ఇక ఎర్రటెండలే

– రెండ్రోజుల్లో 45 నుంచి 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు !
–  రెడ్‌జోన్‌లో 13 జిల్లాలు
–  వీణవంకలో 44.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు
– నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎర్రటెండలు మండిపోతున్నాయి. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగి 45 నుంచి 46 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది. 45 డిగ్రీలు దాటిన ప్రాంతాలను వాతావరణ శాఖ రెడ్‌జోన్‌లో ఉన్నట్టుగా చూపుతున్నది. వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలో 13 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల 46 డిగ్రీలకు కూడా చేరుకునే అవకాశముంది. రెడ్‌జోన్‌ హెచ్చరిక జాబితాలో కరీంనగర్‌, జగిత్యాల, జయశంకర్‌భూపాలపల్లి, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఖమ్మం, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాలున్నాయి. హైదరాబాద్‌లోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగటం, ఉక్కపోత తీవ్రం అవుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యలు సూచిస్తున్నారు.
కరీంనగర్‌ జిల్లా వీణవంకలో శుక్రవారం అత్యధికంగా 44.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. చాలా ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. మైలపల్లి(పెద్దపల్లి) 44.5 డిగ్రీలు, రామగుండం(పెద్దపల్లి) 44.5 డిగ్రీలు, కొల్లూరు(కామారెడ్డి)44.3 డిగ్రీలు, అర్లి(టి)(ఆదిలాబాద్‌) 44.3 డిగ్రీలు, గూడూరు(జగిత్యాల)44.2 డిగ్రీలు, వెల్గటూరు(జగిత్యాల)44.2 డిగ్రీలు, లక్మాపూర్‌(నిజామాబాద్‌) 44.1 డిగ్రీలు, రాఘవపేట(జగిత్యాల) 44.1 డిగ్రీలు, కమాన్‌పూర్‌(పెద్దపల్లి)లో 44.0 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Spread the love