– శాంతికి భంగం కలిగిస్తున్నారు
– గవర్నర్ పదవికి అప్రతిష్ట తెస్తున్నారు
– నిరసనకారులతో అలాగేనా ప్రవర్తించేది?
– ఆరీఫ్‌ఖాన్‌పై కేరళ సీఎం పినరయి మండిపాటు
తిరువనంతపురం: ప్రతి విషయంలోనూ రాష్ట్ర గవర్నర్ ఖాన్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. ప్రొటోకాల్‌ను గవర్నర్ తరచూ ఉల్లంఘించడంలో ఔచిత్యాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రజలకు చేరువయ్యేందుకు వామపక్ష సంఘటన ప్రభుత్వం ప్రారంభించిన నవ కేరళ సదస్ కార్యక్రమం సందర్భంగా పతనంతిట్టలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ‘కేరళలో నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని నాశనం చేసేందుకు గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని నేను గతంలోనే చెప్పాను. ఆ తర్వాత ఆయన చేసిన ప్రతి పని నేను చెప్పింది నిజమేనని నిరూపించింది. తాను నిర్వహిస్తున్న పదవిని గవర్నర్ తరచూ మరిచిపోతున్నారు. ఆ పదవికి అప్రదిష్ట తెచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని విమర్శించారు. ఛాన్సలర్‌గా గవర్నర్ తీసుకున్న చర్యలు సహజంగానే నిరసనలకు అవకాశం ఇచ్చాయని విజయన్ చెప్పారు. విశ్వవిద్యాలయం ఎంపిక చేసిన ప్యానల్ నుండి ఆయన సెనెట్‌ను నియమించాల్సి ఉందని, అయితే ఆయన ఆర్‌ఎస్‌ఎస్ అందజేసిన జాబితా నుండి సభ్యులను ఎంపిక చేస్తున్నారని తెలిపారు. ‘తన విచక్షణాధికారాలు ఉపయోగించి సెనెట్‌కు సభ్యులను నామినేట్ చేశానని గవర్నర్ చెబుతున్నారు. ఆయన తనంతట తాను సభ్యులను గుర్తించి నామినేట్ చేయగలరా? యూనివర్సిటీ ఇచ్చిన జాబితాలోని సభ్యులకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ గవర్నర్ మాత్రం ఒకే ఒక అర్హతను గుర్తిస్తున్నారు. అది వారు ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించిన వారు కావడమే. ఈ చర్యల కారణంగానే ఆయన విద్యార్థుల నుండి నిరసన ఎదుర్కొంటున్నారు’ అని వివరించారు.
నిరసనకారులపై గవర్నర్ కఠిన పదజాలం ఉపయోగించారని, వారిపై నేరస్తులు, గూండాలు అని ముద్ర వేశారని విజయన్ ఆరోపించారు. వివిధ హోదాలలో అనేక సంవత్సరాల పాటు పనిచేసిన వ్యక్తికి ఇది తగని పని అని అన్నారు. ‘అలాంటి పదవిలో ఉన్న వ్యక్తి నిరసనకారులతో ఘర్షణకు దిగి వారికి నల్ల జెండాలు చూపుతారని ఎవరైనా ఆశిస్తారా? ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలపడం అనేది ప్రాథమిక హక్కు అని ఆయన మరచిపోతున్నారు. రెండు రోజుల క్రితం గవర్నర్ ఖాన్‌పై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రోహింటన్ నారిమన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఇప్పుడు దేశమంతా గవర్నర్ చర్యలను గమనిస్తోందని విజయన్ అన్నారు.