మరో రెండు రోజులు రిమాండ్‌

Remanded for two more days– వర్చువల్‌గా చంద్రబాబు విచారణ
రాజమహేంద్రవరం : ‘స్కిల్‌’ స్కామ్‌ కేసులో నిందితునిగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు రిమాండ్‌ను సెప్టెంబర్‌ 24 వరకూ పొడిగిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ‘స్కిల్‌’ స్కామ్‌లో చంద్రబాబును ఈ నెల 9న పోలీసులు అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులపాటు రిమాండ్‌ విధించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సెంట్రల్‌ జైలులోని స్నేహ బ్యారక్‌లో ఆయన రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. రిమాండ్‌ గడువు శుక్రవారంతో ముగియడంతో ఆయనను పోలీసులు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్‌గా హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వర్చువల్‌గా చంద్రబాబుతో మాట్లాడారు. సిఐడి కస్టడీకి అడుగుతోందని, దీనిపై అభిప్రాయం చెప్పాలని న్యాయమూర్తి బాబును అడిగారు. తాను 45 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, తన గురించి దేశంలో అందరికీ తెలుసని న్యాయమూర్తికి తెలిపారు. అన్యాయంగా అరెస్టు చేశారన్నదే నా బాధ.. నా ఆవేదన.. అని అన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, తన హక్కు లు రక్షించాలని కోరారు. తనపై ఉన్నవి ఆరోపణలేనని, తనను విచారణ చేసిన తరువాత జైలుకు పంపితే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జైలులో చంద్రబాబుకు కల్పిస్తున్న సౌకర్యాలపై న్యాయమూర్తి జైలు అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు సౌకర్యాలు కల్పించామని జైలు అధికారులు కోర్టుకు విన్నవించారు. అనంతరం చంద్రబా బుతో న్యాయమూర్తి మాట్లాడుతూ ‘మీరు జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. దీనిని శిక్షగా భావించొద్దు. మీపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే. నిరూపణ కాలేదు. నిబంధనల ప్రకారమే రిమాండ్‌ విధించాం’ అని పేర్కొన్నారు.

Spread the love