స్పాట్‌లో పాల్గొన్న అధ్యాపకులకు రెమ్యూనరేషన్‌ ఇవ్వాలి

-ఇంటర్‌ బోర్డు సీవోఈకి టీపీటీఎల్‌ఎఫ్‌ వినతి
-నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌లో పాల్గొన్న అధ్యాపకులకు రెమ్యూనరేషన్‌ వెంటనే ఇవ్వాలని తెలంగాణ ప్రయివేట్‌ టీచర్లు, లెక్చరర్ల ఫెడరేషన్‌ (టీపీటీఎల్‌ఎఫ్‌) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఇంటర్‌ ఫలితాలు విడుదలైనా ఇప్పటి వరకు రెమ్యూనరేషన్‌ ఇవ్వక పోవడం సిగ్గుచేటని విమర్శించింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు పరీక్షల నియంత్రణాధికారి (సీవోఈ) జయప్రద బారుని శుక్రవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ ఎ విజరుకుమార్‌, నాయకులు చందు, కె విజరుకుమార్‌ కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌లో అంతకు ముందు ప్రాక్టికల్స్‌ నిర్వహణలో పాల్గొన్న అధ్యాపకులకు రెమ్యూనరేషన్‌ ఇప్పటి వరకు ఇవ్వక పోవడంవల్ల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులందరికీ ఇబ్బంది ఉందని పేర్కొన్నారు. వేసవి సెలవుల్లో ప్రయివేటు అధ్యాపకులకు జీతాల్లేక, రెమ్యూనరేషన్‌ రాక ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గతంలో ఏరోజుకారోజు రెమ్యూనరేషన్‌ ఇచ్చే పద్ధతిని కొనసాగించాలని కోరారు. అధ్యాపకులకు ప్రాక్టికల్‌, స్పాట్‌ రెమ్యూనరేషన్‌తోపాటు టీఏ, డీఏలు చెల్లించాలని సూచించారు.

Spread the love