దక్షిణాదికి ఇబ్బందే !

South is in trouble!– నియోజకవర్గాల పునర్విభజనతో
– తగ్గనున్న స్థానాలు..మహిళల ప్రాతినిధ్యానికి దెబ్బ
ప్రస్తుతం దేశంలోని జనాభాను పరిగణనలోకి తీసుకొని నియోజకవర్గాల పునర్విభజన జరిపితే ఉత్తరాది రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఉత్తరాదిలో లోక్‌సభ స్థానాలు అదనంగా పెరుగుతాయి. దక్షిణాది ఉన్న స్థానాల్లో కూడా కొన్ని కోల్పోతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఉత్తర భారత రాష్ట్రాలకు మరో 32 స్థానాలు కలుస్తాయి. దక్షిణ భారత రాష్ట్రాలు 24 స్థానాలను కోల్పోతాయి. దీనివల్ల దేశంలో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యం తగ్గిపోతుంది. దీనికితోడు పార్లమెంటులోనూ, రాష్ట్రాల శాసనసభలలోనూ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తే దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది.
న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఉభయసభల్లోనూ ఆమోదం పొందింది. కానీ అమలు మాత్రం జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అంటోంది బీజేపీ ప్రభుత్వం. అయితే అవన్నీ ఆచరణలోకొస్తే దేశంలో ప్రధానంగా రెండు మార్పులు చోటుచేసుకుంటాయి. ఒకటి, మహిళా రిజర్వేషన్లతో దేశ రాజకీయాలలో పురుషుల ఆధిపత్యం తగ్గి మహిళలకు సముచిత ప్రాధాన్యత లభిస్తుంది. ఇది ఆహ్వానించదగిన పరిణామమే. ఇక రెండవది, దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గి ఉత్తరాది, తూర్పు రాష్ట్రాల ప్రాభవం పెరుగుతుంది. ఇదే ఆందోళన కలిగించే విషయం. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయమేమంటే.. జనాభా స్థిరంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలలో లోక్‌సభ స్థానాలు తగ్గడంతో పాటు ఆయా రాష్ట్రాల నుండి మహిళల ప్రాతినిధ్యం కూడా తగ్గిపోతుంది.
కొన్ని అంచనాల ప్రకారం కేరళలో ప్రస్తుతం 20 లోక్‌సభ స్థానాలు ఉండగా వాటి సంఖ్య 14కు తగ్గుతుంది. 39 స్థానాలు కలిగిన తమిళనాడు 11 స్థానాలను కోల్పోతుంది. ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. 2002లో చేసిన రాజ్యాం గ సవరణ ద్వారా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను 2026 వరకూ నిలిపివేశారు. అప్పటికి దేశవ్యాప్తంగా జనాభా పెరుగుదల సమానంగా ఉంటుందని అంచనా వేశారు. కానీ..’మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ వంటి ఉత్తరాది రాష్ట్రాలలో దశ వార్షిక (2011-2021) జనాభా వృద్ధి రేటు 12-15% మధ్య ఉంది. అదే దక్షిణాది రాష్ట్రాలలో ఈ పెరుగుదల కేవలం 6% నుండి 10% మాత్రమే ఉంది. దీనిని బట్టి ఈ పది సంవత్సరాలలో దేశవ్యాప్తంగా జనాభా పెరుగుదల ఒకేలా లేదని అర్థమవుతోంది’ అని ఎన్నికల కమిషన్‌ మాజీ ప్రధానాధికారి ఓపీ రావత్‌ చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే బీజేపీకి గట్టి బలమున్న రాష్ట్రాలలో జనాభా పెరుగుదల వేగవంతంగా జరుగుతోంది.
కులాల కోటా కొట్లాట
సాధారణంగా జాతీయ పార్టీలు కుల, ప్రాంతీయ రాజకీయాలపై పెద్దగా ఆధారపడవు. ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. గడచిన రెండు దశాబ్దాలుగా జాతీయ పార్టీలు మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై దాదాపు ఏకాభిప్రాయంతోనే ఉన్నాయి. ఓబీసీ రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లాంటి రాష్ట్రాలు మాత్రం ప్రతిపాదిత మహిళా రిజర్వేషన్లలో కులాలకు కోటా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ఓబీసీ రిజర్వేషన్లు కేవలం చట్టసభలలో స్థానాల కేటాయింపు పైనే ఆధారపడి లేవన్న వాస్తవాన్ని ఆ రాష్ట్రాలు విస్మరిస్తున్నాయి.
ఈ బిల్లు వెనుక ?
లోక్‌సభ, శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే చట్టాల రూపకల్పనలో వారి ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఇది ఆహ్వానించదగిందే. కానీ బీజేపీ వ్యూహం మరోలా ఉంది. బిల్లు ఆమోదం పొందినా అమలు చేసే ఉద్దేశం ఆ పార్టీకి లేదు. అందుకే జనగణన, ఆపైన నియోజకవర్గ పునర్విభజనకు ముడిపెట్టి ఆచరణకు తలుపులు మూసింది. మరి అమలు చేయని బిల్లును ఎందుకు తెచ్చినట్టు? ఎందుకంటే తమ వైఫల్యాలనుండి ప్రజల దృష్టిని మళ్లించవచ్చు. పైగా ఎన్నికలముందు మహిళల ఓట్లను ఆకర్షించవచ్చు. అదే సమయంలో ప్రాంతీయ గుర్తింపు చుట్టూ అల్లుకున్న రాజకీయాలతో పాటు హిందీ రాష్ట్రాలలో ఓబీసీ రాజకీయాలను కూడా బలహీనపర్చవచ్చు. బీజేపీ ఇప్పటికే తన హిందూత్వ గొడుగు కిందికి కుల రాజకీయాలను తీసుకొచ్చింది. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నానని చెబుతూనే తన సామాజిక మూలాలను పటిష్టం చేసుకుంటోంది.

Spread the love