స్తంభించిన రవాణా

Stalled transport– ఎంవీ యాక్ట్‌ సవరణకు నిరసనగా ట్యాంకర్‌ డ్రైవర్ల సమ్మె
– పెట్రోల్‌, డీజిల్‌ కోసం బంకుల ముందు జనం బారులు
– హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ జామ్‌
– సమ్మె విరమణపై గందర గోళం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సోమవారం నుంచి ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్లు చేపట్టిన సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా జన జీవనం స్తంభించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భారతీయ న్యాయసంహిత 2023 మోటారు వాహనాల హిట్‌ అండ్‌ రన్‌ చట్టసవరణ బిల్లుకు వ్యతిరేకంగా వారు ఆందోళన బాట పట్టడంతో రాష్ట్రంలో పెట్రోల్‌ డీజిల్‌ సరఫరా నిలిచి పోయింది.హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెట్రోల్‌ బంకులను యజమానులు మూసి వేశారు. చాలా బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో అప్రమత్తమైన వాహనదారులు తెరిచి ఉన్న పెట్రోల్‌ బంకుల వద్ద పెట్రోల్‌, డీజిల్‌ కోసం క్యూ కట్టారు. దీంతో హైదారాబాద్‌ నగరంలో పలు చోట్ల రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రద్దీ, క్యూ లైన్‌ పెరిగిన దరిమిలా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు పెట్టి ట్రాఫిక్‌ను మళ్ళించారు. పంజాగుట్ట నుంచి లక్డీకాపూల్‌ వరకు, అక్కడి నుంచి మెహిదీపట్నం, హైటెక్‌సిటీ ఐకియా చౌరస్తా, ఎల్బీనగర్‌, మియాపూర్‌, కూకట్‌ పల్లి వరకు రెండు గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయాయి. దీంతో సాయంత్రం పూట ఆఫీసులు, పాఠశాలల నుంచి ఇంటికివెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సమ్మె విరమణ రాజశేఖర రెడ్డి, టీపీడీటీఏ అధ్యక్షులు
ఆయిల్‌ ట్యాంకర్ల డ్రైవర్లు చేపట్టిన సమ్మెను మంగళవారం సాయంత్రం విరమించినట్టు తెలంగాణ పెట్రోల్‌ డీజిల్‌ ట్యాంకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు.హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా యధావిధిగా బుధవారం నుంచి పెట్రోల్‌ డీజిల్‌ అందుబాటులోకి రానుందని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని పరిశీలిస్తున్నామనీ విధి విధాలపై ఓ అవగాహనకు వచ్చిన తర్వాత తదుపరి కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు.
సమ్మె యధాతదం బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్‌
ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్లు సమ్మె విరమించలేదనీ, యథావిధిగా కొనసాగుతుందని బారతీయ ప్రయివేటు ట్రాన్స్‌ పోర్టు మజ్దూర్‌ సంఫ్‌ (బీపీటీఎంఎం) జాతీయ కార్యదర్శి రవిశంక్‌ తెలిపారు.బుధవారం నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రయివేటు రవాణా రంగంలో ఉన్న లారీలు, ఆటోలు, డీసీఎంలు, మినీ గూడ్స్‌ వాహనాల డ్రైవర్లందరూ ఆందోళనలో పాల్గొంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ న్యాయసంహిత 2023 మోటారు వాహనాల హిట్‌ అండ్‌ రన్‌ చట్టసవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Spread the love