తూముల వద్ద పడిగాపులు

తూముల వద్ద పడిగాపులు

–  సాగర్‌ నీరు రాక ఎండిపోతున్న పంటలు
–  7 గంటల పాటు డీఈ నిర్బంధం
నవతెలంగాణ – బోనకల్‌
నారాయణపురం మేజర్‌కు సాగర్‌ నీటిని విడుదల చేయాలని ఖమ్మం జిల్లా బోనకల్‌ నీటిపారుదల శాఖ ఇన్‌చార్జి డీఈ వల్లపు నాగబ్రహ్మయ్యను బీబీసీ పైనే 7 గంటల పాటు సోమవారం అన్నదాతలు నిర్బంధించారు. నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని రావినూతల గ్రామానికి చెందిన అన్నదాతలు నారాయణపురం మేజర్‌ కింద వందలాది ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. నారాయణపురం మేజర్‌కు తక్కువ స్థాయిలో సాగర్‌ నీటిని విడుదల చేయటంతో సాగుచేసిన మొక్కజొన్న పంట ఎండిపోతుందని రైతులు ఆరోపిస్తున్నారు. దాంతో కొన్ని రోజులుగా అన్నదాతలు సాగర్‌ నీటి కోసం రాత్రింబవళ్లు తూముల వెంట తిరుగుతున్నారు. ఈ క్రమంలో రావినూతల గ్రామానికి చెందిన సుమారు 100 మంది రైతులు ఆదివారం రాత్రి నుంచి బీబీసీ పరిధిలోని నారాయణపురం మేజర్‌ తూము వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 11 గంటల సమయంలో డీఈ తన కారులో వస్తుండగా నారాయణపురం మేజర్‌ తూము వద్ద ఆయన కారుకు రైతులు అడ్డంగా పడుకున్నారు. దీంతో డీఈ చేసేదేమీ లేక అక్కడే ఉండిపోయారు. రైతుల డిమాండ్‌ మేరకు రెగ్యులేటర్‌ మూడు గేట్లను పూర్తిగా కిందకు దింపారు. దీంతో నారాయణపురం మేజర్‌కు పూర్తిస్థాయిలో సాగర్‌ నీరు పోతున్నాయి. కింది భాగాన ఉన్న ఆళ్ళపాడు మేజర్‌కు నీరు రాకపోవడంతో ఆళ్ళపాడు గ్రామానికి చెందిన అన్నదాతల కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాంతో ఆళ్ళపాడు, రావినూతల గ్రామాలకు చెందిన అన్నదాతలు డీఈతో వాదనకు దిగారు. మంగళవారం నుంచి వారబందీ నిలిపివేస్తున్నారని, తమ పంటలను ఎలా కాపాడుకోవాలని అన్నదాతలు ఆయనపై విరుచుకుపడ్డారు. నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే బీబీసీకి సక్రమంగా సాగర్‌ నీరు రావడంలేదని రావినూతల, ఆళ్ళపాడు సర్పంచ్‌లు కొమ్మినేని ఉపేందర్‌, మర్రి తిరుపతిరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీబీసీ పరిధిలోనే కలకోట, నారాయణపురం, ఆళ్లపాడు మేజర్లకు ఏనాడు సక్రమంగా సాగర్‌ నీటిని విడుదల చేయలేదని, దీని ఫలితంగానే మొక్కజొన్న పంట ఎండిపోతుందని దీనికంతటికీ కారణం అధికారుల నిర్లక్ష్యమేనని ఆరోపించారు.
నారాయణపురం మేజర్‌కు నీరు విడుదల
రైతుల ఆందోళనతో నారాయణపురం మేజర్‌కు పూర్తిస్థాయిలో సోమవారం ఉదయం 12 గంటల నుంచి సాగర్‌ నీటిని విడుదల చేశామని డీఈ నాగ బ్రహ్మయ్య తెలిపారు. నారాయణపురం మేజర్‌కు శక్తికి మించి నీటిని విడుదల చేసినా రైతుల తనను నిర్బంధించటం బాధాకరమన్నారు. అధికారులను ఇబ్బందులకు గురి చేయటం వలన రైతులకు జరిగే ఉపయోగం ఏమీ లేదన్నారు. బీబీసీకి వచ్చిన సాగర్‌ నీటిని బీబీసీ పరిధిలోగల అన్ని కాలవలకు సమాన స్థాయిలో పంపిణీ చేయవలసిన బాధ్యత తనపై ఉందన్నారు. అలా కాకుండా ఒకే మేజర్‌కు నీటిని విడుదల చేయాలని ఒత్తిడి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఒకరకంగా ఆళ్లపాడు మేజర్‌ రైతులు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ముందు వాళ్లు సాగర్‌ నీటిని ఎక్కువగా తీసుకొని పోవటం వలన కింద భాగాన గల ఆళ్ళపాడు మేజర్‌కు పూర్తిస్థాయిలో సాగర నీటిని ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కాలవలకు సాగర్‌ నీటిని విడుదల చేసి పంటలను కాపాడేందుకు తాము విశ్వ ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అన్నదాతలు అధికారులకి పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు.

Spread the love