రెగ్యులరైజ్‌ అసాధ్యం

– పోస్టులు, వయోపరిమితి పెంచాం
– సమ్మె విరమించండి
– సేవలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు
– డీహెచ్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు
– సెకెండ్‌ ఏఎన్‌ఎం యూనియన్ల నాయకులతో చర్చలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
”కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్‌ చేయడం అసాధ్యం. అది అయ్యే పని కాదు. చాలా సమస్యలతో ముడిపడి ఉన్నది. జాతీయ ఆరోగ్య మిషన్లో సెకెండ్‌ ఏఎన్‌ఎంలు మాత్రమే లేరు. మిగిలిన క్యాడర్ల వారు కూడా ఉన్నారు. అదే విధంగా వైద్యారోగ్యశాఖలోనే కాకుండా మిగిలిన శాఖల్లోనూ కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. న్యాయవివాదాలు రాకుండా కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ముందుకొచ్చింది. రెగ్యులర్‌ ఏఎన్‌ఎం పోస్టుల భర్తీకి సంబంధించి ఇది వరకే ఇచ్చిన నోటిఫికేషన్‌లో 1,520 పోస్టులుండగా వాటిని 1,931కి పెంచాం. రాబోయే మూడు నెలల కాలంలో ఖాళీ అయ్యే పోస్టులను కూడా కలుపుతాం. వయోపరిమితిని ఒసీలకు 48 ఏండ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 53 ఏండ్లకు పెంచాం. వెయిటేజీని అత్యధికంగా 20 మార్కుల నుంచి 30 మార్కులకు పెంచాం. పరీక్షను ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ నిర్వహిస్తాం. పరీక్షకు సిద్ధపడేందుకు మెటీరియల్‌ను, జిల్లాల్లో ఉచిత శిక్షణ ఇస్తాం. ఏఎన్‌ఎంల వివిధ రకాల డిమాండ్లు, పనిభారంపై అధ్యయనం వేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీ వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కమిటీ కొన్ని వారాల్లోనే నివేదిక ఇస్తుంది. రాష్ట్రంలో తల్లులు, బిడ్డలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు దెబ్బతినకుండా సమ్మె విరమించాలి…. ” అని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్‌ కోఠిలోని డీహెచ్‌ కార్యాలయంలో ఆయన ఆయా సంఘాల నేతలతో చర్చించాక మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో కొన్ని సంఘాలు కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను సమ్మెకు ప్రేరేపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే జీతాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. గుజరాత్‌లో రూ.17 వేలు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.23,393, కర్ణాటకలో రూ.18,523 మాత్రమే చెల్లిస్తున్నారని ఉదహరించారు. తెలంగాణలో రెగ్యులర్‌ ఉద్యోగి బేసిక్‌ పేను ఇస్తున్నట్టు తెలిపారు. కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలకు ఇస్తున్న వెసులుబాటుతో రెగ్యులర్‌ ఉద్యోగాల్లో 99.99 శాతం వారికే వస్తాయని తెలిపారు. జనాభా ప్రాతిపదికన కొత్త పోస్టుల మంజూరు యోచన కూడా ఉందని వెల్లడించారు. మార్కులు, సీనియార్టీ ప్రాతిపదికన అంటూ రెగ్యులరైజేషన్‌ చేయలేమని స్పష్టం చేశారు. దీంతో న్యాయసంబంధమైన సమస్యలు వచ్చే అవకాశముందని తెలిపారు. ప్రభుత్వ సేవలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమ్మెను ప్రోత్సహిస్తున్న యూనియన్ల నాయకుల అంతరాత్మకు కూడా రెగ్యులరైజ్‌ కాదనే విషయం తెలుసని డీహెచ్‌ కామెంట్‌ చేశారు. ఉన్నవి 2000 ఉద్యోగాలైతే 5000 మందిని రెగ్యులరైజ్‌ చేయాలంటే వారిలో ఎవరిని చేయాలి? అని యూనియన్‌ నాయకులను ప్రశ్నించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను ఒకరకంగా ప్రభుత్వం పరోక్షంగా రెగ్యులర్‌ చేస్తున్నట్టేనని డీహెచ్‌ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వంతో చర్చలు విఫలం
కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల సమ్మె కొనసాగింపు -టీయుఎంహెచ్‌ఇయూ
