ఏపీ ఎన్నికలకు స్టార్‌ క్యాంపెయినర్‌గా రేవంత్‌రెడ్డి

– కర్నాటక సీఎం సిద్ధ్ద రామయ్య , జాబితాలో ఏఐసీసీ అగ్రనేతలు కూడా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు స్టార్‌ క్యాంపెయినర్‌గా సీఎం రేవంత్‌రెడ్డికి బాధ్యతలు ఇవ్వాలని ఏఐసీసీ యోచిస్తున్నది. ఆయనతోపాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను నియమించనుంది. ఆ జాబితాల్లో ఏఐసీసీ అగ్రనేతలు ఉండనున్నారు. ఏపీలో జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు ప్రచారం చేయనున్నారు.ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారని ఇప్పటికే ఢిల్లీ పెద్దలు, ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు వైఎస్‌ షర్మిలారెడ్డికి సమాచారం పంపినట్టు తెలిసింది. ఇప్పటికే ఆమె పలు దఫాలుగా రేవంత్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల్లోనూ తన సహకారం ఉంటుందని గతంలోనే రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు నేరుగా ఏపీ ఎన్నికల రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. స్టార్‌ క్యాంపెయినర్లుగా ఇప్పటి వరకు ఏఐసీసీ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోయినా, త్వరలోనే ఆయన పేరును ప్రకటించనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఏపీలో ఆయనకు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు, కార్యకర్తలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశంలో ఉన్న సమయంలో ఆ రాష్ట్రానికి చెందిన నేతలతో స్నేహం కూడా ఉన్నది. సీఎం హోదాలో పాత పరిచయాలను సమన్వయం చేసుకుంటూ ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు కోసం ఆయన పావులు కదుపుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, జనసేన పార్టీల్లో టికెట్‌ దక్కని నేతలంతా కాంగ్రెస్‌ గూటికి చేరే అవకాశాలున్నాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన వ్యాపారస్తులు, రాజకీయ నాయకులంతా ఎక్కువగా బెంగళూరులోనే నివసిస్తుంటారు. వ్యాపారాలు, ఇతర పనుల నిమిత్తం బెంగళూరుకు రాకపోకలు ఎక్కువగా సాగిస్తుంటారు. వారితో కర్నాటక సీఎం సిద్దరామయ్యకు మంచి సంబంధాలున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ఆయనకు సన్నిహితులుగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో స్టార్‌ క్యాంపెయినర్‌గా ఆయా ఉమ్మడి జిల్లాల్లో ఆయన్ను నియమించాలని ఏఐసీసీ సూత్రపాయ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించిన తర్వాత తెలంగాణలోనూ తప్పనిసరిగా గెలుస్తామనే విశ్వాసం నెలకింది. దీంతో వివిధ సర్వేలు చేస్తూ, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఇక్కడ కూడా కాంగ్రెస్‌ జెండా ఎగురవేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం నెల రోజుల పాటు హైదరాబాద్‌లోనే మకాం వేసి సంపూర్ణంగా పని చేసింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తోపాటు పలువురు క్యాబినేట్‌ మంత్రులు బీఆర్‌ఎస్‌ తప్పిదాలన్నీ ప్రజలకు వివరించేందుకు శ్రమించారు. కర్ణాటకలోని గ్యారంటీలను వివరిస్తూ ప్రజలకు భరోసా కల్పించారు. ప్రజలంతా కాంగ్రెస్‌ వైపు మద్ధతు ఇవ్వడంతో ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు ఏపీలోనూ అధికారంలోకి వచ్చేందుకు తమదైన శైలిలో కృషి చేయనున్నాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అనుసరించిన విధంగానే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎంత వరకు ఉపయోగపడుతుందో వేచిచూడాల్సిందే.

Spread the love