అసోంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలు ఉధృతమైన నిరసనలు

గువహతి : అసోంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు, పాలక బిజెపి మిత్రపక్ష మద్దతుదారుల నిరసనలు ఉధృతమయ్యాయి. రాష్ట్రంలోని 14లోక్‌సభా, 126 అసెంబ్లీ స్థానాల సంఖ్య మారలేదు. అయితే, నాలుగు అసెంబ్లీ స్థానాలను జనరల్‌ నుండి రిజర్వ్‌డ్‌ కేటగిరీలోకి తరలించారు. మరో మూడు సీట్లను బోడోలాండ్‌ ప్రాదేశిక మండలిలో చేర్చారని ఎన్నికల కమిషన్‌ ప్రచురించిన ముసాయిదా ప్రతిపాదన పేర్కొంటోంది. అయితే కొన్ని పార్లమెంటరీ, అసెంబ్లీ స్థానాల పేర్లను మార్చాలని ప్రతిపాదించారు. పలు స్థానాల సరిహద్దులను మార్చాలని కూడా ప్రతిపాదించారు. ముస్లిం ఓటర్ల సంఖ్యను తగ్గించేందుకే ఈ చర్యలని ఆరోపణలు వెలువడుతున్నాయి. మత, జాతుల ప్రాతిపదికన ఓటర్లను విభజించడానికే ఈ ప్రతిపాదనలన్నీ అని మైనారిటీలు ప్రాతిపదిక గల అఖిల భారత యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎఐయుడిఎఫ్‌) విమర్శిస్తోంది. తమ ఎంఎల్‌ఎల నియోజకవర్గాలు కొన్నింటి విలీనాన్ని బిజెపి మిత్రపక్షం అసోం గణ పరిషత్‌ (ఎజిపి) వ్యతిరేకిస్తోంది. అంగూరి నియోజకవర్గంలోని శివసాగర్‌ జిల్లాలో శనివారం ఎజిపి మద్దతుదారులు నిరసన చేపట్టారు. మరో నియోజకవర్గంతో అంగూరిని విలీనం చేయడాన్ని తాము అంగీకరించబోమని దీనివల్ల తమ గుర్తింపు దెబ్బతింటుందని స్థానిక ఎజిపి నేత చెప్పారు. దక్షిణ అస్సాంలోని బారక్‌ లోయలో ఎఐయుడిఎఫ్‌ మద్దతుదారులు నిరసనలు చేపట్టారు. ప్రస్తుతమున్న నియోజకవర్గాలను ఏ విధంగానూ మార్చరాదని డిమాండ్‌ చేశారు. జులై 7, 8 తేదీల్లో 12 ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు ఢిల్లీలో ఇసికి మెమోరాండం అందచేయనున్నట్లు అస్సాం కాంగ్రెస్‌ అధ్యక్షుడు భూపేన్‌ కుమార్‌ బోరా చెప్పారు.

 

Spread the love