ఈవీఎంలకే సుప్రీం ఓటు

Supreme vote for EVMs– వీవీ ప్యాట్‌లపై పిటిషన్ల తిరస్కృతి
– పేపర్‌ బ్యాలెట్‌కు నో
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
వ్యవస్థలో మార్పు తీసుకొచ్చిన వాటిని గుడ్డిగా వ్యతిరేకించరాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వీవీ ప్యాట్‌లపై పిటిషన్‌ విచారణ సందర్భంగా శుక్రవారం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీవీ ప్యాట్‌లపై దాఖలైన అన్ని పిటిషన్లనూ కొట్టేసింది. ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వీవీ ప్యాట్‌లతో సరిపోల్చాలన్న పిటిషనర్ల వాదనతో కోర్టు ఏకీభవించలేదు. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. స్వల్ప మార్పులతో న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు వెలువరించారు. పేపర్‌ బ్యాలెట్‌ రూపంలో ఎన్నికలను నిర్వహించాలన్న పిటిషన్‌ను కూడా సుప్రీం తోసిపుచ్చింది. ”ఈవీఎంలతో వీవీ ప్యాట్‌ స్లిప్‌లు పోల్చి చూడాల్సిన అవసరం లేదు. స్లిప్‌లను తీసుకుని ఓటరు బాక్స్‌లో వేయాల్సిన అవసరం లేదు. ఈవీఎం సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటి పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నాం. సింబల్‌ లోడింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత యూనిట్‌ను సీల్‌ చేయాలి. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కనీసం 45 రోజుల పాటు ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను భద్రపరచాలి. అభ్యర్థులకు అనుమానం వస్తే ఫలితాల ప్రకటన తరువాత ఇంజినీర్ల బృందం ఈవీఎం మెమొరీని తనిఖీ చేస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏడు రోజులలోపు అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియజేయాలి. అందుకయ్యే ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే భరించాలి. ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్‌ జరిగినట్లు తేలితే అభ్యర్థుల ఖర్చులు తిరిగివ్వాలి. ఒక వ్యవస్థను గుడ్డిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అది అనవసర అనుమానాలకు దారి తీస్తుంది” అని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా తీర్పు సందర్భంగా పేర్కొన్నారు.

Spread the love