సమతా భేరి – ‘సాక’ కథలు

సమాజంలోని అసమానతల మీద సమానతకై సమతా భేరి మోగించే దళిత కథల వార్షిక సమాహారమే ‘సాక’ దళిత కథా వార్షిక -2022. జంబూ సాహితి ప్రచురించిన దళిత కథా వార్షిక 2022 ‘సాక’ లో ప్రచురితమైన 16 కథలు చదివినప్పుడు ఎందుకో గానీ నాకు తల్లా – పెళ్ళామా సినిమా కోసం సి.నా.రే రాసిన ”ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటే అన్నా” అన్న పాట గుర్తుకొచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 16 మంది కధకుల ప్రచురితమైన కధాసంకలనం ఇది. ప్రాంతాలు వేరైనా దళితులు ఎదుర్కొంటున్న వివక్ష, దోపిడీ, అణిచివేతల వెతలు ఒకటిగానే ఉన్నాయి అని అర్ధం చేయించే కధా సంకలనమే ‘సాక’.

జంబూ సాహితి తరఫున వెలువరించిన ఈ కధా సంకలన సంపాదక వర్గ సభ్యులైన గుడిపల్లి నిరంజన్‌, సిద్దెంకి యాదగిరి దళిత కథావార్షికలు వెలువరిస్తున్న నేపధ్యం గురించి వివరించారు. ఈ 16 కధలు వర్తమాన దళిత సాహిత్య దిశకు సంకేతాలు. ఏ సాహిత్యమైనా అకస్మాత్తుగా పైనుండి ఊడిపడదు. సామాజిక అలజడులను సాహిత్యం ప్రతిబింబిస్తుంది. తెలుగు సాహిత్యంలో స్త్రీవాద, దళితవాద, ముస్లింవాద సాహిత్యం అన్న విభజన రాకముందు కూడా మహిళలు, దళితులు, ముస్లింలు సమాజంలో ఎదుర్కొంటున్న వివక్ష, అణిచివేత, వేధింపుల గురించి కధలు, కవిత్వం అడపాదడపా నవలలు వచ్చాయి. అయితే ఇవన్నీ అప్పటి స్థల, కాల, భావజాల ప్రభావం పరిధిలో ఉన్నాయి. స్వాతంత్రోద్యమ కాలంలో తొలిగా ఈ ఉద్యమం బుద్ధిజీవుల మధ్య, ఎగువ తరగతుల పోరాటంగా మొదలయ్యింది. అప్పట్లో జాతీయ కాంగ్రెస్‌ నిర్వహించిన ఈ ఉద్యమ స్వరూపం సభలకు, తీర్మానాలకు, మహాజర్ల సమర్పణకు పరిమితమై ఉండింది. 1920 లలో కార్మిక సంఘాల ఏర్పాటు, రైతు సంఘాల ఏర్పాటు తర్వాత శిస్తు తగ్గింపు, దున్నేవాడికే భూమి అన్న నినాదాలతో రైతాంగాన్ని ఆనక కార్మిక సమస్యల మీద తీర్మానాల ద్వారా ఈ రెండు వర్గాల ప్రజానీకాన్ని స్వాతంత్రోద్యమం ఇముడ్చుకోగలిగింది. తద్వారా నూతన శక్తిని సంతరించుకుంది. హరిజనోద్ధరణ నినాదం ద్వారా సమాజంలో గణనీయంగా ఉన్న బలీయమైన దళిత ప్రజానీకాన్ని స్వాతంత్రోద్యమం ఇముడ్చుకుంది. అప్పటికి గానీ స్వాతంత్రోద్యమానికి సమగ్రత చేకూరలేదు. ఉద్యమం మిలిటెంట్‌ స్వభావం సంతరించుకుంది. నాటికి అంబేద్కర్‌ భావజాలం ఉన్నప్పటికీ జాతీయ కాంగ్రెస్‌ భావజాలానిదే పై చెయ్యిగా కొనసాగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా చాలాకాలం ఆ భావజాలానిదే పై చెయ్యిగా సాగింది. అందుకే తొలితరం దళిత సాహిత్యంలో మనకు గాంధేయ భావజాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువలో ఎక్కువగా దళిత సమాజం ఎదుర్కొంటున్న వివక్ష, దోపిడీ, అణిచివేతల పట్ల సమాజం సహానుభూతితో స్పందించాలనే రీతిలో సాహిత్యం వెలువడింది.
