హిమచల్‌లో వికటించిన ఆపరేషన్‌ కమలం

హిమచల్‌లో వికటించిన ఆపరేషన్‌ కమలం

– రాష్ట్రంలో ముగిసిన రాజకీయ సంక్షోభం
– పశ్చాత్తాపం వ్యక్తం చేసిన ‘క్రాస్‌-ఓటింగ్‌’ ఎమ్మెల్యేలు : ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుకు వెల్లడి
సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ నిర్వహించాలనుకున్న ఆపరేషన్‌ కమలం వికటించింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేయాలనే బీజేపీ కుట్రలు ఫలించలేదు. మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి క్రాస్‌ ఓటింగ్‌ చేసిన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మళ్లీ సొంతగూటికే చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడంపై పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశారు. ఈ విషయాన్నిముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుకు బుధవారం తెలిపారు. ఎమ్మెల్యేలు క్షమించమని కూడా చెప్పారని తెలిపారు. బీజేపీ చేస్తున్న ఏ కుట్రలూ ఫలించవని.. ఐదేండ్లు పూర్తయ్యేవరకు రాష్ట్రంలో తమ కాంగ్రెస్‌ ప్రభుత్వమే కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. అలాగే, సీఎం పదవికి తాను రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలపైనా స్పందించారు. ”కాంగ్రెస్‌ అధిష్ఠానం నన్నుగానీ, మరెవరినీ గానీ రాజీనామా చేయమని కోరలేదు. అలాంటిదేమీ జరగలేదు. ఇదంతా ఇక్కడి బీజేపీ నేతలు చేస్తున్న పనే. వారికి సొంత మనుషులపై నమ్మకం లేదు. సీఆర్‌పీఎఫ్‌, హర్యానా పోలీసుల్ని మోహరించారు. హెలికాప్టర్‌ కూడా వినియోగించారు” అని అన్నారు. ”ఒక్క విషయం మాత్రం చెప్పదలచుకున్నా.. హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు, ఎమ్మెల్యేలు మావెంటే ఉన్నారు.. ఐదేండ్ల పాటు మా ప్రభుత్వాన్ని కొనసాగించగలమని కచ్చితంగా చెప్పగలను” అని అన్నారు. ప్రజల తీర్పుపై దాడిని తాము అనుమతించబోమన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక రాజ్యసభ స్థానానికి మంగళవారం ఎన్నిక జరగ్గా ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌ వల్ల అక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిందని బీజేపీ నాయకులు విమర్శించారు. ముఖ్యమంత్రి రాజీనామాకు డిమాండ్‌ చేశారు. కాగా, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ బుధవారం బడ్జెట్‌ను ఆమోదించింది. తరువాత స్పీకర్‌ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు.

Spread the love