రాజ్యాంగానికే అవమానం

– పీఠిక నుంచి సామ్యవాదం,లౌకిక పదాలు తొలగింపు
– పదో తరగతి సాంఘికశాస్త్రంలో విద్యాశాఖ అధికారుల అలసత్వం
– అధికారులపై చర్యలు తీసుకోవాలి : ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాజ్యాంగం పట్ల పాఠశాల విద్యాశాఖ అధికారులు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శించారు. పదో తరగతి తెలుగు, ఆంగ్ల మాధ్యమం సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకాల్లోని రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం, లౌకిక పదాల్లేకుండా ముద్రించారు. అయితే ఇది యాదృచ్చికంగా జరిగిందా? లేదంటే ఉద్దేశపూర్వకంగా కావాలనే చేశారా? అన్నది చర్చనీయాంశం గా మారింది. భారత్‌ గొప్ప ప్రజాస్వామ్య, లౌకికదేశమంటూ ప్రపంచమంతా కీర్తిస్తున్నది. ఇంకోవైపు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం, లౌకిక పదాలను పీఠికలో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం రాజ్యాంగ పీఠికలో ఆ పదాల్లేకుండా ముద్రించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) పాఠ్యాంశాలతో కూడిన సీడీ ఆధారంగానే పుస్తకాలను ముద్రిస్తారు. అయితే పదో తరగతి తెలుగు, ఆంగ్ల మాధ్యమం పుస్తకాల్లోనే ఆ పదాల్లేవు. మిగిలిన తరగతులు, మాధ్యమాలకు చెందిన పుస్తకాల్లో వాటిని ముద్రించడం గమనార్హం. అంటే ఎస్‌సీఈఆర్టీ అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శించారన్నది స్పష్టంగా అర్థమవుతున్నది. దీంతో రాజ్యాంగాన్ని అవమానించా రంటూ ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు విమర్శించాయి. సామ్యవాదం, లౌకిక పదాలు తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఇంకోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తున్నది. రాజ్యాంగ మౌలిక సూత్రాలైన లౌకికవాదం, ప్రజాస్వామ్యం సూత్రాలకు భిన్నంగా అంధవిశ్వాసాలను పెంపొందించేలా జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ- 2020) ఉందన్న విమర్శలొస్తున్నాయి. శాస్త్రీయ విధానంతో రాసిన సైన్స్‌, చరిత్రను తొలిగించి, అవాస్తవమైన, అభూత కల్పనలతో కూడిన అంశాలను చరిత్ర పాఠాలుగా ప్రవేశ పెడుతున్నది. ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ నుంచి గాంధీ, భగత్‌ సింగ్‌ పాఠాలతోపాటు జీవ పరిణామ క్రమం, పునరుత్పత్తి పాఠ్యాంశాలను తొలగించటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొఘలుల చరిత్ర, గాంధీ హత్య, గుజరాత్‌ అల్లర్లు తదితర పాఠ్యాంశాలను తొలగించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత శాస్త్ర సాంకేతిక విద్యాసంస్థలకు చెందిన 1,800 మంది సైన్స్‌ అధ్యాపకులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు ఎన్‌సీఈఆర్టీ చర్యలను తప్పుపడుతూ ఆ సంస్థ డైరెక్టర్‌కు లేఖలు రాశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ విలువలను నిర్వీర్యం చేస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పొరపాటు జరిగింది : రాధారెడ్డి, డైరెక్టర్‌, ఎస్‌సీఈఆర్టీ
పదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకాల్లోని కవర్‌ పేజీపై ఒరిజినల్‌ రాజ్యాంగ పీఠికను ముద్రించాం. కవర్‌ పేజీ డిజైనింగ్‌ సమయంలో డౌన్‌లోడ్‌ చేసేటపుడు పొరపాటు జరిగింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఇతర తరగతులకు చెందిన లోపలి పేజీల్లో సవరించిన రాజ్యాంగ పీఠికను ముద్రించాం. అనుకోకుండా పొరపాటు జరిగింది.
కావాలనే ముద్రించారు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
పదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకం కవర్‌ పేజీపై రాజ్యాంగ పీఠికలో సోషలిస్టు, సెక్యులర్‌ పదాల్లే కుండా ముద్రించడం శోచనీయమని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. లోపలి పేజీలో ముద్రించిన పీఠికలో ఆ రెండు పదాలున్నాయని పేర్కొన్నారు. అయితే ఇది కావాలనే ముద్రించినట్టు కనిపిస్తున్నదని విమర్శించారు. ఈ తప్పుడు ముద్రణకు బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖను డిమాండ్‌ చేశారు.
ఎస్‌సీఈఆర్టీ అధికారులపై చర్యలు తీసుకోవాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పదో తరగతి సాంఘిక శాస్త్రం కవర్‌ పేజీపై రాజ్యాంగ పీఠికలో సోషలిస్టు, సెక్యులర్‌ పదాలను తొలగించి తప్పుగా ముద్రించిన ఎస్‌సీఈఆర్టీ అధికారులపై చర్యలు తీసుకో వాలని టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి గురువారం లేఖ రాశారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976, డిసెంబర్‌ 18న ఆ రెండు పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చారని తెలిపారు. ఎనిమిది, పదో తరగతి సాంఘికశాస్త్రం లోపలి పేజీల్లో ఆ రెండు పదాలతో కూడిన రాజ్యాంగ పీఠికను ముద్రించారని గుర్తు చేశారు. దేశంలో లౌకికత్వానికి ప్రమాదం ఏర్పడిందంటూ విశ్వవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన జాతీయ పాఠ్య గ్రంథాలపై అమల్లో ఉన్న రాజ్యాంగ పీఠికను కాకుండా కొందరు కోరుకుంటున్న విధంగా పాత రాజ్యాంగ పీఠికను ముద్రించడం అనేక అనుమానాలకు ఆస్కారమిస్తున్నదని విమర్శించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినా లేక ఏమరుపాటుగా జరిగినా పెద్ద తప్పిదమేనని తెలిపారు. తప్పుగా ముద్రించిన విషయంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సరైన రాజ్యాంగ పీఠికను ముద్రించాలని వారు డిమాండ్‌ చేశారు.
రాజ్యాంగ పీఠికకు అవమానం : టీపీటీఎఫ్‌
రాజ్యాంగ పీఠికకు అవమానం జరిగిందని టీపీటీఎఫ్‌ అధ్యక్షులు వై అశోక్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్‌ విమర్శించారు. సామ్యవాదం, లౌకిక పదాలకు విద్యాశాఖ నీళ్లొదిలిందని తెలిపారు. 1976లో రాజ్యాంగ పీఠిక సవరించబడిందని పేర్కొన్నారు. కొంత మేర అమలవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆయా అంశాలను తొలగించాలనే ప్రయత్నంలో ఉన్న క్రమంలో ఆ భావజాలంతో ఉన్న వారు కావాలనే ముద్రించినట్టు భావించాల్సి వస్తుందని తెలిపారు. రాజ్యాంగ పీఠికను తప్పుగా ముద్రించడంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.న

Spread the love