అంబేద్కర్‌ భావజాలం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రాజకీయ నిర్మాణ స్వరూపం సంతరించుకున్నాక దళిత సాహిత్యం పెద్ద మలుపు తిరిగింది. తమవైన ఆకాంక్షలను, అభిప్రాయాలను బలంగా వ్యక్తీకరించింది. ప్రశ్నించే ధోరణి ప్రబలంగా ముందుకొచ్చింది. 1980-90 వ దశకానికి వచ్చేసరికి సమాజాన్ని నిగ్గదీసే దశకు చేరింది.
మద్దూరి నగేష్‌ బాబు, పైడి తెరేష్‌ బాబు, కలేకూరి ప్రసాద్‌, నాగప్పగారి సుందరరాజు, సతీష్‌ చందర్‌, ఎండ్లూరి సుధాకర్‌ తదితరుల రచనలు ధిక్కార దశకు సంకేతం. 2010-20 ల దశకానికి వచ్చేసరికి ప్రతిఘటనా దశకు చేరిందని చెప్పుకోవచ్చు.
సాక కధా వార్షికలో ప్రచురితమైన కధల నేపధ్యాన్ని వివరిస్తూ అందులో ప్రచురించబడిన స్వీయ కధ ‘సాము’కు కధావస్తువు వాస్తవ ఘటనే అయినప్పటికీ కొంత ఉటోపియన్‌ ధోరణితో రాసానని స్వరూపరాణి వివరించారు. నాకైతే ఈ కథలో కీలకం ‘శరీరం-కర్ర ఈ రెండే మన ఆయుధాలు’ అన్న వాక్యం అనిపించింది. భూతం ముత్యాలు రాసిన ‘పచ్చనాకు సాక్షి’, జిలుకర శ్రీనివాస్‌ రాసిన ‘బురద గుంట కధలు’ కూడా ‘సాము’ కధ మాదిరి దళితుల ఐక్యత, తిరుగుబాటు తత్వాన్ని ప్రతిఫలించే కథలే. జూపాక సుభద్ర రాసిన ‘అప్పువడ్డది సుమీ’ కధ గుజరాత్‌లో ఉనా ఘటనను గుర్తుకు తీసుకురాక మానదు. చచ్చిన ఆవు చర్మం ఒలిచారని నలుగురు దళిత యువకులను అగ్రవర్ణాలవారు దారుణ హింసకు గురిచేసిన నేపథ్యంలో చంద్రశేఖర్‌ రావణ్‌ ఇచ్చిన పిలుపు మేరకు దళితులు చచ్చిన పశు కళేబరాలను తరలించడానికి నిరాకరించి ‘గోమాత గోమాత’ అని పూజించుకుంటారుగా చచ్చిన మీ ‘మాత’లనుమీరే పారేసుకోండి అని ధిక్కార స్వరం వినిపించి అగ్రవర్ణాల్లో గుబులు పుట్టించారు. ‘అప్పువడ్డది సుమీ’ కూడా దాదాపు అటువంటి ప్రతిఘటననే చిత్రీకరించింది. ఉనా లో పశు కళేబరం అయితే ఈ కథలో ఎయిడ్స్‌తో చనిపోయిన ఒక అగ్రవర్ణ స్త్రీ మృతదేహ ఖననం కధా వస్తువు అయింది. గీల్ల సావులు మన సావులకత్తన్నాయి. ”గీల్లు మనకు తరాల తంతెల కాన్నించి బడ్డ రునము, బాకీ, ఎన్నడు దీరుస్తరో” అని మదనపడుతూ చివరికి ఆ శవాన్ని బొందల పెట్టి ”ఎంతయినా మనయి ఆర్తిగల్ల పుట్కలే. గీ మన ఆడోల్లు దొరతోని తన్నులువడ్డా యిగులవడ్డా.. ఆడు సచ్చిపోతే ఇంకా మన ఆడోల్లు బోయి యేడ్సీ అత్తరు” – అర్లికల్లా ధర్మంగల్లోల్లు మరి అని తెగుడుకుంటారు.
