నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ పంచాయతీ కార్యదర్శి

నవతెలంగాణ-మంగపేట
మండలంలోని చుంచుపల్లి గ్రామపంచాయతీలో 2022 జనవరి నుండి 2023 జనవరి వరకు పని చేసిన పంచాయతీ కార్యదర్శి గ్రామపంచాయతీకి చెందిన నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలంగాణ మాల మహానాడు జిల్లా అదికార ప్రతినిధి బోడ శ్రీనివాస్ ఒక ప్రకటనలో ఆరోపించారు. కార్యదర్శి పని చేసిన కాలంలో పంచాయతీకి చెందిన జనరల్, ఎన్ఆర్ఈజీఎస్, 14వ, 15వ, ఫైనాన్స్ నిధులకు చెందిన లక్షలాది రూపాయలను ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే డ్రా చేసుకున్నట్లు ఆరోపించారు. నిధుల దుర్వినియోగానికి సంబందించి పలు మార్లు గ్రామస్తులు వీడీసీ సభ్యులు కార్యదర్శిని నిలదీసినా స్పందించలేదని ఈ విషయమై మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ, ఎంపీఓలకు పిర్యాదు చేసినా స్పందించ కుండా కార్యదర్శికి వత్తాసు పలుకుతూ 2023 ఫిబ్రవరి నుండి నర్సాపురం బోరు గ్రామానికి చార్జ్ ఇచ్చి ఇక్కడ నుండి బదిలీ చేశారని ఆరోపించారు. గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంలో మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ, ఎంపీవోల పాత్ర ఉందని బోడ శ్రీనివాస్ ఆరోపించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారిలకు గ్రామస్తులు పిర్యాదు చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు.

Spread the love