతిపదికన ఇక ఏమాత్రం చెల్లదు. దీని మూలంగా తెలంగాణకు నష్టం జరుగుతున్నది. ట్రిబ్యునల్‌ అవార్డు అమల్లోకి వచ్చేంతవరకు 50:50 నిష్పత్తి ప్రాతిపదికన నదీ జలాలు వినియోగించు కునేలా అనుమతులివ్వాలి. ఎలాంటి అధ్యయనాలు లేకుండానే శ్రీశైలం రైట్‌ బ్యాంక్‌ కెనాల్‌(ఎస్‌ఆర్‌బీసీ) 11 టీఎంసీలు కేటాయించారు ?. పాల మూరు-రంగారెడ్డిపై ఏపీ అభ్యంతరాలు సరైనవి కావు. త్వరలో డీపీఆర్‌ అందజేస్తాం. సుంకిశాల తాగునీటి కోసం చేపట్టిందేననీ, ఈనేపథ్యంలో ఎలాంటి అనుమతులు అవసరం లేదు. శ్రీశైలం నుంచి 34 టీఎంసీలను మాత్రమే ఏపీ వినియోగించుకోవాలని, దానిపై మాట్లాడితే జలవిద్యుత్‌ ఉత్పత్తిపై మాట్లాడం సరికాదు.
నీటి వాటాలు తేల్చాల్సింది ట్రిబ్యునల్‌ మాత్రమే
శశిభూషణ్‌ కుమార్‌, ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి
కృష్ణా జలాల్లో 66:34 నిష్పత్తి కొనసాగాలని కోరాం. అదే జరుగు తుంది. బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ప్రకారమే 66:34 నిష్పత్తిలో కేటాయింపులు చేశారు. తెలంగాణ విజ్ఞప్తి మేరకు నీటి వాటాల అంశాన్ని కేంద్ర జల సంఘా నికి నివేదించాలని నిర్ణయించారు. ఆర్డీఎస్‌ ఆధునీకరణపై అధ్యయనం కొనసాగుతుంది. నీటి వాటాలు తేల్చాల్సింది ట్రిబ్యునల్‌ మాత్రమే. శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీలు మాత్రమే తీసుకోవాలన్న వాదన సరికాదు. ఏపీకి ఉన్న 512 టీఎంసీల నీటి నుంచి మేము ఎక్కడైనా ఉపయోగించు కుంటాం. పోలవరం నుంచి గోదావరి జలాల మళ్లింపుతో సాగర్‌ ఎగువన 45 టీఎంసీల నీటిని కూడా ట్రిబ్యునల్‌ కేటాయించాలి. 45 టీఎంసీలు కూడా దిగువ రాష్ట్రమైన ఏపీకి రావాలి. విద్యుత్‌ ఉత్పత్తి కంటే సాగునీటికి ప్రాధాన్యత ఇస్తాం. కృష్ణ్ణా బోర్డును విశాఖకు త్వరలో తరలిస్తాం. వచ్చే నీటి సంవత్సరంలో కృష్ణానది నీటిని ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ రాష్ట్రాలు వినియోగించుకునే విధానం నిర్ణయించడానికే ఈరోజు కేఆర్‌ఎంబీ మీటింగ్‌ హైదరాబాదులో జరిగింది .ఎప్పుడో 2014 లో ఒక్క సంవత్సరానికి ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక ఒప్పందాన్ని ఏకపక్షంగా ఈరోజు వరకు కేఆర్‌ ఎంబి కొనసాగిస్తున్నది. దీనివలన కష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు అనగా ఎస్‌ఎల్బీసీ ఎంఆర్‌ ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టులకు నికరజలాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.
తాత్కాలిక ఒప్పందాన్ని ఆపాలి
బి.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, అధ్యక్షులు రిటైర్డ్‌ ఇంజినీర్ల సంఘం
2014లో ఒక్క సంవత్సరానికి జరిగిన తాత్కాలిక ఒప్పందాన్ని ఇంకా కొనసాగించడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ ఎస్‌ఎల్బీసీ, ఎఎంఆర్‌ ప్రాజెక్టుకు 40 టీఎంసీల నీరు, కల్వకుర్తికి 40 టీఎంసీల నీరు, నెట్టెంపాడుకు 25 టీఎంసీల నీటిని అంటే మొత్తం 299 టీఎంసీలకు అదనంగా 105 టీఎంసీ లు నీటిని కేటాయించాలని పట్టుపట్టడంతో సమావేశం ఎలాంటి నీటి పంప కాలు లేకుండా వాయిదా పడింది. నీటి పంపకాల విషయము కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు బదలాయించాలని కోరినట్టు సమాచారం. ఈ విషయంగా తెలంగాణ ప్రతినిధులు అందరినీ మనసారా అభినందిస్తున్నాం. ఇది మన మొదటి విజయంగా భావించాలి. మనకు న్యాయంగా కష్ణానదిలో రావల సిన వాటాని సాధించేంతవరకు ఇదే పోరాటపటిమను కొన సాగించాలి. ఈ విషయమై ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Spread the love