రూ. 25 లక్షల నిధులు మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబు
మంత్రి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకుల పాలభిషేకం
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామస్తుల, రైతుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. గ్రామానికి, వ్యవసాయ రంగానికి ఒకే విద్యుత్ లైన్ ఉండటంతో ఇన్నాళ్లూ ఎదుర్కొంటున్న ఇబ్బందులకు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చొరవతో తెరపడనుంది. ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో రూ.25 లక్షల నిధులను మంజూరు చేయించారు. మల్లారం సబ్ స్టేషన్ నుండి గ్రామానికి, వ్యవసాయ పంపుసెట్లకు ఒకే లైన్ ఉండటంతో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు తీవ్ర అంతరాయం కలిగేది. ముఖ్యంగా వ్యవసాయ కనెక్షన్ల కోసం ఎల్.సితీసుకున్న సమయంలో గ్రామంలో కూడా గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయేది.
దీంతో అటు రైతులు, ఇటు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని మండల మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి వెంటనే కొత్త 11కేవి లైన్ ఏర్పాటుకు నిధులు కేటాయించారు. నిధులు మంజూరైన సందర్భంగా గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య, మాజీ ఎంపీపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు. తమ సమస్యను గుర్తించి తక్షణమే స్పందించిన మంత్రికి ఈ సందర్భంగా రైతులు, ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొత్త లైన్ ఏర్పాటుతో నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి రాజు నాయక్, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగన్నపేట మురళి, యూత్ అధ్యక్షులు కలువల రవి సాగర్, నాయకులు లింగన్నపేట శేఖర్, రేవెల్లి లింగయ్య, బలరామ్ పాల్గొన్నారు.



