ఫార్మా కంపెనీ అనుమతులు రద్దు చేయాలి

– జూన్‌ 2 తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు
– జాజుల శ్రీనివాస్‌గౌడ్‌
నవతెలంగాణ-మునుగోడు
పచ్చని పల్లెలను, ప్రజలను పీల్చి పిప్పి చేసి కాలుష్యాన్ని వెదజల్లీ ప్రజల జీవితాలతో చెలగాటమాడి ప్రజలు జీవించే హక్కును కాలరాసేటువంటి ఫార్మా కంపెనీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండలంలోని కిష్టాపురంలో ఫార్మా కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో, ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నేతృత్వంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 36వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ దీక్షలో పాల్గొని మాట్లాడారు. గత రెండు నెలలుగా కిష్టాపురం గ్రామ శివారులో ఏర్పాటు చేసేటటువంటి ఫార్మా కంపెనీ అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రజలు శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే ప్రభుత్వాలు కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కుల కోసం పోరాడితే ప్రభుత్వం పిలిసి చర్చించే బాధ్యత ఉందని, కానీ ప్రజలు చేస్తున్న పోరాటాలను గౌరవించకుండా వారితో చర్చించకుండా ఫార్మా కంపెనీలను రద్దు చేస్తామని స్పష్టమైన హామీ ప్రకటించకుండా ప్రభుత్వాలు తత్చారం చేస్తున్నాయని ఆరోపించారు. జూన్‌ 2వ తేదీ తర్వాత మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండల కేంద్రాల్లో ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా ఫార్మా కంపెనీ వద్దు… పకృతి ముద్దు…అనే నినాదంతో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైన ప్రభుత్వాలు స్పందించి కంపెనీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షాల నాయకులు ఫార్మా వ్యతిరేక కమిటీ అధ్యక్షులు, ఎంపీటీసీ భీమనపల్లి సైదులు, ఫార్మా వ్యతిరేక కమిటీ గ్రామ అధ్యక్షులు నందపాటి వెంకన్న, గ్రామ ఉపాధ్యక్షులు మునుకుంట్ల పరమేష్‌, గ్రామ కమిటీ కార్యదర్శి బోయ లక్ష్మణ్‌, వార్డ్‌ మెంబర్‌ మునుకుంట్ల భూపాల్‌, నరసింహ, కిష్టయ్య, యాదయ్య, అంజయ్య, శంకరయ్య, నరసింహ చారి, శేఖర్‌, లింగస్వామి, రాములు, వాసు,జాల బచ్చి ప్రసాద్‌ ,వెంకటాచారి, వెంకటేశ్‌ ,బాబు ,కందుల అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love