అక్కడ మళ్లీ సిట్టింగులకే!

– వారసులను దింపేందుకు ప్రయత్నాలు
– బీఆర్‌ఎస్‌లో ఆశావహులకు నిరాశ తప్పదా?
– కాంగ్రెస్‌ నుంచి పోటా పోటీ
– వలస వచ్చిన నేతలపైనే బీజేపీ ఆశలు
– ఉమ్మడి నిజామాబాద్‌లో రాజకీయం ఉత్కంఠం
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ ఆసక్తికరంగా, ఉత్కంఠగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచే ఎత్తుకు పైఎత్తు వేస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని 8 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసింది. ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జాజుల సురేందర్‌ గెలుపొందారు. ఆ తరువాత ఆయన బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి ఎన్నికలకు అన్ని పార్టీల్లోనూ ఆశావాహులు టిక్కెట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌లో సిట్టింగ్‌లకే మళ్లీ సీట్లు ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించడంతో ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాలతో పాటు అభివృద్ధి పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఆశావహులకు నిరాశ తప్పదా అన్న కోణంలో ఉన్నారు. అయినా తమ ప్రయత్నాల నుంచి వెనక్కి తగ్గడం లేదు. కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు సిట్టింగ్‌లతోపాటు ఆశావహులూ ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ ఎక్కువగా ఉంది. బీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసురుతున్నారు ఆ పార్టీ నేతలు. వలస వచ్చిన నేతలపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది.
నిజామాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు ముగ్గురు టిక్కెట్టు ఆశిస్తున్నారు. అందులో మాజీ మేయర్‌, డీఎస్‌ తనయుడు ధర్మపురి సంజరు, నగర అధ్యక్షులు కేశ వేణు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్‌కుమార్‌ గౌడ్‌ పోటీకి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ నుంచి ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా పోటీకి సిద్ధమయ్యారు. అయితే, యెండల లకిëనారాయణ గ్రూపు నుంచి మరొకరిని పోటీకి దించేందుకు సిద్ధమయ్యారు. పటేల్‌ ప్రసాద్‌ అనే నేతను తెరమీదకు తీసుకొస్తున్నారు. ధన్‌పాల్‌కు ఎంపీ అరవింద్‌ గతంలోనే సీటు వస్తుందని భరోసా ఇచ్చారు.
నిజామాబాద్‌ రూరల్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ తన కుమారుడు బాజిరెడ్డి జగన్‌ను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో జెడ్పీ చైర్మెన్‌ పదవి ఆశించగా.. మరుసటి ఎన్నికల్లో అవకాశమిస్తామని హైకమాండ్‌ హామీనిచ్చినట్టు సమాచారం. ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఇంకా బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఫైనల్‌ చేయలేదు. బీజేపీ నుంచి నిజామాబాద్‌ వ్యవసాయ కమిటీ మాజీ చైర్మెన్‌ దినేష్‌రెడ్డి పోటీకి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ భూపతిరెడ్డితోపాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మరో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి టిక్కెట్టు ఆశిస్తున్నారు.
మండవ వెంకటేశ్వర్‌రావు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. బోధన్‌ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌ ఆమేర్‌ ఈసారి ఆయన సతీమణి ఆయేషా ఫాతిమాను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం షకీల్‌ అమేర్‌ నాందేడ్‌లో కేంద్రీకరిస్తున్నారు. రెండు సంవత్సరాలుగా నియోజకవర్గంలో అధికార పార్టీ కార్యక్రమాలకు ఫాతిమా హాజరవుతున్నారు. ఇక్కడా తేల్చి చెప్పలేదు. బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి చేరిన మోహన్‌రెడ్డి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి మరోసారి పోటీ చేస్తాననే సంకేతాలు ఇచ్చారు. కెప్టెన్‌ కరుణాకర్‌రెడ్డి సైతం పోటీకి సిద్ధపడుతున్నారు.
ఆర్మూర్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు జీవన్‌రెడ్డి పోటీకి సిద్ధంగా ఉండగా.. బీజేపీ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి రాకేష్‌రెడ్డి రెడీ అవుతున్నారు. కానీ బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన వినరురెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయనకు యెండల లక్ష్మినారాయణ మద్దతు పలుకుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఇప్పటి వరకు అభ్యర్థి ఎవరనేది తేలలేదు. ఈ స్థానం నుంచి రేవంత్‌రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారమూ ఉంది.
బాల్కొండలో మరోసారి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పోటీకి సిద్ధంగా ఉన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దఎత్తున శ్రీకారం చుడుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి పోటీకి సిద్ధమయ్యారు. అయితే గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఆరేంజ్‌ ట్రావెల్స్‌ అధినేత ముత్యాల సునీల్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో బీజేపీలో చేరాలని ప్రయత్నించగా.. ఎంపీ అరవింద్‌ అడ్డుకున్నారనే ప్రచారం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధిష్టానం గ్రీన్‌ సిగల్‌ ఇస్తే ముత్యాల సునీల్‌ చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే, మంత్రి అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జున్‌రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
కామారెడ్డి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పోటీకి సిద్ధమవ్వగా.. ప్రముఖ వ్యాపారవేత్త కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. అలాగే ఆ పార్టీ సీనియర్‌ నాయకులు, జిల్లా అధ్యక్షులు ముజీబ్‌ సైతం టిక్కెట్టు ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ పోటీలో ఉన్నారు. సంవత్సర కాలంగా నియోజకవర్గంలో కలియతిరు గుతున్నారు. కామారెడ్డి నుంచి ప్రముఖ క్రికెటర్‌ అజారుద్దీన్‌ ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ నుంచి వెంకటరమణారెడ్డి పోటీకి సిద్ధమయ్యారు.
ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో ఇద్దరు పోటీ చేస్తున్నారు. వడ్డేపల్లి సుభాష్‌రెడ్డితోపాటు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మదన్‌మోహన్‌ టిక్కెట్టు ఆశిస్తున్నారు. రెండు, మూడు సంవత్సరాలుగా ఇద్దరూ వేర్వేరు గ్రూపులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి జాజుల సురేందర్‌ పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ నుంచి ఏనుగు రవీందర్‌రెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, పైళ్ల కృష్ణారెడ్డి టిక్కెట్టు ఆశిస్తున్నారు. బాన్సువాడ నుంచి మళ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి పోటీ చేయబోతున్నారు. గత ఎన్నికల్లో అదే చివరి ఎన్నిక అని ప్రకటించారు. దీంతో ఈసారి ఆయన కుమారుడు భాస్కర్‌రెడ్డి పోటీ చేస్తారని అంతా భావించారు. కాంగ్రెస్‌ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన కాసుల బాల్‌రాజ్‌ మళ్లీ లైన్‌లో ఉండగా.. ఈసారి ఎలమంచలి శ్రీనివాస్‌ సైతం పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. బీజేపీలో మల్యాద్రిరెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది.
జుక్కల్‌ నుంచి మరోసారి గెలిచేందుకు సిట్టింగ్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన హ్యాట్రిక్‌గా మూడుసార్లు గెలిచారు. కాంగ్రెస్‌ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన గంగారం, నిజామాబాద్‌కు చెందిన సీనియర్‌ నాయకులు గడుగు గంగాధర్‌, ఎన్‌ఆర్‌ఐ లక్ష్మికాంతం టిక్కెట్టు ఆశిస్తున్నారు.
బీజేపీ నుంచి అరుణతార పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ స్థానంలో మఠాధిపతిని బరిలోకి దించేందుకు ఎంపీ అరవింద్‌ సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Spread the love