రోహిత్‌, జైస్వాల్‌ జోరు

– ఓపెనర్ల అజేయ అర్థ శతకాలు
– భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 121/0
భారత్‌, విండీస్‌ రెండో టెస్టు తొలి రోజు
       భారత్‌, విండీస్‌ చారిత్రక వందో టెస్టులో టీమ్‌ ఇండియా ఓపెనర్లు మెరుపు వేగంతో వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. యశస్వి జైస్వాల్‌ (52 బ్యాటింగ్‌), రోహిత్‌ శర్మ (63 బ్యాటింగ్‌) ధనాధన్‌ షోతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 121/0తో అదిరే ఆరంభం దక్కించుకుంది. యువ బ్యాటర్‌ యశస్వి, కెప్టెన్‌ రోహిత్‌ ఓపెనింగ్‌ జోడీ వరుసగా రెండో ఇన్నింగ్స్‌లో 100కు పైగా పరుగుల భాగస్వామ్యంతో అదరగొట్టారు.
      వెస్టిండీస్‌తో వందో టెస్టు పోరు సందర్భంగా కరీబియన్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా నుంచి జ్ఞాపిక అందుకుంటున్న భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలు సైతం భారత్‌తో వందకు పైగా టెస్టులు ఆడాయి.
నవతెలంగాణ-పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌
కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (63 బ్యాటింగ్‌, 102 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్‌ (52 బ్యాటింగ్‌, 56 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్థ సెంచరీలతో కదం తొక్కుతున్నారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్‌ ఇండియాకు ఓపెనర్లు అజేయంగా 121 పరుగుల భాగస్వామ్యం అందించారు. వెస్టిండీస్‌ బౌలర్లు వికెట్‌ వేటలో పలుమార్లు ఆకట్టుకున్నప్పటికీ.. భారత ఓపెనర్ల దూకుడుతో తేలిపోయారు. తొలి సెషన్లో 26 ఓవర్లలో 4.65 రన్‌రేట్‌తో పరుగులు పిండుకున్న రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌ భారత్‌ భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు.
అదే దూకుడు :
యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ వరుసగా రెండో టెస్టులో సత్తా చాటుతున్నాడు. డొమినికా టెస్టులో అరంగేట్రం చేసిన యశస్వి జైప్వాల్‌ తొలి టెస్టులో భారీ శతకం బాదిన సంగతి తెలిసిందే. రెండో టెస్టులోనూ యశస్వి జైస్వాల్‌ అదే దూకుడుతో కదం తొక్కాడు. ఓ దశలో 100కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. ఎనిమిది ఫోర్లు, ఓ సిక్సర్‌తో 49 బంతుల్లోనే కెరీర్‌ రెండో 50 ప్లస్‌ ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు. యశస్వి జైస్వాల్‌ విండీస్‌ పేసర్లను అలవోకగా ఎదుర్కొన్నాడు. యువ బ్యాటర్‌ను కరీబియన్లు పేస్‌ పిచ్‌పై సైతం ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ఇక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫామ్‌ కొనసాగించాడు. యశస్వితో పోల్చితే కాస్త నెమ్మదిగా ఆడిన రోహిత్‌ శర్మ.. వరుసగా రెండో టెస్టులో ఓపెనింగ్‌ వికెట్‌కు అజేయంగా శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో రెచ్చిపోయిన రోహిత్‌ శర్మ 74 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. ఓపెనర్ల దూకుడుతో 10.4 ఓవర్లలో 50 పరుగులు సాధించిన భారత్‌.. 20.5 ఓవర్లలోనే వంద పరుగుల మార్క్‌ చేరుకుంది. తొలి రోజు లంచ్‌ విరామ సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 121/0తో పటిష్ట స్థితిలో నిలిచింది.
క్వీన్స్‌పార్క్‌ సహజసిద్ధంగా పేస్‌కు స్వర్గధామం. అందుకే టాస్‌ నెగ్గిన వెస్టిండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కానీ, ఆతిథ్య కరీబియన్లు ఆశించిన స్థాయిలో పిచ్‌ నుంచి పేస్‌కు సహకారం లభించలేదు. కీమర్‌ రోచ్‌, అల్జారీ జోసెఫ్‌, షానన్‌ గాబ్రియల్‌లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. జోమెల్‌ వారికన్‌, జేసన్‌ హోల్డర్‌ మాత్రమే కాస్త పొదుపుగా బౌలింగ్‌ చేశారు. విండీస్‌ పేసర్లు కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు సంధించినా.. యశస్వి జైస్వాల్‌, రోహిత్‌ శర్మ దూకుడుతో కరీబియన్లకు కష్టాలు తప్పలేదు. భారత ఓపెనర్ల మెరుపులతో తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్న నిర్ణయంపై విండీస్‌ కెప్టెన్‌ అప్పుడే విమర్శలు ఎదుర్కొంటున్నాడు!.
స్కోరు వివరాలు :
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : యశస్వి జైస్వాల్‌ బ్యాటింగ్‌ 52, రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ 63, ఎక్స్‌ట్రాలు : 06, మొత్తం : (26 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 121.
బౌలింగ్‌ : కీమర్‌ రోచ్‌ 6-1-34-0, అల్జారీ జొసెఫ్‌ 6-0-30-0, షానన్‌ గాబ్రియల్‌ 4-0-24-0, జోమెల్‌ వారికన్‌ 5-1-17-0, జేసన్‌ హోల్డర్‌ 5-1-12-0.

Spread the love