నవతెలంగాణ-చిట్యాల
బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం ప్రభుత్వాలను ప్రశ్నించిన మహానేత సుందరయ్య అని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అన్నారు. చిట్యాల మండలం నేరడ గ్రామంలో శుక్రవారం రాత్రి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంటరానితనాన్ని రూపుమాపటం కోసం సహపంక్తి బోజనాలు పెట్టించి, దేవాలయాల్లోకి తీసుకెళ్ళిన సుందరయ్య జీవితం ఎంతో ఆదర్శ ప్రాయమని ఆయన సేవలను కొనియాడారు. ముందుగా సుందరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం గ్రామంలో మేడే ప్రదర్శన చేసి ఎర్రజండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు కల్లూరి కుమారస్వామి, గ్రామశాఖ కార్యదర్శి కందగట్ల గణేష్, మాజీ సర్పంచ్ వడ్డెపల్లి ఎల్లయ్య, నాయకులు కల్లూరి లక్ష్మయ్య, మందుగుల యాదయ్య, కర్నాటి భిక్షం, పోలోజి ఈశ్వరాచారి, గంజి లక్ష్మయ్య, నర్సింహ్మచారి, క్షత్రయ్య,రూపని బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.