చదువు మరింత భారం..!

           చదువు ఏటేటా భారమవుతోంది.. ఏయేటికాయేడు పెరుగుతున్న ఫీజులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ ధరలతో విద్యార్థుల తల్లిదండ్రులు పరేషాన్‌ అవుతున్నారు. ఈ ఏడాది నోట్‌బుక్స్‌ ధరలు దాదాపు 20శాతం పెరిగాయి. కరోనాకు ముందుతో పోల్చి చూస్తే ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా నోట్‌బుక్స్‌, పెన్నులు, పెన్సిల్‌ వంటి స్టేషనరీ ధరలు పెరగడంతో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, పెట్రోల్‌, డీజిల్‌, ధరలు పెరిగి ఇబ్బందులు పెడుతున్న వేళ.. స్కూల్‌ స్టేషనరీ రేట్లు పెరగడం తల్లిదండ్రులకు మరింత భారంగా మారింది. మరోవైపు ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు సర్కారు ఉచితంగా నోట్‌బుక్స్‌ అందించేందుకు కసరత్తు చేస్తుండటంతో వారికి ఊరట లభించనుంది. ప్రభుత్వ స్కూల్స్‌లో 24 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్‌ అందజేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలియజేసిన విషయం విదితమే.
– ఈ ఏడాది 20శాతం పెరిగిన నోట్‌బుక్స్‌ ధరలు
– లాంగ్‌ నోట్‌ బుక్స్‌ కేజీ రూ.140
– ఒక్కొక్క స్మాల్‌ నోట్‌ బుక్‌పై రూ.10-12 పెరుగుదల
– సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు షాక్‌..
– వచ్చే విద్యా సంవత్సరంలో ఫీజు చెల్లింపులూ పెనుభారమే..
– ప్రభుత్వ విద్యార్థులకు లభించనున్న ఊరట
– పాఠ్యపుస్తకాలతోపాటు నోట్‌బుక్స్‌ అందజేత
నవతెలంగాణ- సిటీబ్యూరో
అడ్డగోలుగా ఫీజు దోపీడీ
రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు 30,049, ప్రయివేటు స్కూళ్లు 10549 ఉన్నాయి. వీటిల్లో 58.10లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఫీజులతోపాటు బుక్స్‌ ధరలు పెరుగుతుండటం విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికభారం అవుతోంది. పాఠశాలలు గతేడాది కంటే ఈసారి 20శాతం నుంచి 30శాతం వరకు ఫీజులు పెంచుతున్నాయని తెలుస్తోంది. నగరానికి చెందిన రమణ అనే వ్యక్తి.. తమ బాబుకి ఓ మిషనరీ స్కూల్‌లో ఒకటో తరగతిలో అడ్మిషన్‌ తీసుకోగా.. అతనికి ఏడాది ఫీజు రూ.47వేలు, డోనేషన్‌కి రూ.5వేలు, స్కూల్‌ యూనిఫామ్స్‌కి రూ.3వేలు, బుక్స్‌కి రూ.4600, రెండు జతల షూస్‌కు రూ.1500, బ్యాగ్‌కు రూ.1000, ట్రాన్స్‌పోర్టు కోసం నెలకు రూ.2వేల వరకు ఖర్చు అవుతున్నట్టు చెప్పారు.
ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ వంటి వాటిల్లో సైతం ఫీజుల మోత మోగుతోంది. ఆయా యాజమాన్యాలు నిర్ణయించిన ఫీజులే ఫైనల్‌గా చెబుతున్నారు. లేదంటే మరో స్కూల్లో అడ్మిషన్‌ తీసుకోవాలని సూచిస్తున్నట్టు పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. స్కూల్‌ ఫీజుల నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అవి గడపదాటడం లేదు. కమిటీలు వేస్తున్నా అవి ఇచ్చిన నివేదికలను ప్రభుత్వం చర్చించి ఆమోదించే పరిస్థితి కనిపించడం లేదు. అంతా ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూల్స్‌ ఇష్టారాజ్యంగా మారింది. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ పెంచి ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూళ్ల ఆగడాలకు చెక్‌పెట్టాలని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
నోట్‌బుక్స్‌ ప్రియం..
