ప్రొటోకాల్‌!

”సర్వం సహ చక్రవర్తి అమెరికా వెళ్ళి అన్ని సమస్యలకు యోగానే పరిష్కారం అని చెప్పారు. మణిపూర్‌ మనదేశంలోనే ఉంది కదా! ముందు మణిపూర్‌ వెళ్ళి అక్కడి ప్రజలతో యోగా చేయించి ప్రశాంతత నెలకొల్పి ఆ తర్వాత ఐక్యరాజ్యసమితిలో చెబితే చాలా బాగుండేది కదా! పోని అమెరికా నుండి డైరెక్టుగా మణిపూర్‌లో దిగి యోగా చేయించి అక్కడ ప్రశాంతత తెస్తారు కావచ్చు” అన్నది భార్య.

”ఎంతైనా మన పెద్దాయన ఛరిష్మానే వేరు! చూడు ఆమెరికాలో ఎంత గౌరవం! ఎన్ని మర్యాదలు! 70ఏండ్లలో ఇంత గౌరవం ఎవరికి దక్కలేదు తెలుసా?” పొంగిపోతూ చెప్పాడు భర్త.
”నిజమా!” ఆశ్చర్యంగా అడిగింది భార్య.
”ముమ్మాటికీ నిజం! కావాలంటే టీవీలు చూడు! నమ్మకపోతే పేపర్స్‌ చూడు! పెద్దాయనకు స్వాగతం పలకటానికి మహామహులే క్యూ కడుతున్నారు! భారత సర్వం సహా చక్రవర్తికి బైడెన్‌ పెద్ద దావత్‌ కూడా ఇచ్చాడు తెలుసా” అన్నాడు మరింత గొప్పగా భర్త.
”ఇంటికి వచ్చిన చుట్టాలకు ఎంత పేదవాడైనా తన తాహతుకు తగ్గ దావత్‌ ఇస్తాడు! బైడెన్‌ అమెరికా అధ్యక్షుడు గనక తన తాహతుకు తగ్గట్టు దావత్‌ ఇచ్చాడు! ఇందులో గొప్పేముంది?” ఆశ్చర్యంగా అడిగింది భార్య.
”ఒసేరు మొద్దు మొహమా! నీకు ప్రొటోకాల్‌ అంటే ఏమిటో తెలియదు. అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు! తనతో సమానస్థాయి ఉన్నవారికి ఇచ్చే దావత్‌ వేరు. తక్కువ స్థాయి వారికి ఇచ్చే దావత్‌ వేరు! మన పెద్దాయనకు తనతో సమాన స్థాయి దావత్‌ ఇచ్చాడు బైడెన్‌ అది తెలుసుకో!” అన్నాడు భర్త.
”ప్రొటోకాల్‌ అంటే అదన్నమాట! దావత్‌ల వద్దే ఉంటుందన్న మాట!” అన్నది భార్య.
”పల్లెటూరి పిల్లను చేసుకోవటం నాదే బుద్ధి తక్కువ! ప్రొటోకాల్‌ అంటే స్థాయిని బట్టి గౌరవించటం! ఇది దావత్‌ల వద్దే కాదు! అన్ని చోట్లా ఉంటుంది! అంటే సభలు, అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు మొదలైనవి అన్న మాట” అన్నాడు భర్త.
”ఓహౌ! అట్లానా! అయితే ద్రౌపతి ముర్ముకు ఏ స్థాయి లేదా!” అనుమానంగా అడిగింది భార్య.
”ద్రౌపతి ముర్ము మన రాష్ట్రపతి! అంటే ప్రథమ పౌరురాలు” అంటే అన్నింటా ప్రథమ గౌరవం ఆమెకే దక్కుతుంది. ఒక ఎస్టీ మహిళకు అంత గొప్ప గౌరవం కల్పించాడు! మన పెద్దాయన! అది ఆయన గొప్పతనం!” అన్నాడు భర్త గర్వంగా.