మెర్సీ మార్గరెట్‌ రాసిన ‘వర్షం సాక్షిగా’ కధ స్థూలంగా ‘క్రైస్తవం ఆరాధించేది ఒకే దైవాన్ని అయినా క్యాథలిక్‌, ప్రొటెస్టెంట్‌ మతస్థుల మధ్య వైరుధ్యం, వ్యతిరేకతలు ఎందుకు ఉన్నాయి’ అన్న ప్రశ్నను లేవదీస్తుంది. అంతకు మించి అయ్యప్పమాల లాగానే మరియమ్మ మాల వేసుకుని శ్రమ దినాలలో నిష్ఠగా దీక్ష చేసే సంప్రదాయం క్రైస్తవంలోకి ఎలా వచ్చింది? క్రైస్తవం కూడా హైందవీకరించబడుతుందా లేక మునుపు హిందువులుగా ఉన్నవాళ్లు తమకు నచ్చిన దేవుణ్ణి తమకు తెలిసినట్లే పూజించుకుంటున్నారా అన్న కీలకమైన ప్రశ్న లేవనెత్తుతుంది. కొంచెం ఆలోచిస్తే అర్ధమయ్యే విషయమే అని కధాపరంగా రాసిందేమో గానీ అసలు ప్రశ్న ఇదే. జూపాక సుభద్ర గతంలో సమ్మక్క సారలక్క జాతర క్రమంగా ఎలా హైందవీకరించబడుతుందో ఒక కథలో వివరించారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌ కనుసన్నల్లో నడిచే వనవాసి కళ్యాణ్‌ ఆశ్రమ్‌ ఆంధ్ర, ఒడిశా, జార్ఖండ్‌, ఛత్తీస్‌ ఘడ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాల్లో కేంద్రీకరించి పనిచేస్తూ స్థానిక ఆచారాలను, దేవీదేవతలను హైందవీకరిస్తుంది. సిక్కు, జైన, పార్సీ మతాలు కూడా హిందూ మతంలో భాగమే అని ప్రకటిస్తుంది. చర్చి వ్యవహారనామం చాలా ప్రాంతాల్లో యేసు ఆలయం, దేవాలయంగా మారిపోవడం రాబోయే ప్రమాదానికి సూచిక అని గమనించక తప్పదు.
అగ్రవర్ణాల దోపిడీ కుట్రలో దళితులు ఎలా పావులుగా మారుతున్నారో, సాటి బి.సి కులాల మీద దాడికి దళితులను ఎలా వాడుకుంటున్నారో తెలియచెప్పే కధ కెంగార మోహన్‌ రాసిన ‘సమిధలు’. ఉన్నతోద్యోగాలు చేస్తూ ఆర్ధికంగా పై మెట్టులో ఉన్నా దళితులు ఎదుర్కొనే వివక్షను అనిల్‌ డ్యాని ‘వీకెండ్‌’ కథలో పరిచయం చేశాడు. సమాజంలో థర్డ్‌ జెండర్‌ ఎదుర్కొనే వివక్షతో పాటు ఇప్పటికీ ఊళ్లల్లో కులాలు వీధుల అవతారం దాల్చి ఉన్న వైనాన్ని పెనుమాక రత్నాకర్‌ ‘రమణి’ కథలో అద్దం పట్టాడు.
