మార్పు తప్పని కాలం

బహుశా చీకటి గుహల్లో నివసించే ఉంటాం!
గతం తాలూకు వాసనలు
ఎప్పటికీ చుట్టుకునే ఉంటాయేమో!
బూజు జల్లెళ్ళ రాతి గోడలు, సాలెగూళ్ళూ
దుమ్ము పేరుకుపోయిన నేల
అక్కడక్కడా పగుళ్లు బాసిన దారి
సందుల నుండి వరుస కట్టి నడిచే చీమలబారు
వాటి తోకల వెంట ఆహారం
అటూ ఇటూ అప్పుడప్పుడూ కదిలే బల్లుల కిచకిచలు
ఆ చివర్ల పగుళ్ళనుండి చుక్కలు చుక్కలుగా జారే
నీటి బిందువుల తాళం గుంపులుగా ముచ్చటిస్తూ
వాటి కోరమీసాలతో పలకరించుకుని
ఐదారు కాళ్ళను ఒకేసారి కదిలిస్తూ నడిచే జిర్రముఖాలు
కలుగుల్లో దూరుతూ బైటకు లోపలికీ
గునగునా పరుగెడుతూ ఎలుకల గారడీ
మట్టిని కప్పుకొని గుట్టుగా కూడుండే తేళ్ళ కుప్పలు
వాటిదారినవి కదులుతూ ఓసారి వెనుదిరిగి
మెలికలు చుట్టుకుని ఆటలాడి
నెమ్మదిగా నిశ్శబ్దంలో శబ్దంగా పాకే సర్పాల బుసలు
చీకటికోనలో మిళుకు తీగలల్లుతూ మిణుగురుల నక్షత్ర జ్వాలల్లో భయకంపితమై కీచురాళ్ళ భైరవ సంగీతం
ఊలలు వేస్తూ తల నిక్కబొడిచి చూసే
గుడ్లగూబలు వాటి ఎర్రచారల కళ్ళు
బుయ్యిమంటూ దోమల సయ్యాటలు
బండలను చీల్చుకుని పుట్టిన
ఆ రావిచెట్ల లేత కొమ్మల్లో గండుచీమలు
రసినట్టిపెట్టిన తెల్లనాచు ముద్దలు
తలపైకెత్తకు…
వేళ్ళాడే గబ్బిలాలకు మనిషి ఒక వింత వస్తువు!
అదిగో ఉషోదయం!
సన్నని వెలుగురేఖలు చొరబడ్డాయి
గుహ ముందు రెపరెపలాడుతూ
రంగురంగుల సీతాకోకచిలకలు
పచ్చని చెట్ల గుబుర్లపై వాలి తుర్రుమంటున్న
రకరకాల పక్షులు
ఎక్కడో మావిపూతను కంకుతూ కోకిల….
ఆకాశాన్ని తదేకంగా చూస్తూ
గాలితెమ్మెరలతో ఊసులుపోతుంది వసంతపు వాసన
వసంతగాలి రేగుతుందని
తెగ కూతలు వేస్తుంది కూ కూ అని!
గుహలోకి చొరబడిన వెలుగురేఖల్లో
జీవితమిప్పుడు అందమైన సీతాకోక చిలకల్లా
ఇంద్రధనుస్సుల సుందరాకాశం!!
– అరుణ నారదభట్ల

Spread the love