పండితులు, పీఈటీ పోస్టులను బ్యాక్‌లాగ్‌లో ఉంచొద్దు

పండితులు, పీఈటీ పోస్టులను బ్యాక్‌లాగ్‌లో ఉంచొద్దు– ఖాళీలను అర్హులైన వారితో భర్తీ చేయాలి : టీఎస్‌టీటీఎఫ్‌ అధ్యక్షులు లక్ష్మణ్‌నాయక్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భాషాపండితులు, పీఈటీలకు పదోన్నతులు కల్పిస్తున్నారనీ, ఆ పోస్టులను బ్యాక్‌లాగ్‌లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలని టీఎస్‌టీటీఎఫ్‌ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఇస్లావత్‌ లక్ష్మణ్‌నాయక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అర్హులైన పండితులు, పీఈటీలతో ఆ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. అప్‌గ్రేడ్‌ అయిన భాషాపండితులు, పీఈటీల పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని కోరుతూ టీఎస్‌టీటీఎఫ్‌ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఫ్లకార్డులను ప్రదర్శించి అందరికీ న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు లింగయ్యను కలిసి వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు లక్ష్మణ్‌నాయక్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ సాహసం చేసి ఉపాధ్యాయులకు భారీ ఎత్తున పదోన్నతులను కల్పించాయని చెప్పారు. అయితే పండితులు, పీఈటీల పోస్టులను ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసిందని అన్నారు. ఆ పోస్టుల్లోనే పండితులు, పీఈటీలకు పదోన్నతులు కల్పించారని వివరించారు. భవిష్యత్తులో గ్రేడ్‌-2 భాషా పండితులు, పీఈటీల నియామకాలు ఉండబోవని ఆందోళన వ్యక్తం చేశారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను అమలు చేయకుండా పదోన్నతులను కల్పించడంతోపాటు అప్‌గ్రేడ్‌ అయిన పోస్టులను చూపించకపోవడం వల్ల జిల్లాల్లో చాలా మంది ఉపాధ్యాయులు నష్టపోయారని చెప్పారు. వారంందరికీ పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అప్‌గ్రేడ్‌ అయిన భాషాపండితులు, పీఈటీల పోస్టులు ఖాళీగా ఉండొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌టీటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు సంతోష్‌, సూర్య, చక్రవర్తి, లక్ష్మణ్‌, మురళీమోహన్‌, పుష్ప, శ్రీదేవి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఆర్‌యూపీపీటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ సంఘీభావం ప్రకటించారు. అప్‌గ్రేడ్‌ అయిన పోస్టులను బ్యాక్‌లాగ్‌ చేయకుండా అందరికీ పదోన్నతులు కల్పించేలా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.

Spread the love