భారత్‌కు ఊరట!

– 4-1తో ఆస్ట్రేలియాపై ఘన విజయం
– సుదీర్మన్‌ కప్‌ ఫైనల్స్‌ 2023
సుజౌ (చైనా) : సుదీర్మన్‌ కప్‌ ఫైనల్స్‌లో టీమ్‌ ఇండియాకు ఊరట విజయం లభించింది. పతక ఆశలతో చైనాకు వెళ్లిన టీమ్‌ ఇండియా షట్లర్ల బృందం.. కఠినమైన గ్రూప్‌-సిలో వరుస పరాజయాలు చవిచూసింది. అగ్రశ్రేణి షట్లర్లు రేసులో నిలిచినా.. చైనీస్‌ తైపీ, మలేషియా చేతిలో భారత్‌ పరాజయం పాలైంది. వరుస ఓటములతో నాకౌట్‌ అవకాశాలు చేజార్చుకున్న టీమ్‌ ఇండియా నామమాత్రపు చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో ఊరట దక్కించుకుంది. గ్రూప్‌-సిలో ఆస్ట్రేలియాపై 4-1తో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్‌- సిలో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. మూడు మ్యాచుల్లోనూ ఓడిన ఆస్ట్రేలియా చివరి స్థానానికి పరిమితమైంది. తొలుత మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాయిప్రతీక్‌, తనీశ జంట 21-17, 14-21, 18-21తో మూడు గేముల పోరులో పోరాడి ఓడింది. దీంతో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యం సాధించింది. తాజాగా డబ్లూబిఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌ 7 సాధించిన హెచ్‌.ఎస్‌ ప్రణరు వరుస గేముల్లో మెరుపు విజయం సాధించాడు. 21-8, 21-8తో జాక్‌ వుపై మెన్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లో విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో అనుపమ ఉపాధ్యారు 21-16, 21-18తో టిఫానీపై పైచేయి సాధించింది. నామమాత్రపు మ్యాచ్‌లో పి.వి సింధు బరిలోకి దిగలేదు. మెన్స్‌ డబుల్స్‌ విభాగంలో ఎం.ఆర్‌ అర్జున్‌, ధ్రువ్‌ కపిల జోడీ 21-11, 21-12తో రిక్కీ ట్యాంగ్‌, రేన్‌ వాంగ్‌లను చిత్తు చేశారు. మహిళల డబుల్స్‌లో తానీశ, అశ్విని పొన్నప్ప జోడీ 21-19, 21-13తో గెలుపొందారు. దీంతో 4-1తో ఆస్ట్రేలియాపై భారత్‌ ఘన విజయం సాధించింది.

Spread the love