క్షేత్రస్థాయి పనిని ఆపండి కాగ్‌ కార్యాలయానికి ఆదేశాలు

 Stop field work Instructions to CAG office– రాజ్యాంగబద్ధ సంస్థలను నీరుగారుస్తున్నారు : కేంద్రంపై విపక్ష నేతలు, సామాజికవేత్తల ఆగ్రహం
న్యూఢిల్లీ : అన్ని క్షేత్రస్థాయి పనులను ఆపాలంటూ అక్టోబర్‌ మొదటి వారంలో న్యూఢిల్లీలోని కాగ్‌ కార్యాలయానికి మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. మంత్రిత్వ శాఖలు, విభాగాల ఆడిటింగ్‌ కోసం ఈ క్షేత్రస్థాయి పని చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ఇలాంటి ఆదేశాలు రావటం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వాల పనితీరును ఆడిటింగ్‌లతో పర్యవేక్షించే కాగ్‌ను నియంత్రిస్తున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి. ఒక్కసారి లిఖితపూర్వక ఆదేశాలు అందిన తర్వాతే క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బందికి క్షేత్రస్థాయి పనులన్నీ ఆపాలంటూ ఆదేశాలు జారీ చేస్తామని కొందరు అధికారుల నుంచి సమాచారం అందింది. దాదాపు 30 నుంచి 40 శాతం సిబ్బంది క్షేత్రస్థాయిలో పని చేస్తున్నట్టు సమాచారం. అయితే, కాగ్‌ కార్యాలయానికి జారీ అయిన ఈ మౌఖిక ఆదేశాలు మాత్రం ఏదైనా దర్యాప్తును, న్యాయ చర్యను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగ్‌ గిరిష్‌ చంద్ర ముర్ము మాత్రం ఏ నివేదిక పైనా సంతకం చేయలేదన్నారు. కాగ్‌ సంతకాలు లేకుండా పార్లమెంటులో నివేదికలు ప్రవేశపెట్టే అవకాశం ఉండదు. ముర్మును 2020 లో కాగ్‌గా నియమించారు. ఆమర 1985-బ్యాచ్‌ గుజరాత్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. ఈయన ప్రధాని మోడీ, కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా ఇద్దరి విశ్వసనీయ సహాయకుడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగ్‌గా నియామకానికి ముందు ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత యూటీగా మారిన జమ్మూ కాశ్మీర్‌ మొదటి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్నారు.
కాగ్‌ అనేది దేశ అగ్రశ్రేణి ఆర్థిక వాచ్డాగ్‌. ఇది కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులను ఆడిట్‌ చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. అయితే, కాగ్‌లో గతంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు నిపుణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగబద్ధధ సంస్థలను మోడీ సర్కారు నీరు గారుస్తున్నదన్నారు. గతంలో ఆయుష్మాన్‌ భారత్‌ నివేదిక ఆడిట్‌ ప్రారంభించిన అధికారి బదిలీ విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందనీ, అయితే ఈ విషయాలు బయటకు రాకుండా ఉండేందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నదని అన్నారు.

Spread the love