వాహనాల పార్కింగ్ లతో అవస్థలు
ఎందుకు రోడ్డు వెడల్పు చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.?
నవతెలంగాణ-అచ్చంపేట
పట్టణం రోజు రోజుకు విస్తరిస్తోంది. నివాస గృహాలు పెరుగుతున్నాయి. వ్యాపార దుకాణాలు పెరుగుతున్నాయి. వాహనాల రద్దీ పెరుగుతుంది. దీనికి అనుగుణంగా అచ్చంపేట మున్సిపాలిటీ పట్టణంలోని లింగాల రోడ్డు అంబేద్కర్ చౌరస్తా నుంచి పెట్రోల్ బంక్ వరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. అంతలోనే అసంపూర్తిగా చేసి వదిలేశారు. రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మాణం చేయడానికి వదిలిన ఖాళీ స్థలాన్ని డివైడర్ నిర్మాణం చేయకుండా సిసి రోడ్డు వేశారు. లింగాల రోడ్డు నిత్యం వాహనాలతో ప్రజలతో రద్దీగా ఉంటుంది. రోడ్డుకు ఇరువైపుల వ్యాపార దుకాణాలు ఉన్నాయి. వివిధ అవసరాలకు వచ్చిన ప్రజలు స్థలాలు లేకపోవడం వల్ల వాహనాలను రోడ్ల మీద పార్కింగ్ చేస్తున్నారు.
దీంతో వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పట్టణ ప్రజలు వ్యాపారస్తులు ప్రతిరోజు అవస్థలు పడుతున్నారు. గత ఐదేళ్లుగా పట్టణ ప్రజలు రోడ్డు వెడల్పు కోసం ఎదురుచూస్తున్నారు. రోడ్డు వెడల్పులో భాగంగా తొలగించవలసిన గృహ యజమానులకు నోటీసులు ఇచ్చారు. రోడ్డు విస్తరణ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని పట్టణంలో చర్చ జరుగుతుంది. ఎవరి ప్రయోజనాల కోసం రోడ్డు వెడల్పు పనులను నిలుపుదల చేస్తున్నారని ప్రజలు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా భవిష్యత్ తరాలకు విశాలమైన రోడ్లు కల్పించవలసిన బాధ్యత పాలకులపైన అధికారుల పైన లేదా.. అని ప్రజలు అడుగుతున్నారు. ఎన్నికల సందర్భంలో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం.. రోడ్డు వెడల్పులు చేస్తాం అని గొప్పలు చెప్పిన పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు పట్టించుకోవడంలేదని పట్టణ ప్రజలు ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు. ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకొని పాలకులు అధికారులు లింగాల రోడ్డును వెడల్పు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.



