ఏసీబీ వలలో శామీర్‌పేట తహసీల్దార్‌

ఏసీబీ వలలో శామీర్‌పేట తహసీల్దార్‌– రైతు నుంచి రూ.10లక్షలు లంచం తీసుకుంటూ..
నవతెలంగాణ-శామీర్‌పేట
భూమిని ధరణిలో ఎక్కించేం దుకు రైతు నుంచి రూ. 10 లక్షలు లంచం తీసుకుంటూ శామీర్‌పేట తహసీల్దార్‌ ఏసీబీకి చిక్కాడు. ఏసీబి డీఎస్పీ మజీద్‌ అలీఖాన్‌, బాధితుడు తెలిపిన వివరాల ప్రకా రం.. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలంలోని ఎమ్మా ర్వో కార్యాలయం తహసీల్దార్‌ సత్యనారాయణ. లల్గాడి మలకపేట గ్రామ రెవెన్యూ పరిధిలో 29 ఎకరాల భూమిని 2006లో మువ్వ రామశేషగిరిరావు అనే రైతు కొనుగోలు చేశాడు. 2013లో పట్టాదారు పాసుబుక్కులు కూడా వచ్చాయి. కాగా ధరణిలో తన భూమి నమోదు కోసం రెండేండ్ల కిందట శామీర్‌పేట తహసీల్దార్‌ను సంప్రదించాడు. అందుకు తహసీల్దార్‌ రూ.30 లక్షలు డిమాండ్‌ చేశాడు. ఏడాది కిందట రూ.10 లక్షలు ఇచ్చాడు. అలాగే, 2023 డిసెంబర్‌ 28న తహసీల్దార్‌కు రూ.20 లక్షల చెక్కును బాధితుడు రాసి ఇచ్చాడు. అయినా మరో రూ.10 లక్షలు తన డ్రైవర్‌ బద్రికి ఇవ్వాలని తహసీల్దార్‌ డిమాండ్‌ చేశాడు. దాంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో బాధితుడు మంగళవారం రూ.10 లక్షలను తహసీల్దార్‌ డ్రైవర్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్‌ను, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
అనంతరం శామీర్‌పేట మండల రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అదేవిధంగా తహసీల్దార్‌ స్వస్థలం పెద్దపల్లి జిల్లాలోని అతని నివాసంలో, ప్రస్తుతం ఉంటున్న శామీర్‌పేట మండలంలోని తుంకుంటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దాడులు నిర్వహించినట్టు డీఎస్పీ వివరించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు మల్లికార్జున్‌, పురేందర్‌ బట్టు, సిబ్బంది పాల్గొన్నారు. ఏసీబీ అధికారులు ఇదివరకే నాలుగుసార్లు రెక్కీ నిర్వహించగా మూడుసార్లు తప్పించుకున్న తహసీల్దార్‌ నాలుగోసారి రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ చిక్కాడు.

Spread the love