”మరి కొత్తపార్లమెంటును ఆమే ప్రారంభించాలి కదా! ఇక్కడ ప్రొటోకాల్‌ అమలుకాదా! లేక సర్వం సహాచక్రవర్తి ముందు ఏ ప్రొటోకాల్‌ పనిచేయదా!” అడిగింది భార్య.
”సరే! సరే! అమెరికాలో చక్కగా విలేకర్ల సమావేశంలో పెద్దాయన నవ్వుతూ మాట్లాతాడు! మన దేశంలోని విలేకర్లతో ఎప్పుడూ మీటింగ్‌ పెట్టలేదు ఎందుకూ?” అడిగింది.
”పిచ్చిదానా! పెద్దాయనను అడిగే స్థాయి ఈ దేశంలోని విలేకర్లకు ఉందా?” పెద్దాయన మేధా సంపన్నత విలేకర్ల స్థాయి ఎన్నడో దాటిపోయింది!” అన్నాడు భర్త చిద్విలాసంగా.
”భారతదేశంలోని విలేకర్లకు స్థాయిలేదు గాని అమెరికా విలేకర్లకు మాత్రం స్థాయి ఉందన్న మాట! దేశం మీద ప్రేమ ఉందా అన్న డౌటు కొడుతోంది ఎక్కడో!” అన్నది భార్య.
”పెద్దాయన దేశ ప్రేమపై డౌటా? నీవు రాజద్రోహానికి పాల్పడుతున్నావు!” అన్నాడు భర్త ఆగ్రహంగా.
”ఆ సంగతి తర్వాత మాట్లాడుదాం! మన దేశంలోని విలేకర్ల స్థాయి చాలకపోతే పత్రికా సంపాదకులతో సమావేశాలు జరపొచ్చు కదా! ఓహౌ వారికీ స్థాయి లేక యాక్షన్‌ అండ్‌ కామెడీ హీరో అక్షరుకుమార్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు కావచ్చు!” అన్నది భార్య.
”అదీ సంగతి! రాజద్రోహం అనగానే దారిలోకి వచ్చావు! తన స్థాయికి తగ్గవారితోనే పెద్దాయన మాట్లాడతారు! అడ్డమైన వాళ్ళతో మాట్లాడరు ఇది గుర్తుంచుకో!” అయినా ఇంటర్వ్యూలో చెప్పాల్సినవి అన్నీ ”మన్‌ కీ బాత్‌”లో ప్రపంచానికి చెబుతూనే ఉన్నాడు కదా!” అన్నాడు భర్త.
”మరి మణిపూర్‌లో నెల రోజులకి పైగా మారణకాండ నడుస్తోంది కదా! ఎందుకు?” అడిగింది భార్య.
”పక్కనే ఉన్న చైనా, ఇంకా పాకిస్థాన్‌ దేశ విభజనకు చేస్తున్న కుట్రల వల్ల మణిపూర్‌లో మారణకాండ ఆగటం లేదు!” అన్నాడు భర్త.
”సర్వం సహ చక్రవర్తి అమెరికా వెళ్ళి అన్ని సమస్యలకు యోగానే పరిష్కారం అని చెప్పారు. మణిపూర్‌ మనదేశంలోనే ఉంది కదా! ముందు మణిపూర్‌ వెళ్ళి అక్కడి ప్రజలతో యోగా చేయించి ప్రశాంతత నెలకొల్పి ఆ తర్వాత ఐక్యరాజ్యసమితిలో చెబితే చాలా బాగుండేది కదా! పోని అమెరికా నుండి డైరెక్టుగా మణిపూర్‌లో దిగి యోగా చేయించి అక్కడ ప్రశాంతత తెస్తారు కావచ్చు” అన్నది భార్య.
”నీవు యోగాను అవమానిస్తున్నావు. భారతీయ సంస్కృతిని కించపరుస్తున్నావు!” కోపంగా అన్నాడు భర్త.
