మన రేసు గుర్రాలు!

Our race horses!– తెలుగు తేజం తిలక్‌ వర్మకు నిరాశ
– ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన
– సూర్యకుమార్‌, రాహుల్‌కు చోటు
స్వదేశంలో మరో ప్రపంచకప్‌ వేటకు రేసు గుర్రాలు సిద్ధం. ఆసియా కప్‌కు ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టు నుంచే ప్రపంచకప్‌ జట్టును ఎంచుకున్న సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ.. తెలుగు తేజం తిలక్‌ వర్మ, పేసర్‌ ప్రసిద్‌ కృష్ణలను పక్కనపెట్టింది. మిగతా 15 మందితో కూడిన జట్టును యథాతథంగా వన్డే వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసింది. ఈ మేరకు చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగర్కార్‌ మంగళవారం ప్రకటించారు. భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ జరుగనుంది.
ఐసీసీ 2023 వన్డే వరల్డ్‌కప్‌కు బీసీసీఐ గెలుపు గుర్రాలను ప్రకటించింది. స్వదేశంలో జరుగుతున్న మెగా ఈవెంట్‌లో విజయమే లక్ష్యంగా జట్టు కూర్పు చేసిన సెలక్షన్‌ కమిటీ.. టీమ్‌ ఇండియాకు సమతూకం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, వికెట్‌ కీపింగ్‌ విభాగాల్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లనే ఎంచుకున్న సెలక్టర్లు.. మరోసారి మిడిల్‌ ఆర్డర్‌ డైలామాను కొనసాగించారు!. 15 మందితో కూడిన భారత జట్టును మంగళవారం సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మెన్‌ అజిత్‌ అగార్కర్‌ ప్రకటించారు. అక్టోబర్‌ 5 నుంచి ఆరంభం కానున్న వరల్డ్‌కప్‌లో ఆతిథ్య భారత జట్టు గ్రూప్‌ దశలో తొమ్మిది మ్యాచులు ఆడనుంది. అక్టోబర్‌ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో పోరుతో వరల్డ్‌కప్‌ టైటిల్‌ వేట షురూ చేయనున్న టీమ్‌ ఇండియా.. గ్రూప్‌ దశలో చివరి మ్యాచ్‌ను నవంబర్‌ 12న చిన్నస్వామిలో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. దాయాదులు భారత్‌, పాకిస్థాన్‌ అక్టోబర్‌ 14న అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియంలో ఢకొీట్టనున్నాయి.
సూర్యకు అవకాశం
భారత జట్టులో ప్రధానంగా ఆసక్తి రేపిన ఎంపిక మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ లైనప్‌. యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనాల అనంతరం భారత్‌కు ఈ స్థానాల్లో సరైన ఆటగాళ్లు లభించలేదు. టీ20 సూపర్‌స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. వన్డేల్లో విలువైన అవకాశాలు లభించినా నిరూపించుకోలేదు. 50 ఓవర్ల ఆటలో సూర్య కుమార్‌ సగటు 25 కంటే తక్కువే. ఇదే సమయంలో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఆకర్షణీయ గణాంకాలు నమోదు చేసి, టీ20 ఫార్మాట్‌లో నిలకడగా రాణించిన యువ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మకు మొండి చేయి చూపించారు. ఛేదనలో లోయర్‌ ఆర్డర్‌లో సూర్య కుమార్‌ ఉపయుక్తంగా ఉంటాడని జట్టు మేనేజ్‌మెంట్‌ భావించినా.. ఆరంభంలో వికెట్లు కూలిన క్లిష్ట పరిస్థితుల్లో ముందే క్రీజులోకి వచ్చే సందర్భాల్లో సూర్య కుమార్‌ యాదవ్‌పై ఏమాత్రం ఆధారపడ లేని పరిస్థితి. 50 ఓవర్ల ఆటలో రాణించగల సత్తా తిలక్‌ వర్మకు ఉందని తెలిసినా.. సెలక్షన్‌ కమిటీ అనుభవానికే ఓటేసింది. 2019 వరల్డ్‌కప్‌లో తెలుగు తేజం అంబటి రాయుడిని విచిత్ర సమీకరణాలతో ఎంపిక చేయని సెలక్షన్‌ కమిటీ అందుకు భారీ మూల్యం చెల్లించింది. ఇప్పుడు సెలక్షన్‌ కమిటీ మరో తెలుగు తేజం తిలక్‌ వర్మను ఎంపిక చేయకపోయినా.. 2019 ఫలితం పునరావృతం కాకూడదనే ఆశిద్దాం.