సమ్మె ఐదో రోజుకు చేరిన సందర్భంగా ప్రభుత్వం ఆహ్వానం మేరకు డీహెచ్‌తో జరిగిన చర్చల్లో తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీయుఎంహెచ్‌ఇయూ – సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఫసియుద్దిన్‌,యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ కె.యాద నాయక్‌, యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి ఏ కవిత,రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ బలరాం, కిరణ్మయి, సుగుణ, ప్రభవతి, మాధవి, అనిత, ప్రమీల తదితర ప్రతినిధులు పాల్గొన్నారు. యధావిధిగా రెగ్యులర్‌ చేయడం కుదరదనీ, 70 మార్కులకు రాత పరీక్ష ఉంటుందనీ, 30 మార్కుల సర్వీస్‌ వెయిటేజీ ఇస్తామనీ, నోటిపికేషన్‌లో అదనంగా 411 పోస్టులు పెంచి మొత్తం 1,931 పోస్టులు భర్తీ చేస్తామనీ, అత్యధికంగా వయోపరిమితి 53 ఏండ్లు ఉంటుందన్న ప్రభుత్వం చెప్పిన విషయాలపై వారు ఆ యూనియన్‌ జిల్లాల ప్రతినిధులు, రాష్ట్ర కమిటీలో చర్చించారు. ఆ సమావేశాల్లో అందరిని రెగ్యులర్‌ చేయాలనీ, రాత పరీక్ష రద్దు చేయాలనీ, సమ్మె చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించినందున సమ్మె యథాతథంగా కొనసాగుతుందని యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్‌ తెలిపారు. ప్రభుత్వమే పునరాలోచించి చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం జిల్లాల్లోని సమ్మె శిబిరాల్లో వినూత్న కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.
వీఆర్‌ఏల కోసం 14 వేలు సృష్టించలేదా? -ఎం.నరసింహ
డీహెచ్‌తో జరిగిన చర్చలు విఫలమైనట్టు ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాలరాజు తెలిపారు. ఈ మేరకు ఆ యూనియన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. జాతీయ ఆరోగ్య పథకం కేంద్ర ప్రభుత్వ మిషన్‌ అయినప్పటికీ ఉద్యోగుల ఎంపిక విషయం మాత్రం రాష్ట్ర పరిóదేనని తెలిపారు. వీఆర్‌ఏల కోసం 14 వేల పోస్టులను సృష్టించిన ప్రభుత్వం ఏఎన్‌ఎంల కోసం 4 వేల పోస్టులను సృష్టించలేదా? అని ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వానికి ధన్యవాదాలు -బీఆర్టీయూ
పోస్టులు పెంచి, వయోపరిమితిలో సడలింపునిచ్చిందనందుకు బీఆర్టీయూ అనుబంధ సెకెండ్‌ ఏఎన్‌ఎం అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. డీహెచ్‌ మీడియా సమావేశం అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రాధ మాట్లాడుతూ రెగ్యులర్‌ ఏఎన్‌ఎం పోస్టుల సంఖ్యను 5,500కు పెంచాలని కోరినట్టు తెలిపారు. గత 20 ఏండ్లుగా సబ్‌ సెంటర్లు పెరగలేదనీ, జనాభా ప్రాతిపదికన వాటిని పెంచితే సమస్య పరిష్కారమవుతుందన్నారు.
అన్ని ఖాళీలను భర్తీ చేయాలి -తెలంగాణ వైద్యారోగ్య ఉద్యోగుల సంఘం
హెచ్‌1 యూనియన్‌
రాష్ట్రవ్యాప్తంగా ఎంపీహెచ్‌ఏ ఖాళీలన్నింటినీ గుర్తించి భర్తీ చేయాలని తెలంగాణ వైద్యారోగ్య ఉద్యోగుల సంఘం హెచ్‌1 యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కర్నాటి సాయిరెడ్డి కోరారు. జనాభా ప్రాతిపదికన మైదాన ప్రాంతాల్లో 5 వేల జనాభాకు, ఏజెన్సీ ఏరియాలో 3 వేల జనాభాకు ఒక సబ్‌ సెంటర్‌ మంజూరు చేయాలని సూచించారు.
జీవో జారీ
కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో ఇప్పటికే గుర్తించిన 1,520 పోస్టులతో పాటు అదనంగా 146 ఖాళీలను భర్తీ చేయనున్నట్టు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు వయోపరిమితి, వెయిటేజీ పాయింట్ల పెంపును ఆమోదించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటితో పాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో ప్రకటించిన 265 పోస్టులను కూడా ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్‌లో కలిపినట్టు వైద్యారోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Spread the love