”నా భాష అర్థం చేసుకోండి! యోగా మానసిక ప్రశాంతత కల్పిస్తుందని, శారీరక ఆరోగ్యం తెస్తుందని, మన రాందేవ్‌ బాబా, జగ్గీ వాసుదేవ్‌ లాంటివారు చెప్పిందే నేను చెబుతున్నాను. ఒక పక్క మణిపూర్‌ తగలబడిపోతుంది. అక్కడి ప్రజలు వందల సంఖ్యలో హత్య చేయబడుతున్నారు. ప్రపంచానికి యోగా గొప్పతనం గురించి చెప్పే మనం మనదేశానికి యోగాను ఉపయోగించుకోవటంలో విఫలమవుతున్నాం! అందుకే పెద్దాయన వచ్చేలోగా రాందేవ్‌ జగ్గీవాసుదేవ్‌లను మణిపూర్‌ పంపించి అక్కడి ప్రజలకు యోగా నేర్పించి ప్రశాంత వాతావరణం కల్పించాలి!” దృఢంగా అన్నది భార్య.
”ఏం మాట్లాడాలో భర్తకు తోచటం లేదు! అయోమయంగా భార్యవైపు చూస్తున్నాడు.
”యోగా చేయటం ద్వారా ఆలోచనలను నియంత్రించవచ్చునని, సద్భావనలు కలుగుతాయని చెబుతున్నారు కదా!” అడిగింది భార్య.”ముమ్మాటికీ నిజం!” నమ్మకంగా చెప్పాడు భర్త.
”మరి బీజేపీలో ఉన్నవారు యోగా చేయరా? చేసినవారు అట్లా నటిస్తారా?” అడిగింది భార్య.
”అన్ని పార్టీల్లాంటిది కాదు బీజేపీ. తాను ఆచరించిన తర్వాతే మిగిలిన వారికి చెబుతుంది! అంతేకాదు యోగాలో నటనకు అవకాశమేలేదు! ఒకసారి యోగా చేయటం ప్రారంభిస్తే దాని ప్రభావం మనపై తప్పకుండా పడుతుంది!” అన్నాడు భర్త.
”మరి బ్రిజ్‌ భూషణ్‌ యోగా చేయడా? లేక చేసినట్లు నటిస్తాడా? తన కూతుళ్ళలాంటి రెజర్లపై వేధింపులకు ఎందుకు పాల్పడ్డాడు? దేశానికి పతకాలు సాధించి, దేశ గౌరవాన్ని పెంచిన మహిళలను వేధించాలన్న దుర్మార్గపు ఆలోచనను యోగా ద్వారా ఎందుకు అధిగమించలేదు? నాలుగు వేదాలు, సకల శాస్త్రాల్లో పండితుడైన రావణుడు సీతమ్మను అపహరించాడు! కాని వేధించలేదు. సీతమ్మ ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె ఎదుటకి కూడా రాలేదు! తనను గడ్డిపరకతో సమానంగా చూసినా సీతమ్మను గౌరవించాడే తప్ప అవమానించలేదు! అయినా సరే! రావణుడు తరతరాలకు విలన్‌గా మిగిలిపోయాడు! మరీ మహిళా రైజళ్లను వేధింపులకు గురి చేసిన బ్రిజ్‌ భూషణ్‌ మాత్రం గౌరవాలు అందుకుంటాడు. కొత్త పార్లమెంటులోకి గౌరవ ఆహ్వానం అందుకుంటాడు. పతకాలు సాధించిన రెజ్లర్లను మాత్రం అవమానకరంగా రోడ్లమీద ఈడ్చి వేస్తారు! రోజూ యోగా చేసే పెద్దాయనకు తన దేశానికి అత్యున్నత స్థాయి గౌరవం సంపాదించి పెట్టిన ఈ దేశపు ఆడబిడ్డలు లైంగిక వేధింపులకు గురి అయితే పరామర్శించాలన్న మంచి ఆలోచన ఇంకా రావటం లేదు! బ్రిజ్‌ భూషణ్‌పై చర్య తీసుకుని, పార్టీ నుండి బహిష్కరించాలన్న సదుద్దేశ్యం కలగటం లేదు! మరింకెందుకు యోగా చేయటం? యోగా గొప్పతనం గురించి ప్రపంచానికి చాటి చెప్పటం?” నిలదీసింది భార్య.
భర్త శవాసనం వేసేశాడు.
– ఉషాకిరణ్‌

Spread the love