మహిళలపై రామగిరి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుని బూతు పురాణం

– సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
నవతెలంగాణ :మంథని 
మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్‌ అనుచరుడు, రామగిరి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు తోట చంద్రయ్య మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బూతులు తిట్టిన వీడియో మంగళవారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్న తోట చంద్రయ్య డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగిన మహిళను, అమెకు మద్దతుగా వచ్చిన మరో మహిళను అసభ్యంగా దూషించిన బూతు పురాణం వాట్సప్‌లో చక్కర్లు కొట్టడంతో నియోజకవర్గంలోని మహిళలు దుద్దిల్ల శ్రీధర్‌పై భగ్గుమన్నారు. ఉన్నత విద్యావంతుడనని చెప్పుకునే దుద్దిల్ల శ్రీధర్‌ తన అనుచరుల ఆగడాలు అధికారంలో ఉన్నప్పటిలాగే ప్రతిపక్షంలో కొనసాగుతున్నా అదుపు చేయని అసమర్థుడని విమర్శిస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన మండల పార్టీ అధ్యక్షుని స్థానంలో ఉన్న వ్యక్తి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో దూషిస్తుంటే ఎమ్మెల్యే శ్రీధర్‌ వద్ద నుండి కనీస స్పందన లేదని ఆగ్రహిస్తున్నారు. మరోవైపు ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేయడమే కాకుండా వారినే దబాయిస్తూ రామగుండంలో లక్షలు లక్షలు వసూలు చేశారు, ఇదో పెద్ద లెక్కా అంటూ ఉన్నప్పుడిస్తాం అని ఆ ఇద్దరు మహిళలను రాయడానికి వీలులేని బూతులు తిట్టాడు. ఇప్పటికే డబ్బులు వసూలు చేస్తున్నట్లు దృవీకరించే ఆడియో ఒకటి వైరల్‌ కాగా అందులో మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్‌ లైన్‌లోనే ఉండగా సంభాషణ జరిగినా తనకేం పట్టనట్లు వ్యవహరించాడు.
యధా రాజ, తధా ప్రజ అన్నట్లు తన అనుచరులు అవినీతికి పాల్పడుతున్నా, దౌర్జన్యాలు చేస్తున్నా, ఆఖరికి మహిళలను బూతులు తిట్టినా సమర్థించే ఎమ్మెల్యే శ్రీధర్‌ ఈ సంఘటనకు బాధ్యత వహించి మహిళలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Spread the love