రిజర్వేషన్లపేరుతో తప్పుదోవ పట్టించే యత్నం : రాణి రుద్రమ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రిజర్వేషన్లపేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ది పొందాలనే ఆలోచనలో కాంగ్రెస్‌ పార్టీ ఉందని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ పార్టీకి లేదన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు చట్టరూపం కల్పించింది మోడీ సర్కారే అని గుర్తు చేశారు. మోడీ సర్కారు రాజకీయంగా మహిళలకు అధిక ప్రాధానత్య ఇస్తున్నదని చెప్పారు. మోడీ క్యాబినెట్‌ 12 మంది మహిళలున్నారనీ, ఆర్థిక శాఖ మంత్రి మహిళే అని గుర్తు చేశారు. బీజేపీ జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీల్లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామనీ, కాంగ్రెస్‌ పార్టీలో అలా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తమ పార్టీ నలుగురు మహిళలను సీఎం చేసిందని చెప్పారు. మహిళల కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా 25 వేల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఆర్ధిక స్వావలంబన కోసం స్టార్టప్‌లను తీసుకొచ్చామనీ, ముద్ర లోన్లలో ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. మోడీ ప్రధాని అయ్యాక దేశంలో భ్రూణ హత్యలు తగ్గాయనీ, స్త్రీ, పురుషుల నిష్పత్తిలో అంతరాలు బాగా తగ్గాయని వివరించారు.

Spread the love