త‌ల్లీకూతుళ్ల‌ విజ‌యాలు

Achievements of mothers and daughtersమాతృదినోత్సవ సంబరాలను ఇటీవలె ఎంతో ఘనంగా జరుపుకున్నాం. అభినందనలతో, బహుమానాలతో మన తల్లులను ముంచెత్తాం. అయితే మదర్స్‌ డే అంటే కేవలం మాతృ ప్రేమకు సంబంధించిన వేడుక మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధించిన అద్భుతమైన విజయాలను గుర్తించే సందర్భం కూడా. ఈ ప్రత్యేకమైన రోజున వారి రంగాలలో గొప్ప విజయాలు సాధించిన తల్లీ కూతుళ్లు ఎందరో ఉన్నారు. వారి నుండి ప్రేరణ పొందుదాం. అడ్డంకులను అధిగమించిన వారి సంకల్ప శక్తిని ఓ సారి గుర్తు చేసుకుందాం…
పౌర సేవకులు…
సివిల్‌ సర్వీసెస్‌ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న హిమాలి కాంబ్లే దాబీ, టీనా దాబీ అనే అసాధారణమైన తల్లీ కూతుళ్లను ఇప్పుడు మనం కలుసుకున్నాం. టీనా 2016 యూపీఎస్సీ టాపర్‌గా కీర్తిని పొందగా, రిటైర్డ్‌ ఇండియన్‌ ఇంజినీ రింగ్‌ సర్వీసెస్‌ (ఐఈఎస్‌) అధికారి హిమాలి కూడా ఒకప్పుడు యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. తన కూతుళ్లు టీనా, రియాలకు ఐఏఎస్‌ సాధించాలని బలమైన కోరిక. పిల్లల కలను నిజం చేయాలనే ఉద్దేశంతో వారికి అవసరమైన మార్గనిర్దేశం చేయాలనే కోరికతో హిమాలి తన పదవికి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. ఔత్సాహిక పౌర సేవకులను ప్రేరేపించారు. యూపీఎస్సీ వంటి కఠినమైన పరీక్షా ప్రక్రియను ఛేదించడంలో తల్లిగా పిల్లలకు మార్గదర్శకత్వం చేశారు.
– హిమాలి కాంబ్లే దాబీ, టీనా దాబీ
3డి జీబ్రా క్రాసింగ్‌ల రూపకల్పన
ఈ తల్లీకూతుళ్లల వినూత్న ఆలోచన భారతదేశంలో పాదచారుల భద్రతపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. పాదచారుల కోసం జీబ్రా క్రాసింగ్‌ల దృశ్యమానతను పెంచాల్సిన అవసరాన్ని గుర్తించారు. గుర్తించడంతోనే ఆగిపోలేదు. భారతదేశపు మొట్టమొదటి 3డి జీబ్రా క్రాసింగ్‌ల రూపకల్పనను వారు తమ బాధ్యతను తీసుకున్నారు. ఆ తల్లీ కూతుళ్లు చూపిన ఈ చొరవ వారి సృజనాత్మకతనే కాకుండా రహదారి భద్రతను మెరుగుపరచడంలో వారి అచంచలమైన నిబద్ధతను కూడా ప్రదర్శిస్తుంది. సాంప్రదాయిక విధానాలను అధిగమించడం ద్వారా దృశ్యపరంగా అద్భుతమైన పరిష్కారాన్ని పరిచయం చేశారు. కాస్త చేయూత ఉంటే తమ నైపుణ్యాన్ని ఉపయోగించి మహిళలు అద్భుతాలు సృష్టించగలరని చెప్పడానికి సౌమ్య, శకుంతలలు ఉదాహరణగా నిలిచారు. – సౌమ్య పాండ్య ఠాకూర్‌, శకుంతల పాండ్య

