బస్సుల్లో ఒరిజినల్‌ కార్డులే చూపాలి

Original cards should be shown in buses– పాన్‌కార్డ్‌, ఫోన్లు, జిరాక్స్‌ కాపీలు చెల్లవు
– ఒరిజినల్‌ లేకుంటే టిక్కెట్‌ తీసుకోవాల్సిందే
– ‘జీరో టిక్కెట్‌’ లేకుంటే రూ.500 జరిమానా : మహిళలకు టీఎస్‌ఆర్టీసీ ఎమ్‌డీ వీసీ సజ్జనార్‌ స్పష్టీకరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
‘మహాలక్ష్మి’ స్కీం ద్వారా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే మహిళలు తప్పనిసరిగా చిరునామా, తాజా ఫోటోతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్‌ గుర్తింపు కార్డులే చూపించాలని టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. పలుమార్లు ప్రయాణీకులకు ఈ విషయం చెప్తున్నా, బస్సుల్లో డ్రైవర్‌, కండక్టర్లతో వాగ్వివాదాలకు దిగుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మహిళా ప్రయాణీకులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పాన్‌ కార్డులో అడ్రస్‌ ఉండదనీ, అందువల్ల ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. ఇప్పటికీ కొందరు ప్రయాణీకులు స్మార్ట్‌ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్‌లు చూపిస్తున్నారనీ, ఇవేవీ ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కావని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఆర్టీసీ సిబ్బందితో వాగ్వివాదం వల్ల ఇతర ప్రయాణీకులు ఇబ్బందిపడుతున్నారనీ, ప్రయాణ సమయం కూడా పెరుగుతున్నదని చెప్పారు. మహిళా ప్రయాణీకులందరూ ఒరిజనల్‌ గుర్తింపు కార్డులు చూపించి జీరో టికెట్‌ తీసుకోవాలని కోరారు. ఒరిజినల్‌ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్‌ తీసుకోవాల్సిందేనన్నారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందనీ, ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్‌ తీసుకుని సహకరించాలని కోరారు. ఉచితమే కాబట్టి, జీరో టికెట్‌ తీసుకోవడం ఎందుకు? అని కొందరు ప్రయాణీకులు సిబ్బందితో వాదనకు దిగుతున్నారనీ, ఇది సరికాదనీ, జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ చేస్తుందని వివరించారు. జీరో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే ఆర్టీసీకి నష్టం చేసిన వారవుతారనీ, అందవల్ల ప్రతి మహిళ తప్పనిసరిగా జీరో టికెట్‌ తీసుకోవాలని చెప్పారు. జీరో టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తే…దాన్ని చెకింగ్‌లో గుర్తిస్తే డ్రైవర్‌, కండక్టర్ల ఉద్యోగం ప్రమాదంలో పడుతుందనీ, టిక్కెట్‌లేని ప్రయాణీకులకు రూ.500 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ప్రజలు ఈ విషయంలో ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love