అడవులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాల్సిందే: సుప్రీంకోర్టు

నవతెలంగాణ-హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ, అడవులు, వన్యప్రాణుల రక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 48(ఏ)కు పౌరుల జీవించే హక్కుతో ప్రత్యక్ష సంబంధం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. దేశాన్ని, ప్రపంచాన్ని వాతావరణ మార్పుల దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ప్రభుత్వాలు అడవులను రక్షించాలని స్పష్టం చేసింది. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉన్న కొంపల్లి గ్రామంలో 1980ల నుంచి అటవీ భూమిని సొంత భూమిగా మార్చుకొనేందుకు ప్రయత్నిస్తున్న అబ్దుల్ ఖాసిం అనే వ్యక్తితో కలసి అధికారులు కుమ్మక్కు కావడంపై మండిపడింది. ఈ విషయంలో విరుద్ధమైన వైఖరి తీసుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది.

Spread the love