– హైకోర్టు మధ్యంతర ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలని సిఫార్సు చేస్తే అందుకు గవర్నర్ నిరాకరించారు. ఇద్దరిని నియమించాలన్న ప్రతిపాదనలను తిరస్కరించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ చర్యను సవాల్ చేస్తూ వారిద్దరూ వేసిన పిటిషన్లు హైకోర్టులో విచారణలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన కోదండరామ్, అమిర్ అలీ ఖాన్‌ల పేర్లను గవర్నర్ ఆమోదించారు. వీళ్లిద్దరూ ప్రమాణ స్వీకారం చేయబోయే దశలో హైకోర్టు మంగళవారం స్టేటస్‌కో అర్డర్ జారీ చేసింది. ఫిబ్రవరి 8న జరిగే విచారణ వరకు స్టేటస్‌కో (యథాతథస్థితి) ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరథే ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ మంగళవారం వెల్లడించింది. ప్రధాన పిటిషన్లు విచారణలో ఉండగా గవర్నర్ నియామక ప్రక్రియ కొనసాగింపుపై హైకోర్టు సందేహాలను వ్యక్తం చేసింది. గత విచారణ సమయంలో వాదప్రతివాదులు నియామక ప్రక్రియ విషయంలో ముందుకు వెళ్లబోమని హామీ ఇచ్చారనీ, ఇది కోర్టు రికార్డుల్లో కూడా ఉందనీ, ఇలాంటి పరిస్థితుల్లో నియామకాల విషయంలో ముందుకు ఎలా వెళాతారని ప్రశ్నించింది. దీనిపై అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి స్పందిస్తూ, ఆ హామీ 24వ తేదీన జరిగిన విచారణలో పొడిగించలేదని చెప్పారు. హామీ కొనసాగించాలని పిటిషనర్లు కూడా కోరలేదన్నారు. హామీ కొనసాగలేదనీ, మధ్యంతర ఉత్తర్వులు కూడా లేవని అందుకే గవర్నర్ నియామకాల విషయంలో ముందుకు వెళ్లారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యిందనీ, ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడ్డాక కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం లేదని సుప్రీంకోర్టు రూలింగ్ ఉందని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యిందంటే కోర్టులు జోక్యం చేసుకునేందుకు వీల్లేదని వాదించారు. పబ్లిక్ రిప్రజెంటేషన్ యాక్ట్ రూల్స్ ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలుపుదల చేసే అధికారం కోర్టులకు లేదని చెప్పారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ ఆదిత్య సోంది వాదించారు. హైకోర్టులో పిటిషన్లు విచారణలో ఉండగానే గవర్నర్ నియామకాల ప్రక్రియలో ముందుకు వెళ్లి చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారని చెప్పారు. హైకోర్టులో కేసు కారణంగా ఇక్కడ తుది ఉత్తర్వులు వెలువడే వరకు ఎమ్మెల్సీల నియామక ప్రక్రియను కొనసాగించబోమని గవర్నర్ ప్రత్రికా ప్రకటన వెలువరించిన తర్వాత కూడా నియామకాలకు ఆమోదం చెప్పారన్నారు.
న్యాయస్థానానికి ఇచ్చిన హామీకి భిన్నంగా గవర్నర్ చర్య ఉందన్నారు. ప్రమాణ స్వీకారం బుధవారం జరుగుతుందని, దీనిని అడ్డుకోవాలని కోరారు. వాదనల తర్వాత హైకోర్టు స్టేటస్‌కో ఆర్డర్ ఇచ్చింది. స్టే ఇవ్వడం లేదని తెలిపింది. విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. అప్పటి వరకు స్టేటస్‌కో అర్డర్ ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్సీగా ఇద్దరి పేర్లను గవర్నర్ తిరస్కరించిన వ్యవహారంపై సమగ్ర విచారణ చేస్తామని గత విచారణలో హైకోర్టు ప్రకటించింది. సాంకేతిక అంశాల పేరుతో వ్యాజ్యాలపై విచారణ ముగించబోమని చెప్పింది. గత ప్రభుత్వం శాసనమండలిలో రెండు ఖాళీల భర్తీకి చేసిన సిఫార్సులను గవర్నర్ తిరస్కరించడంపై సమగ్ర న్యాయ విచారణ చేస్తామని చెప్పింది. కేవలం సాంకేతిక కారణాల ఆధారంగా పిటిషన్లపై నిర్ణయం తీసుకోబోమని కూడా చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఇద్దరిని ఎమ్మెల్సీగా నియమిస్తూ వెలువడిన ఉత్తర్వులు జారీ కావడంతో హైకోర్టు స్టేటస్‌కో ఆర్డర్ జారీ చేసింది.