జి హైమవతి రాసిన ‘బొందలగడ్డకు దూరంగా’ కధ దళిత వాడల్లో ఇప్పటికీ దూరం కాని అనాచారాలను పట్టి చూయిస్తుంది. బాలింత పీనుగు ఊరికి అరిష్టమని ఊరి కట్టుబాటు పేరుతో ఆ బాలింత పీనుగుని ఏటిలో పాతిపెట్టడానికి నిర్ణయిస్తే ఆమె తల్లితండ్రులు తప్ప ఊరు ఊరంతా మౌనం వహించడం ఆ బాలింతరాలి స్నేహితురాలినే కాదు, మనల్ని కూడా భయపెడుతుంది. సోలోమెన్‌ విజయకుమార్‌ రాసిన ‘ఊరు గాసిన కానుపు’ కధ కూడా కడుపుతో ఉండి చనిపోయిన మాలచ్చమ్మ కధే. కుల కట్టుబాటు పేరుతో శవం కడుపు కోసి మత పిండాన్ని బయటికి తీసి రెండు మృతదేహాలకు అంత్యక్రియలు జరిపించే అనాచారపు కధ ఇది. ఈ క్రతువు చెయ్యాల్సిన పొండు తాత ‘ఎప్పటి శాస్తరాల్లా ఇయ్యా? వొయసు పిలకాయిలు మీగ్గుడా ఏందిరా ఈ శాదవలా’ అని అశక్తతతో ప్రశ్నించింది మనల్నే కదా అనిపిస్తుంది. ‘సదువుకున్నోళ్లు పల్లెల్లో గెట్టంగా నిలబడితే ఇట్టాంటియన్ని మారొచ్చు’ అన్న కాకెన్న ఆశ తీరే మార్గం ఉందా అని ఆలోచింపచేస్తుంది. ఈ ఇద్దరు కధా రచయితలు ఒకరు తెలంగాణకు, మరొకరు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారైనా రెండు ప్రాంతాల్లో ఉన్న కట్టుబాట్లు, అనాచారాలు ఒకటిగా ఉండడం మన గమనింపుకు వస్తుంది.
గుడిపల్లి నిరంజన్‌ ‘తప్పెట సిటుకు’ కధ అద్భుతమైన మానవీయతను ప్రభోదిస్తుంది. డబ్బు బలిసిన షావుకారింటి ఆడపిల్ల వ్యాపారం, వ్యవహారం చక్కబెట్టడంలో కుటుంబానికి చేదోడుగా నిలుస్తుంది. కానీ అగ్రవర్ణ అహంకారాన్ని మాత్రం ఎక్కడా వదులుకోదు. కింది కులాల మనుషులను అసుంటా పెడుతుంది. స్త్రీలోలుడైన భర్త మూలంగా ఎయిడ్స్‌ జబ్బున పడితే కుటుంబమే ఆమెను నడిరోడ్డు పాల్జేస్తుంది. అలాంటి కళావతిని మాదిగ్గేరికి చెందిన కాలీకమ్మ చేరదీసి కొత్త బతుకు ఇవ్వడం కధాంశం. జీవుడే దేవుడనుకునే తత్వం నమ్మిన మాదిగ్గేరి జనం గురించి కళావతి అర్ధం చేసుకునే తీరును వివరించడంలో గానీ, కథనాన్ని నడిపించడంలో గానీ నిరంజన్‌ వాడిన మాండలిక భాష సొగసు అబ్బుర పరుస్తుంది. సిద్దెంకి యాదగిరి ‘రుణం’ కధ కూడా మానవీయతను ప్రభోదించేదే. కధన రీతిని కొత్త పుంతలు తొక్కించిన కధ ఇది.
ఈ కథలన్నీ ఆధునిక వ్యవస్థకు ఇంకా ఆమడ దూరంలో ఉంచబడిన దళిత జీవిత వ్యధార్ధ గాధలే. కుల వ్యవస్థను పదిలపరిచి మరింత పటిష్టం చెయ్యాలని చూస్తున్న మతతత్వ శక్తులు అధికారం చెలాయిస్తున్న వర్తమాన భారతంలో దళిత సాహిత్యం మరింత మెలుకువతో, మరింత బలంగా తన గొంతు వినిపించాల్సిన అవసరాన్ని ఇలాంటి కథా సంకలనాలు అందిపుచ్చుకుంటాయన్న ఆశాభావం కలుగుతుంది.

– సత్య రంజన్‌, 9182449279

Spread the love