కరెంటు భారాలు, కోతలతో జనం విలవిల

– ట్రూ అప్‌ ఛార్జీల వడ్డన అక్రమం
– మోడీ విధానాలతో ప్రజలపై పెనుభారాలు
– 30 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు సమరభేరి
– మెడికల్‌ సీట్ల అమ్మకం దుర్మార్గం
– సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
ఏలూరు : కరెంటు భారాలు, కోతలతో రాష్ట్ర ప్రజానీకం విలవిలలాడుతున్నారని సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. ఏలూరులోని సిపిఎం జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు, మూడు నెలలుగా కరెంటు బిల్లులు రెండు, మూడు రెట్లు అదనంగా వస్తున్నాయని తెలిపారు. సామాన్య ప్రజానీకం, బడ్డీకొట్టు వ్యాపారులు, చిన్నచిన్న పరిశ్రమలు నడిపేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ట్రూ అప్‌ ఛార్జీల పేరుతో 2016 నుంచి 40 పైసల నుంచి రూపాయికిపైగా అదనంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. దీంతో, గతంలో రూ.400 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు రూ.800 వస్తోందని చెప్పారు. గతంలో ఎవరో వినియోగించుకున్న విద్యుత్‌కు ఇప్పుడు అద్దెకు ఉంటున్నవారు చెల్లించాల్సి వస్తోందన్నారు. మరోపక్క రెండు నుంచి నాలుగు గంటలపాటు కరెంటు కోతలు విధిస్తున్నారన్నారు. దీంతో, ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 230 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మోటార్లకు కరెంటు లేక ఖరీఫ్‌ పంటలకు ఇబ్బంది వస్తోందని తెలిపారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్‌ హామీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నివాస గృహాలకు స్మార్ట్‌ మీటర్లు అవసరమా? అని ప్రశ్నించారు. రూ.6 వేలు ఖరీదు చేసే మీటర్లను రూ.35 వేలకు కొనుగోలు చేసి ఆ భారం వినియోగదారులపై వేసేందుకు ప్రభుత్వం పూనుకుందన్నారు. అదానీ, షిర్టీసాయి కంపెనీలకు లాభాలు చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందని విమర్శించారు. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ఆపాలని, ట్రూ అప్‌ ఛార్జీలు రద్దు చేయాలని, కరెంటు కోతలు నివారించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో సీట్లు సామాన్య ప్రజానీకానికి దక్కనీయకుండా ఎన్‌ఆర్‌ఐ, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటా పేరుతో ప్రభుత్వమే అమ్ముకోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఐదు మెడికల్‌ కాలేజీల ఏర్పాటును అంతా స్వాగతించామన్నారు. ఉన్న సీట్లలో 15 శాతం ఆలిండియా కోటాపోను మిగిలిన 85 శాతం సీట్లను మెరిట్‌ ప్రాతిపదికన ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. సగం సీట్లను ఎన్‌ఆర్‌ఐ, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ పేరుతో రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షలకు అమ్ముకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ జిఒలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారుమోడీ అధికారంలొకొచ్చాక 20 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా 11.50 శాతం ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు. టమాటా, నూనె, పప్పుల ధరలు భారీగా పెరిగిపోయాయని చెప్పారు. రేషన్‌ కింద ఇచ్చే చక్కెర, నూనె, పప్పులు ఇవ్వడం లేదన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటర్‌ రూ.120కు చేరాయని తెలిపారు. తాము అధికారంలోకొస్తే పెట్రోల్‌ రూ.40కు, గ్యాస్‌ సిలిండర్‌ రూ.400కు ఇస్తామని మోడీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 30వ తేదీ నుంచి సెప్టెంబర్‌ నాలుగో తేదీ వరకు సిపిఎం సమరభేరి యాత్ర సాగనుందని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్జీలు ఇవ్వనున్నామని, నాలుగో తేదీన మండల కార్యాలయాల వద్ద ధర్నాలు జరగనున్నాయని చెప్పారు. వీటిలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారువచ్చే నెలలో వామపక్షాల జాతీయ సదస్సు జరగనుందని చెప్పారు. విశాఖ ఉక్కు ఉద్యోగుల ఉద్యమం తరహాలో ప్రజలు ప్రత్యక్ష పోరాటంలోకి దిగాలని కోరారు. . పాడేరు మెడికల్‌ కాలేజీలో సీట్లు 75 శాతం గిరిజనులకే ఇవ్వాలని కోరారు. మెడికల్‌ సీట్లు అమ్ముకోవడం ఏ మాత్రమూ చెల్లబోదని, న్యాయస్థానంలో సానుకూలమైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర హక్కులపై వైసిపి, టిడిపి నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. మోడీని చూసి ఎందుకు వణికిపోతూ మోకరిల్లుతున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడితే ఊరుకోబోమన్నారు. ఇప్పటికైనా బిజెపిని నిలదీయాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో విఫలమైన బిజెపి నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు డిఎన్‌విడి.ప్రసాద్‌, పి.కిషోర్‌ పాల్గొన్నారు.

Spread the love