Friday, May 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనాణ్యమైన విత్తనాలనే రైతులకు అందుబాటులో ఉంచాలి

నాణ్యమైన విత్తనాలనే రైతులకు అందుబాటులో ఉంచాలి

- Advertisement -

నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు : మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయశాఖ, సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌, విత్తన కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. వానాకాలం పంటలో భాగంగా సుమారు 134.66 లక్షల ఎకరాల్లో సాగు జరిగే అవకాశముండగా దానికి 19.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని అంచనా ఉందనీ, ప్రస్తుతం రాష్ట్రంలో 38.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సుమారు 52 లక్షల ఎకరాల పత్తి సాగు లక్ష్యంతో రైతులకు అవసరమైన 104 లక్షల ప్యాకెట్లకు బదులుగా 212.11 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న హైబ్రిడ్‌ విత్తనాలను ప్రాధాన్యంగా సరఫరా చేయాలని సూచించారు.

విత్తనాల నాణ్యతపై రాజీ పడకూడదనీ, సీడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. నాణ్యత లేని విత్తనాల తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి నెలాఖరులో కంపెనీలు తమ స్టాక్‌ వివరాలను ప్రభుత్వానికి అందజేయాలనీ, సెల్ఫ్‌ సర్టిఫైడ్‌ విత్తనాల వల్ల నష్టం కలిగితే కంపెనీలే భరించాలని సూచించారు. కంపెనీలు తమ విత్తనాల స్టాక్‌ను మే 15 నుండి రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీడ్‌ కార్పోరేషన్‌ డెవలప్‌ మెంట్‌ చైర్మెన్‌ అన్వేష్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, వ్యవసాయశాఖ డైరెక్టర్‌ గోపి, హార్టికల్చర్‌ డైరెక్టర్‌ యాస్మిన్‌ బాషా, మార్క్‌ ఫెడ్‌ ఎమ్‌డీ శ్రీనివాస్‌ రెడ్డి, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, వ్యవసాయశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మంత్రి తుమ్మలను కలిసిన డెవలప్‌మెంట్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ ప్రతినిధులు
డెవలప్‌మెంట్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ ప్రతినిధులు సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. రైతులకు వాతావరణ పరిస్థితులపై సలహాలు అందించే దిశగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఒడిశా, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా తమ సంస్థ స్వతంత్రంగా పనిచేస్తోందని తెలిపారు. తమ సమాచారంతో రైతులు నాట్లు వేయాల్సిన సమయం, పంట కోతలు చేపట్టాల్సిన సమయం, మార్కెట్లో అమ్మకానికి అనుకూలమైన సమయాన్ని ముందు గానే నిర్ణయించుకోగలుగుతున్నారని వివరించారు. ఈ ప్రాజెక్ట్‌ అమలుకు ప్రభుత్వ సహకారం అందిం చాలని ప్రతినిధులు మంత్రిని కోరారు. దీనిపై సమగ్రంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకో వాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ గారిని మంత్రి ఆదేశించారు.



- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -