క్వార్టర్స్‌లో సాత్విక్‌ జోడీ

– చైనా జోడీపై అలవోక విజయం
– ప్రణరు, ప్రియాన్షు పరాజయం
– కొరియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
యోషు (దక్షిణ కొరియా) : భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్స్‌, ఆసియా చాంపియన్స్‌ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి కొరియా ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో చైనా జోడీ హీ జీ టింగ్‌, జో హో డాంగ్‌లపై 21-17, 21-15తో వరుస గేముల్లో అలవోక విజయం సాధించారు. 43 నిమిషాల డబుల్స్‌ పోరులో భారత జోడీకి ఎదురేలేదు. మూడో సీడ్‌ సాత్విక్‌, చిరాగ్‌లకు తొలి గేమ్‌లో 13-13 వరకు గట్టి పోటీ ఎదురైంది. కానీ ఆ తర్వాత ఆసియా చాంపియన్స్‌ అసలు ఆట ఆడారు. చైనా షట్లర్లపై ఆధిపత్యం చూపిస్తూ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. 21-17తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నారు. ఇక రెండో గేమ్‌లో సాత్విక్‌, చిరాగ్‌ జోడీకి ప్రతిఘటన ఎదురు కాలేదు. విరామ సమయానికి 11-6తో ముందంజలో నిలిచిన సాత్విక్‌, చిరాగ్‌లు.. ద్వితీయార్థంలోనూ రెచ్చిపోయారు. 21-15తో మరింత ఆధిక్యంతో రెండో గేమ్‌ను, క్వార్టర్స్‌ బెర్త్‌ను దక్కించుకున్నారు. నేడు జరిగే క్వార్టర్‌ఫైనల్లో ఐదో సీడ్‌ జపాన్‌ జోడీతో సాత్విక్‌, చిరాగ్‌ పోటీపడనున్నారు.
పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ల పోరాటానికి తెరపడింది. సీనియర్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌ ప్రణరు 15-21, 21-19, 18-21తో హాంగ్‌కాంగ్‌ షట్లర్‌ లీ చేతిలో పరాజయం పాలయ్యాడు. 66 నిమిషాల పాటు సాగిన మూడు గేముల మ్యాచ్‌లో ప్రణరు పోరాడి ఓడాడు. యువ షట్లర్‌ ప్రియాన్షు రజావత్‌ సైతం 14-21, 21-19, 17-21తో మూడు గేముల పోరులో జపాన్‌ షట్లర్‌ కొడారు నరోకకు తలొంచాడు. మహిళల డబుల్స్‌లో ట్రెసా జాలి, పుల్లెల గాయత్రి జోడీ 11-21, 4-21తో 33 నిమిషాల్లోనే కొరియా జోడీ చేతిలో ఓటమి చెందింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి రెడ్డి, రోహన్‌ కపూర్‌ జంట 15-21, 12-21తో చైనా జోడీ ఫెంగ్‌, పింగ్‌ల చేతిలో పరాజయం పాలైంది.

Spread the love