వైద్యాన్ని, వేగాన్ని మిళితం చేసి
కర్నాటకకు చెందిన ఈ తల్లీ కూతుళ్లు పవర్‌హౌస్‌ భారతదేశంలో మొట్టమొదటి ఆల్‌-మహిళా రేసింగ్‌ టీమ్‌గా అవతరించారు. ఆ రంగంలో మహిళలకున్న అడ్డంకులను అధిగమించారు. ప్రొఫెషనల్‌ ర్యాలీ రేసర్లు, ప్రాక్టీస్‌ చేసే వైద్యులుగా వైద్యం పట్ల వారి అంకితభావంతో, వేగం పట్ల వారి అభిరుచిని మిళితం చేశారు. శివాని ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. భారతదేశపు మొట్టమొదటి ఆల్‌-ఉమెన్‌ రేసింగ్‌ టీమ్‌లో ఆమె భాగం. అదే సమయంలో ప్రాక్టీస్‌ చేస్తున్న డాక్టర్‌, ప్రొఫెసర్‌ అయిన దీప్తి తన కుమార్తె రేసింగ్‌ కలలకు మద్దతునిస్తూ కో-డ్రైవర్‌, నావిగేటర్‌ పాత్రను పోషిస్తున్నారు. పురుషాధిక్య మోటార్‌స్పోర్ట్‌ రంగంలో శివాని, దీప్తి నిర్భయంగా తమ విజయానికి అవసరమైన మార్గాన్ని రూపొందించుకున్నారు. రేసులను గెలుచుకుని ఆ రంగంలో తమదైన ముద్ర వేశారు.
– దీప్తి పృథ్వీ, శివాని
గొప్ప ఎత్తులకు ఎదిగారు
ఆడ్రీ మాబెన్‌, అమీ మెహతా అద్భుతమైన తల్లీ కూతుళ్లని చెప్పవచ్చు. వారు తమలోని క్రియేటివితో గొప్ప ఎత్తులకు ఎదిగారు. ఆడ్రీ మాబెన్‌ భారతదేశపు మొట్టమొదటి మహిళా మైక్రో-లైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఫ్లయింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా చరిత్ర సృష్టించారు. తన ప్రయాణంతో ఔత్సాహిక మహిళా విమానయానకారులకు మార్గం సుగమం చేశారు. ఆమె తన కూతురు అమీ మెహతాతో కలిసి మైక్రోలైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రదక్షిణ యాత్రకు ప్రయత్నిం చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించారు. అసాధారణమైన ప్రయాణం చేసి ఎంతో మంది ప్రశంసలలను అందుకున్నారు.
– ఆడ్రీ మాబెన్‌, అమీ మెహతా
ఇంటి నుండి ఫీల్డ్‌కు
ప్రతిభ, అంకితభావం, కుటుంబ మద్దతు గురించి క్రీడా కారులైన ఈ తల్లీ కూతుళ్లు ఎంతో గొప్పగా చెబుతారు. హైజంప్‌లో జాతీయ రికార్డ్‌ హోల్డర్‌గా సహానా అద్భుతమైన కెరీర్‌ కొనసాగిస్తుంటే, లాంగ్‌ జంప్‌లో పవన విజయాలు సాధిస్తున్నారు. ఈ తల్లీ కూతుళ్లు క్రీడల్లో తామెంటో నీరూపించుకుంటున్నారు. వీరి ట్రాక్‌ ఇంటి నుండి ఫీల్డ్‌కు విస్తరించింది. యూ20 ఆసియన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో పవన గొప్ప విజయం, లాంగ్‌ జంప్‌లో ఆమె తల్లి చూపిన పట్టుదల వీరిద్దరిలో ఉన్న ప్రతిభను నొక్కి చెబుతుంది. అథ్లెటిక్స్‌ ప్రపంచాన్ని వారిద్దరు కలిసి నావిగేట్‌ చేస్తున్నారు. సహానా ఒక మార్గదర్శక శక్తిగా, పవన ఒక మంచి యువ క్రీడాకారిణిగా వారు భవిష్యత్‌లో సాధించేందుకు తమ ముందు పెద్ద విజయాలను లక్ష్యంగా పెట్టుకున్నారు.
– సహానా కుమారి, పవన నాగరాజ్‌

Spread the love