విలీనం కంటే ముందే సమస్యలు పరిష్కరించాలి
ఆర్టీసీ రెగ్యులేషన్స్ సమూలంగా ఎత్తివేయాలి
ఉద్యోగులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలి
అలవెన్స్ ల పెంపుదల సర్క్యులర్‌ను వెంటనే విడుదల చేయాలి :
ఎస్‌డబ్ల్యూఎఫ్ ఖమ్మం రీజియన్ విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావు
నవతెలంగాణ – ఖమ్మం
ఆర్టీసీ కార్మిక వర్గాన్ని ఐక్యంగా నిలపడం కోసం నిరంతరం కృషి చేస్తామని, ఉద్యోగులకు నష్టం కలిగించే విధానాలను ఎస్‌డబ్ల్యూఎఫ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధించబోదని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావు తెలిపారు. మంగళవారం ఖమ్మంలోని మంచికంటి హాల్‌లో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్-సీఐటీయూ) నాయకులు గుండు మాధవరావు అధ్యక్షతన జరిగిన ఖమ్మం రీజియన్ విస్తృతస్థాయి సమావేశంలో ఖమ్మం డిపో కార్యదర్శి గుగ్గిళ్ల రోశయ్య స్వాగతోపన్యాసం చేశారు. రీజియన్ సహాయ కార్యదర్శి కుడుదుల వెంకన్న సంతాప తీర్మానం పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం పట్ల కార్మిక సంఘాల వైఖరిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. 2013 వేతన సవరణ తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల అలవెన్సుల పెంపుదల లేదన్నారు.
మూడు రోజుల సమ్మె తర్వాత యాజమాన్యంతో జరిగిన చర్చల్లో 80 శాతం అలవెన్సుల పెంపుదలకు అంగీకరించారని, అందుకు సంబంధించిన సర్క్యులర్ వెంటనే విడుదల చేసి కార్మికులకు నష్టం జరగకుండా చూడాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు సాధించకుండా, ఆర్టీసీలో రెగ్యులేషన్స్ లో లేనటువంటి డిపోస్ఫేర్ విధానాన్ని ఎత్తివేయాలని కోరకుండా ఆర్టీసీ కార్మిక సంఘాలు కార్మికుల్ని మభ్య పెట్టడం సరికాదన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలకు చిత్తశుద్ధి ఉంటే ఇన్నేండ్లలో ఉద్యోగ భద్రత ఎందుకు సాధించలేకపోయారో ఉద్యోగులు గమనించాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే కంటే ముందే పరిష్కరించాల్సిన అంశాలను వెంటనే పరిష్కరించాలని, సీసీఎస్, ప్రావిడెంట్ ఫండ్ సంస్థలకు ఆర్టీసీ యాజమాన్యం చెల్లించాల్సిన డబ్బులను వెంటనే చెల్లించాలని తెలిపారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని, వేతన సవరణ ఎరియర్స్ ను ఆర్టీసీ ఉద్యోగులందరికీ వెంటనే చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.
15న మెకానిక్‌ల సదస్సు, 18న మహిళా సదస్సు
కేటగిరీల వారీగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఖమ్మంలో జూన్ 15న రాష్ట్ర మెకానికల్ సదస్సు,18న రాష్ట్ర మహిళా సదస్సులు, జూన్ 22న వరంగల్‌లో రాష్ట్రస్థాయి డ్రైవర్ల సదస్సును నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర సహాయ కార్యదర్శి గడ్డం లింగమూర్తి తెలిపారు. యూనియన్లకు అతీతంగా ఆర్టీసీ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మణుగూరు, కొత్తగూడెం, ఖమ్మం డిపోల్లో.. ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్‌ల నుంచి ఎస్‌డబ్ల్యూఎఫ్ విధానాల పట్ల ఆకర్షితులై యూనియన్‌లో చేరిన వారికి సమావేశం స్వాగతం పలికింది. రీజియన్‌లోని పని పరిస్థితులపై రీజియన్ కార్యదర్శి పిట్టల సుధాకర్ నివేదిక ప్రవేశపెట్టారు. అనంతరం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌గా సెలెక్టయిన రోశయ్యను సత్కారించారు. ఖమ్మం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తూ, యూనియన్ డిపో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ డిపార్ట్ మెంటల్ టెస్ట్ రాసి ఆర్టీసీలో డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) గా నియామకం పొందినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజయన్ కమిటీ కోశాధికారి పగిళ్లపల్లి నరసింహారావు, సీఐటీయూ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కళ్యాణం వెంకటేశ్వరరావు, ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాణాల రాంబాబు, ప్రచార కార్యదర్శి పోరెడ్డి రవీందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జే. పద్మావతి, ఖమ్మం రీజియన్ ప్రచార కార్యదర్శి తోకల బాబు, రీజియన్ మహిళా కన్వీనర్ డి.సరిత, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