అశ్విన్‌, చాహల్‌కు నో
భారత్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌లో స్పిన్‌ అత్యంత ప్రధాన భూమిక పోషిం చనుంది. మిడిల్‌ ఓవర్లలో స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే జట్టు, స్పిన్‌తో ప్రత్యర్థులను వణికించే జట్టు అంతిమంగా పైచేయి సాధించనుంది. ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌లో ఉన్న చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ జట్టులో స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా నిలిచాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ చోటు దక్కించు కున్నారు. ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, మణికట్టు మాయగాడు యుజ్వెంద్ర చాహల్‌లు ప్రపంచకప్‌ జట్టులో చోటు ఆశిం చారు. ఆసియా కప్‌ జట్టులో చోటు దక్కని ఈ ఇద్దరికి.. తాజాగా ఇప్పుడు వరల్డ్‌కప్‌ జట్టులోనూ మొండిచేయి తప్పలేదు.
ప్రసిద్‌ కృష్ణ అవుట్‌
పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు ఇటీవల ఫిట్‌నెస్‌ సాధించి.. జట్టులోకి వచ్చిన పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ. ఐర్లాండ్‌ పర్యటనలో రాణించిన ప్రసిద్‌ కృష్ణకు ఆసియా కప్‌ జట్టులో చోటు దక్కింది. కానీ, 15 మందితో కూడిన ప్రపంచకప్‌ జట్టు ఎంపిక విషయంలో.. తిలక్‌ వర్మతో పాటు ప్రసిద్‌ కృష్ణను సైతం పక్కనపెట్టారు. పేస్‌ విభాగంలో జశ్‌ప్రీత్‌ బుమ్రాకు తోడుగా మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమిలు ఎంపికయ్యారు. పేస్‌ ఆల్‌రౌండర్లు శార్దుల్‌ ఠాకూర్‌, హార్దిక్‌ పాండ్య జట్టులో నిలిచారు. హార్దిక్‌ పాండ్య వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు సైతం చూసుకోనున్నాడు.
ఇషాన్‌ ఇన్‌
బ్యాటింగ్‌ లైనప్‌లో టాప్‌ ఆర్డర్‌లో ఎటువంటి మార్పులు లేవు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌లు టాప్‌-4 స్థానాలు కైవసం చేసు కున్నారు. వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌గా సంజు శాంసన్‌తో పోటీపడిన ఇషాన్‌ కిషన్‌ ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ప్రపంచకప్‌ జట్టులోకి ప్రవేశించాడు. పూర్తి ఫామ్‌ సాధించని కెఎల్‌ రాహుల్‌ సైతం జట్టులో చోటు సాధించాడు. సంజు శాంసన్‌కు సెలక్షన్‌ కమిటీ అవకాశం ఇవ్వలేదు. ఇటీవల భారత జట్టు టాప్‌ ఆర్డర్‌ అనూహ్యంగా పతనం అవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. కీలక బ్యాటర్లు పెవిలియన్‌కు చేరితే స్కోరు బోర్డు ముందుకు కదలని దుస్థితి. దీంతో జట్టుకు సమతూకం తీసు కొచ్చేందుకు సెలక్షన్‌ కమిటీ ప్రయత్నిం చింది. లోయర్‌ ఆర్డర్‌లో నాణ్యమైన ఆల్‌రౌండర్లకు అవకాశం కల్పించింది. హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దుల్‌ ఠాకూర్‌లు జట్టులోని ఆల్‌ రౌండర్లు. ఈ నలుగురు స్పెషలిస్ట్‌ బ్యాటర్ల పాత్ర పోషించగలరు. టెయిలెండర్లలో మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమి, బుమ్రాలు సైతం బ్యాట్‌తో మెరవగల సమర్థులు. దీంతో మూడు విభాగాల్లోనూ సమతూకం పాటించి ప్రపంచకప్‌ జట్టును ఎంపిక చేసినట్టు కనిపిస్తుంది.
2023 వన్డే వరల్డ్‌కప్‌కు భారత జట్టు
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కెఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, శార్దుల్‌ ఠాకూర్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమి.

Spread the love