వచ్చే నెల 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. నోట్‌ బుక్స్‌తో పాటు ఇతర స్టేషనరీ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని షాపు నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో చాలామంది ముందుగానే నగరంలోని కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, సికింద్రాబాద్‌, పారిశ్రామిక వాడల్లో బుక్‌ స్టోర్స్‌తోపాటు చోటా, మోటా స్టేషనరీ షాపులకు పరుగులు తీస్తున్నారు. పాఠశాలలు ప్రారంభానికి ముందు కొంటే తక్కువ ధరలకు వస్తాయనుకుంటున్న ప్రజల బలహీనతలను సొమ్ముచేసుకుంటూ వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచి అమ్ముకుంటున్నారు. ఇదేందని అడిగితే కరోనాకు ముందు పేపర్‌ రేట్‌ రూ.70 నుంచి 100 లోపే ఉండేదని, ఇప్పుడది రూ.200 ఎగబాకిందని చెబుతున్నారు. ఫలితంగానే 20శాతం మేర ధరలు పెరిగాయని వివరిస్తున్నారు. దీంతో లాంగ్‌ నోట్‌బుక్స్‌ ధరలు గతేడాది కిలో రూ.100-110, కరోనాకు ముందు రూ.80వరకు ఉండేది. పేపర్‌ రేట్‌ పెరగడంతో ఈసారి ప్రస్తుతం కేజీకి రూ.140కి పెరిగిందని, మరో నాలుగైదు రోజుల్లో మరో 20 రూపాయలు పెరగనుందని వ్యాపారులు చెబుతున్నారు.
కేజీకి 300 పేజీల బుక్స్‌ తూకం వేస్తే రెండు మాత్రమే వస్తుండగా.. 200 పేజీలవి మూడు, 100 పేజీలవి నాలుగు వరకు వస్తున్నాయి. ఈ లెక్కన పదోతరగతి విద్యార్థికి దాదాపు 20 నోట్‌ పుస్తకాల అవసరం ఉంటుందని ఓ స్కూల్‌ హెచ్‌ఎం తెలిపారు. వీటి కొనుగోలు కోసం ఒక్కో విద్యార్థి కనీసం గతం కంటే నాలుగైదు వేల రూపాయాలు అదనంగా ఖర్చు చేయాల్సిందే. ఇక స్మాల్‌ సైజ్‌ పుస్తకాల ధరలు చూస్తే.. 160 పేజెస్‌ నోట్‌బుక్‌ రూ.50 ఉండగా.. గతేడాది రూ.45 ఉన్నది. 152 పేజెస్‌ నోట్‌బుక్‌ రూ.45 ఉంటే అప్పుడు రూ.40 వరకు ఉంది. ఇలా అన్ని రకాల నోట్‌ బుక్స్‌ ధరల్లో కంపెనీలను బట్టి రూ.5-10 వరకు పెరిగింది. ఓ మోస్తరు స్కూల్‌ బ్యాగ్‌ ధర రూ.500-800కుపైమాటే. ఇలా అన్నింటిల్లో విపరితంగా ధరలు పెరిగాయి. పాఠ్యపుస్తకాల ధరలు కూడా భారీగా పెరిగాయి. గతేడాది పదో తరగతి సెట్‌ మొత్తం రూ.1100 ఉండగా.. ఈసారి రూ.1530 అవుతోంది. ఆరో తరగతి పాఠ్యపుస్తకాల సెట్‌ ధర లాస్ట్‌ ఇయర్‌ రూ.693 ఉండగా.. ఈసారి 800పైనే ఉంది. మొత్తంగా నోట్‌ బుక్స్‌, పాఠ్యపుస్తక ధరలు 20శాతం పెరగ్గా.. ప్రయివేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లు అదనపు దోపీడీ మరోలా ఉంది.
ప్రభుత్వ విద్యార్థులకు ఊరట
సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందిస్తోంది. ఈసారి నోట్‌బుక్స్‌ కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతియేటా స్కూళ్ల ప్రారంభంలో ప్రయివేటు విద్యార్థుల మాదిరిగానే ప్రభుత్వ విద్యార్థులకు కూడా నోట్‌బుక్స్‌ కోసం సుమారు రూ.2-3వేలకు పైనే ఖర్చు అయ్యేది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు చేయూతనిచ్చే పనులు చేపడుతోంది. నోట్‌ బుక్స్‌ ఉచితంగా అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులకు రూ.1000 నుంచి 1500 వరకు ఆదా చేయనుంది.

Spread the love