సీఐటీయూ జిల్లా అధ్యక్షులు
చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
మధ్యాహ్న భోజన కార్మికులకు బకాయి ఉన్న బిల్లులను, గౌరవ వేతనాలను వెంటనే చెల్లించాలని పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో మోతీలాల్‌కు కార్మికులతో కలిసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మధ్యాహ్నం భోజన కార్మికులు అనేక సంవత్సరాల నుంచి కష్టనష్టాలను భరిస్తూ ప్రభుత్వం తమ కష్టాలను ఏనాడైనా గుర్తిస్తుందని పని చేస్తూ ఉంటే కార్మికులకు సుమారుగా నాలుగు నెలల బిల్లులు పెండింగ్‌లో ఉండడం వలన అప్పులు తెచ్చిన దగ్గర ఒత్తిడి పెరిగి కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన చెందారు. వెంటనే బకాయి బిల్లులు, వాటితోపాటు వేతనాలు పెంచిన వేతనంతో కలిపి చెల్లించాలన్నారు. పథకం ప్రారంభంలో ఇచ్చిన వంట పాత్రలు కావడం వలన అవి పలుచ భారాయని, వంట పాత్రలు, వంట షెడ్లు లేని చోట షెడ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జ్ పెంచి ఒక్కొక్క విద్యార్థికి స్లాబ్ రేటు 20 రూపాయలు చొప్పున నిర్ణయించి ఇవ్వాలని, తదితర ఇబ్బందులను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన తేదీ నుండి గౌరవ వేతనం 3 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులను, ఇతర ప్రజాసంఘాలను కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ మాట్లాడుతూ పెండింగ్ బిల్లులపై అధికారులను పలుమార్లు కలిసినప్పటికీని బిల్లులు పెండింగ్‌లో లేవని ఫిబ్రవరి వరకు చెల్లింపులు జరిగినాయని అధికారులు తప్పుడు సమాచారం చెబుతున్నారని ఆరోపించారు. కార్మికులు వంట చేసే క్రమంలో ఏదైనా ప్రమాదానికి గురైనట్లయితే వారికి ఎలాంటి ప్రమాద బీమా సౌకర్యం లేనందున కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పోస్టల్ బీమా పథకం ద్వారా కార్మికులకు పాఠశాల నిధుల నుండి బీమా సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొడ్డి ఆండాలు, కోయగూర పద్మ, ఏకుల మహేశ్వరి, ఊటుకూరి అలివేలు, అల్లి అనురాధ, తదితరులు పాల్గొన్నారు.