ఇంటర్‌ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు

CS Shantikumari– సీఎస్‌ శాంతికుమారి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హెచ్చరించారు. ఇంటర్‌, టెన్త్‌ పరీక్షల నిర్వహణ, ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటు పై జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ కమీషనర్లు, ఎస్పీలతో శుక్రవారం ఆమె హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డీజీపీ రవీ గుప్తా, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు బుర్రా వెంకటేశం, ఎస్‌.ఏ.ఎం.రిజ్వి, నదీమ్‌ అహ్మద్‌ తదితర ఉన్నతాధికారులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతి కుమారి మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడే చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు.
కామారెడ్డి జిల్లాలో ఇంటర్‌ పరీక్షా పేపర్‌ లీకేజీకీ ప్రయత్నించిన పలువురు అధ్యాపకులు, సిబ్బందిని గుర్తించి వారిని అరెస్టు చేయడమే కాకుండా క్రిమినల్‌ కేసులు నమోదు చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్బంగా ప్రస్తావించారు. ఇంటర్‌ మొదటి, రెండోసంవత్సరపు పరీక్షలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,521 పరీక్షా కేంద్రాల్లో సుమారు 9,80,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. ఈ పరీక్షా కేంద్రాల్లోకి ఉన్నతాధికారులతో సహా ఏ ఉద్యోగి కూడా సెల్‌ఫోన్‌లను తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద గట్టి పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని రకాల పరీక్షలను సజావుగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని సూచించారు. ప్రతీ రోజూ పరీక్ష పూర్తయిన అనంతరం జిల్లాలోని సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాలనీ, వాటి నిర్వహణపై సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్‌ పరీక్షల అనంతరం పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయనీ, వాటి నిర్వహణకు కూడా ఇదే విధమైన నియమ నిబంధనలు పాటించాలని సీఎస్‌ సూచించారు.

Spread the love