సీఎంగా సిద్ధరామయ్యే..అధికారిక ప్రకటన

నవతెలంగాణ-హైదరాబాద్: కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ఎంపికలో ఐదు రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా సీనియర్‌ నేత సిద్ధరామయ్యను కాంగ్రెస్‌ ఎంచుకుంది. ఇక, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ను ఖరారు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత పార్టీలో ఏకాభిప్రాయం కుదిరింది. అనంతరం గురువారం మధ్యాహ్నం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ రణ్‌దీప్‌ సుర్జేవాలా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ఏఐసీసీ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో  కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. కర్ణాటక విజయం కాంగ్రెస్‌కు ఉత్సాహాన్నిచ్చింది. ఇందుకోసం పార్టీ హైకమాండ్‌తో పాటు నేతలందరూ ఎంతో కృషి చేశారు. కాంగ్రెస్‌ ప్రజాస్వామ్య పార్టీ. నియంతృత్వం పార్టీ కాదు.. ఏకాభిప్రాయంపై మాకు నమ్మకం ఉంది. కర్ణాటక కాంగ్రెస్‌లో గొప్ప నేతలున్నారు. ఈ నెల 14న కర్ణాటక శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాం. అందులో సీఎం ఎవరనేదానిపై ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించాం. అనంతరం సీఎంగా సిద్ధరామయ్య పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. ఇక రాష్ట్ర ఏకైక ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ బాధ్యతలు చేపడుతారు. దీంతో పాటు రాష్ట్ర పీసీసీ అధ్యక్ష బాధ్యతలను కూడా ఆయనే నిర్వహిస్తారు. వచ్చే ఏడాది పార్లమెంట్‌ ఎన్నికల వరకు డీకే ఈ బాధ్యతల్లో కొనసాగుతారు అని వెల్లడించారు.
మే 20న ప్రమాణస్వీకారం..
గురువారం రాత్రి బెంగళూరులో కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కర్ణాటక నూతన ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు అధికారికంగా ఎన్నుకుంటారు. అనంతరం తమ నిర్ణయాన్ని గవర్నర్‌కు అందజేస్తారని కాంగ్రెస్‌ తెలిపింది. మే 20న నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు వెల్లడించింది.

Spread the love