హిందూ మతానికి విరుద్ధంగా రాముడి ప్రతిష్ట : శంకరాచార్య మఠాధిపతుల ప్రకటన

నవతెలంగాణ హరిద్వార్: అయోధ్యలో జనవరి 22న జరుగనున్న రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి (Ram Temple consecration) నలుగురు శంకరాచార్యులు హాజరుకావడం లేదని ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్‌ మఠానికి చెందిన 46వ శంకరాచార్య అయిన అవిముక్తేశ్వరానంద సరస్వతి తెలిపారు. ఆలయ నిర్మాణం అసంపూర్తిగా ఉందని, అయోధ్యలో విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ శాస్త్రాలకు వ్యతిరేకంగా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతున్నదని ఆరోపించారు. సనాతన ధర్మం నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున అతి ముఖ్యమైన హిందూ మత గురువులు ఈ మహోత్సవానికి హాజరుకావడం లేదని హరిద్వార్‌లో ఆయన మీడియాతో అన్నారు. ఆలయ నిర్మాణం పూర్తి చేయకుండా రాముడి విగ్రహాలను ప్రతిష్ఠించడం హిందూ మతానికి విరుద్ధమని విమర్శించారు. ప్రతిష్ఠాపనకు అంత తొందర అవసరం లేదన్నారు. రామమందిర నిర్మాణం పూర్తైన తర్వాత విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
మరోవైపు ఆలయ ట్రస్ట్ ప్రకారం రామాలయంలో మొదటి అంతస్తు, గర్భగుడి మాత్రమే సిద్ధంగా ఉంది. వచ్చే రెండేళ్లలో ఆలయాన్ని పూర్తి స్థాయిలో నిర్మిస్తామని ట్రస్ట్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో పూరీ గోవర్ధన్‌ పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి కూడా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరుకావడం లేదని ఇటీవల తెలిపారు. హిందూ మతం నిబంధనలు, గ్రంథాలకు విరుద్ధంగా ఈ కార్యక్రమం జరుగుతున్నదని ఆరోపించారు. స్కంద పురాణం ప్రకారం కర్మలు సక్రమంగా నిర్వహించకపోతే విగ్రహంలోకి చెడు శకునాలు ప్రవేశించవచ్చని ఆయన అన్నారు.

Spread the love